Updated : 11/02/2022 05:23 IST

మునగతో కోట్లు కురిపిస్తూ..

పచ్చదనం ఆరోగ్యాన్నే కాదు, అందాన్నీ పరిరక్షిస్తుందని తెలుసుకుంది. ‘గుడ్‌ లీఫ్‌’ పేరుతో మునగతో సౌందర్య ఉత్పత్తుల తయారీ ప్రారంభించి కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ, వందల మందికి ఉపాధిని కల్పిస్తోంది 26 ఏళ్ల దీపికారవి..

దీపిక వాళ్లది తమిళనాడులోని కరూరు. తండ్రి రవివేలు సామితో కలిసి పొలానికి వెళ్తూ ప్రకృతిపై ఆసక్తిని పెంచుకుంది. తమ జిల్లాలో అత్యధికంగా దిగుబడిచ్చే వాటిలో ఒకటైన మునక్కాయల విక్రయంలో తండ్రి ఎదుర్కొనే సవాళ్లను చూసేది. పండిన పంట విక్రయించడానికి సరిపడా మార్కెట్‌ ఉండేది కాదు. దాంతో కొంత పంట వృథా అయ్యేది. కేవలం కాయలే కాకుండా ఈ చెట్టులోని ఇతర భాగాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి దీపికకు కాస్త అవగాహన ఉంది. దానికి తోడు మరింత అధ్యయనం చేసింది. వీటితో సౌందర్య, ఆరోగ్య ఉత్పత్తులను తయారు చేయొచ్చనే ఆలోచన వచ్చింది తనకు. అలా ‘గుడ్‌ లీఫ్‌’ స్టార్టప్‌ 2017లో మొదలైంది.

200 మంది రైతులతో కలిసి...
మునగాకు, పువ్వులోని పోషక విలువలను అందరికీ చేర్చాలనుకున్నా అంటుంది దీపికారవి. ‘వీటితో ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడమే కాదు, చర్మసౌందర్యాన్నీ పెంచుకోవచ్చు. మునగ కల్పవృక్షం లాంటిది. పెంచడమూ తేలికే. వాతావరణం అనుకూలిస్తే చాలు. దిగుబడి బాగుంటుంది. ఐరన్‌, కాల్షియం, జింక్‌, ఫాస్ఫరస్‌ తదితర ఖనిజలవణాలు వీటిలో మెండు. యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు నిండుగా ఉండటంతో చర్మ సమస్యలు తొలగిపోతాయి. రక్తంలో చక్కెర స్థాయులను సమన్వయం చేసే ఔషధ గుణాలు వీటిలో ఎక్కువ. మొదట మా పొలంలో పెంచుతూనే, చుట్టు పక్కల వ్యవసాయదారులని కూడా సంప్రదించా. వారు పెంచుతున్న మునగ చెట్ల నుంచి ఆకులు, పూల దిగుబడిని వినియోగించుకుంటూ ఉత్పత్తుల తయారీని ప్రారంభించా. ఈ చెట్ల పెంపకమంతా సేంద్రియ పద్ధతిలోనే ఉండటంతో ఉత్పత్తుల్లో కూడా నాణ్యత ఉంటోంది. ఈ నాలుగేళ్లలో కరూర్‌ సహా దిండిగల్‌, తేని, వేలూరు తదితర జిల్లాల్లో 200 మంది రైతులు మాతో కలిసి పని చేస్తున్నారు. మొదట ముఖానికి, ఒంటికి, శిరోజాలకు ఉపయోగించడానికి పొడులు, క్యాప్సుల్స్‌, ఫేస్‌ప్యాక్‌ల తయారీ చేపట్టాం. ఎంతో అధ్యయనం, ప్రయోగాల తర్వాత ఇది సాధించగలిగా. వీటితోపాటు రైస్‌ మిక్స్‌, చట్నీ పౌడర్‌, టీపౌడర్‌ వంటివీ ప్రారంభించాం. మునగాకు హెయిర్‌ ఆయిల్‌, సీరం వంటివి కూడా అందిస్తున్నాం. మా వెబ్‌సైట్‌ ద్వారా రాష్ట్రేతర ప్రాంతాల వినియోగదారులకూ వీటిని చేర్చగలుగుతున్నాం. నాలుగేళ్లలోనే కోటి రూపాయల టర్నోవర్‌కు చేరుకోగలిగా. మార్కెటింగ్‌, ప్రాడక్ట్‌ డెవలప్‌మెంట్‌లో అమ్మానాన్న కూడా సాయ పడుతున్నారు. త్వరలో మునగాకుతో ఫేస్‌ క్రీం, ఫేస్‌వాష్‌ వంటివీ విడుదల చేయనున్నాం’ అని ఉత్సాహంగా చెప్పుకొచ్చింది దీపికా రవి. ఆలోచన, కృషి ఉండాలే కానీ మన చుట్టూనే ఎన్నో అవకాశాలున్నాయనడానికి నిదర్శనంగా ఉంది కదూ ఈ అమ్మాయి విజయగాథ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని