యాసిడ్‌ బాధితులకు ఆసరా తానియా...

విదేశంలో చదువుకుంటున్నప్పుడు అగ్నిప్రమాదానికి గురైందామె. శస్త్రచికిత్సలెన్ని జరిగినా ఆ గాయాలకు ఫలితం కనిపించక, ఇండియాకు తిరిగొచ్చింది. ఇక్కడి ఆసుపత్రులలో యాసిడ్‌, అగ్నిప్రమాద బాధితుల కష్టాలను చూసి కదిలిపోయింది. వారికి తన వంతు  చేయూతనందిస్తూ, యాసిడ్‌ విక్రయాలను నిషేధించాలంటూ పోరాటానికి శ్రీకారం చుట్టింది.

Published : 25 May 2022 01:41 IST

విదేశంలో చదువుకుంటున్నప్పుడు అగ్నిప్రమాదానికి గురైందామె. శస్త్రచికిత్సలెన్ని జరిగినా ఆ గాయాలకు ఫలితం కనిపించక, ఇండియాకు తిరిగొచ్చింది. ఇక్కడి ఆసుపత్రులలో యాసిడ్‌, అగ్నిప్రమాద బాధితుల కష్టాలను చూసి కదిలిపోయింది. వారికి తన వంతు  చేయూతనందిస్తూ, యాసిడ్‌ విక్రయాలను నిషేధించాలంటూ పోరాటానికి శ్రీకారం చుట్టింది. బాధితులకు వైద్యసేవలు అందించడంతో పాటు పునరావాసాన్నీ కల్పిస్తున్న 30 ఏళ్ల తానియాసింగ్‌ కథ ఇది.

మేనేజ్‌మెంటు కోర్సు చేయడానికి దిల్లీ నుంచి తానియా సింగపూర్‌ వెళ్లింది. తన అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో చిక్కుకుని తీవ్ర గాయాలపాలైంది. ఎన్ని శస్త్రచికిత్సలు చేసినా ఫలితం కనిపించక, తిరిగి దిల్లీ చేరుకుంది. తల్లిదండ్రులతో కలిసి ఆసుపత్రులకు వెళ్లినప్పుడు అక్కడ సమయానికి చికిత్స అందక యాసిడ్‌, అగ్నిప్రమాద  బాధితులు కొందరు చనిపోవడం తానియా కళ్లారా చూసింది. భరించలేకపోయింది. ఇటువంటి వారికోసం ఏదైనా చేయాలనుకున్నా అంటుందీమె. ‘ముందుగా వీరి పరిస్థితిపై అవగాహన తెచ్చుకోవాలనుకున్నా. ఆన్‌లైన్‌లో ఆరా తీసినప్పుడు రియాశర్మ గురించి తెలిసింది. యాసిడ్‌ బాధితులకు ఆమె తన వంతు సేవలందిస్తోంది. తనకు విరాళంగా రూ.లక్ష రూపాయలు ఇద్దామని వెళ్లా. ఆ నగదును తీసుకోవడానికి రియా నిరాకరించింది. ఆసక్తి ఉంటే తాను ప్రారంభించిన ‘మేక్‌ లవ్‌ నాట్‌ స్కేర్స్‌ (ఎమ్మెల్‌ఎన్‌ఎస్‌)’ ఎన్జీవోకు సహకరించమని అడిగింది. బాధితులకు పునరావాసాన్ని కల్పించడంలో కలిసి పని చేద్దామంది. అలా ఈ సేవలో భాగస్వామినయ్యా. ఇద్దరం కలిసి దిల్లీలో పునరావాసకేంద్రాన్ని ప్రారంభించాం. యాసిడ్‌ బాధితులను కలుసుకొని వారి ఇబ్బందులు, సమస్యలను తెలుసుకునేవాళ్లం. ఇందుకు బోలెడంత డబ్బు కావాలి కదా... అందుకే తిరిగి సింగపూర్‌ వెళ్లి ఉద్యోగంలో చేరా. వారాంతంలో దిల్లీ వచ్చి ఇక్కడ సేవలందించే దాన్ని. అయితే సమయం సరిపోయేది కాదు. దాంతో మూడు నెలలకే ఉద్యోగానికి రాజీనామా చేసి మళ్లీ దిల్లీ వచ్చేశా. 2016లో యాసిడ్‌, అగ్నిప్రమాద బాధితులు నివసించడానికి సౌకర్యాలతో కూడిన ఓ కేంద్రాన్ని ప్రారంభించాం. దేశంలోనే తొలి రెసిడెన్షియల్‌ ఫెసిలిటీ సెంటర్‌ ఇది. బాధితులెవరైనా ఇక్కడ ఉండొచ్చు. వారికి శారీరక, మానసికారోగ్యాన్ని పరిరక్షించేలా ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు యోగా, ధ్యానం వంటివి ఏర్పాటు చేశాం. వారి కాళ్లపై వారు నిలబడేలా హస్తకళల్లో శిక్షణ ఇప్పిస్తున్నాం. వారి పిల్లలను పాఠశాలలో చేర్పించి విద్య అందిస్తున్నాం. వీటికంతా క్రౌడ్‌ ఫండ్‌ను ఆశ్రయిస్తున్నాం. బాలీవుడ్‌ నటుడు షారూఖ్‌ఖాన్‌ స్థాపించిన మీర్‌ ఫౌండేషన్‌ సాయంతో బాధితులకు శస్త్రచికిత్సలూ చేయిస్తున్నాం’ అని చెప్పుకొచ్చింది తానియా.

ప్రచారం దిశగా..

యాసిడ్‌ దాడులను నియంత్రించాలంటే ముందుగా యాసిడ్‌ విక్రయాలను నిషేధించాలనే ఆలోచనతో ఎమ్మెల్‌ఎన్‌ఎస్‌ ఆధ్వర్యంలో ‘స్లాష్‌ ఎండ్‌ యాసిడ్‌సేల్‌’ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించారు తానియా, రియా బృందం. బాధితులతో తీసిన వీడియోలను విడుదల చేశారు. 2015లో ఈ వీడియోలను మూడున్నర లక్షలమంది వీక్షించడమే కాదు, ఈ అంశంపై కోర్టులో పిటీషన్‌ దాఖలు కావడానికి ఆన్‌లైన్‌లో తమ మద్దతునూ తెలిపారు. సుప్రీంకోర్టు ఈ అంశంపై స్పందించింది. అదే ఏడాది డిసెంబరులో యాసిడ్‌ విక్రయాలను నిలిపేయాలంటూ, ఫలానా సంస్థ ఐడీ కార్డు ఉంటే మాత్రమే యాసిడ్‌ కొనడానికి అర్హత ఉంటుందంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఎమ్మెల్‌ఎన్‌ఎస్‌’ సీఈవోగా తానియా ఇప్పటివరకు 100 మందికిపైగా యాసిడ్‌ బాధితులకు చేయూతగా నిలిచింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని