ఇలాంటి నాన్నుంటే..!

నాన్న పక్కనుంటే అదో ధైర్యం. ఎండాకాలంలో నీడలా, వానాకాలంలో గొడుగులా, శీతాకాలంలో చలిమంటలా... ప్రతి సమస్యకీ పరిష్కారంలా కనిపిస్తారాయన. అమ్మ జన్మనిస్తే... దాన్ని సార్థకం చేసుకోవడంలో మార్గనిర్దేశం చేస్తారు నాన్న. తమ జీవితాల్ని తీర్చిదిద్దిన నాన్న గురించి ‘నాన్నల దినోత్సవం’ సందర్భంగా ఈ ఇద్దరూ ఏం చెబుతున్నారంటే...  

Updated : 19 Jun 2022 07:05 IST

నాన్న పక్కనుంటే అదో ధైర్యం. ఎండాకాలంలో నీడలా, వానాకాలంలో గొడుగులా, శీతాకాలంలో చలిమంటలా... ప్రతి సమస్యకీ పరిష్కారంలా కనిపిస్తారాయన. అమ్మ జన్మనిస్తే... దాన్ని సార్థకం చేసుకోవడంలో మార్గనిర్దేశం చేస్తారు నాన్న. తమ జీవితాల్ని తీర్చిదిద్దిన నాన్న గురించి ‘నాన్నల దినోత్సవం’ సందర్భంగా ఈ ఇద్దరూ ఏం చెబుతున్నారంటే...  


నాన్నలేనిదే నేను లేను

ఛాంపియన్లు పుట్టరు తయారవుతారనడానికి ఉదాహరణ నిఖత్‌ జరీన్‌. అంతగా అవకాశాలూ సౌకర్యాలూ లేని ప్రాంతం నుంచి ప్రపంచ మహిళా బాక్సింగ్‌ ఛాంపియన్‌గా నిఖత్‌ని తీర్చిదిద్దారు జమీల్‌ హైమద్‌. ‘నా కోసం నాన్న ఎంత తపన పడ్డారో’ అంటూ.. తన అంతరంగాన్ని  ఆవిష్కరించిందిలా...

రోజు బాక్సింగ్‌లో ప్రపంచస్థాయి ఛాంపియన్‌గా ఎదిగానంటే అందుకు నాన్న తపన, అందించిన ప్రోత్సాహమే కారణం. నాన్నకి క్రీడలంటే ఇష్టం. చిన్నపుడు ఫుట్‌బాల్‌ ఆడేవారు. పెళ్లి తర్వాత గల్ఫ్‌లో ఉద్యోగం చేసేవారు. 2006లో తిరిగి వచ్చారు. ఉన్న డబ్బులతో నిజామాబాద్‌లో ఇల్లు కట్టారు. తర్వాత చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. అప్పటికి నాకు పదేళ్లు. రోజూ గ్రౌండ్‌కు తీసుకెళ్లేవారు. మొదట అథ్లెటిక్స్‌ ఆడేదాన్ని. బాక్సింగ్‌ వైపు వెళ్తానంటే అడ్డుచెప్పలేదు. బంధువులు, తెలిసినవాళ్లు... మాత్రం మాటలతో ఇబ్బంది పెట్టేవారు. అవన్నీ చూసి ఒకానొక దశలో మానేద్దామనుకున్నా. నాన్న మాత్రం ‘ఇవేమీ పట్టించుకోవద్దు ఇప్పుడు విమర్శలు చేసేటోల్లంతా ఒకరోజు నీతో ఫొటోలు దిగాలనుకుంటార’ని ధైర్యం చెప్పి వెన్నుతట్టేవారు. నా కెరియర్‌ కోసమని భారంగానే వైజాగ్‌లోని శాయ్‌ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్చారు. నాలుగేళ్లు అక్కడే ఉన్నా. జూనియర్‌ స్థాయి దాటాక అక్కడ ఉండటానికి కుదరదన్నారు. హైదరాబాద్‌లో శిక్షణ ఇప్పించమన్నారు. ఆ సమయంలో అక్కలిద్దరూ పైచదువులకు వచ్చారు. హైదరాబాద్‌లో ఉండటానికి డబ్బు లేదు. కొన్ని నెలలపాటు ప్రయత్నించి ముఖ్యమంత్రి  ఆర్థిక సాయం సంపాదించారు. తర్వాత హైదరాబాద్‌లో ఇల్లు తీసుకుని నాతోపాటు ఉండేవారు. నాకోసం వంట చేసేవారు. టోర్నీలకు తోడుగా వస్తారు. ఓటమి చెందితే డీలా పడిపోయేదాన్ని. ఆ సమయంలో నాన్నే ఓదార్చేవారు. పోటీల్లో నాకు దెబ్బలు తగిలితే తన ప్రాణం విలవిల్లాడేది. ఆ బాధ బయటకు తెలియనివ్వకుండా నన్ను తర్వాత పోటీకి సిద్ధం చేసేవారు. మేరీకోమ్‌ సంఘటనపుడు చాలా డీలా పడ్డా. ‘ఇది తాత్కాలికమే. నీ బంగారు భవిష్యత్తు ముందుంది’ అని ఓదార్చారు. అక్కలిద్దరూ ఫిజియోథెరపిస్టులు. వాళ్లకి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేశారు. చెల్లి బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌. ప్రస్తుతం తను హైదరాబాద్‌లోని ఓ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది. అందరూ ఆడపిల్లలేనని నాన్న నిరుత్సాహపడిన సందర్భం మాకెప్పుడూ కనిపించలేదు. ఇలాంటి నాన్న ఉంటే ఏ అమ్మాయైనా అనుకున్నది సాధించగలదు. అక్కాచెల్లెళ్లమంతా కలిసి రుచికరమైన వంటకాలు వండి ఈరోజు నాన్నతో కలిసి భోజనం చేయాలనుకున్నాం.

- రేవళ్ల వెంకటేశ్వర్లు, నిజామాబాద్‌


నాన్నలందరూ అలానే ఉంటారనుకున్నా!

చక్రవర్తి రంగరాజన్‌... గుర్తున్నారుగా! ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ గవర్నర్‌... ఆయన కుమార్తె రాధ. హెల్త్‌క్యూబ్‌ అనే సంస్థకు చీఫ్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌, విటాస్‌ ఫార్మా వ్యవస్థాపకురాలూ, సీఈఓ. తన కెరియర్‌, వ్యక్తిత్వం తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర గురించి చెబుతారిలా..

నాకప్పుడు నాలుగైదేళ్లుంటాయి.. నాన్న ఐఐఎమ్‌-అహ్మదాబాద్‌లో ప్రొఫెసర్‌. లంచ్‌కి ఇంటికి వచ్చినపుడు నాకు తినిపించి, నిద్రపుచ్చి తిరిగి క్లాసులకి వెళ్లేవారు. ఒక్కోసారి మారాం చేసి ఆయనతో వెళ్లేదాన్ని. నాన్న పాఠాలు చెబుతుంటే సుద్ద ముక్క పట్టుకుని వెనక బోర్డుమీద బొమ్మలు గీసేదాన్ని, అంకెలు రాసేదాన్ని. తండ్రులందరూ పిల్లల్ని ఇలానే చూస్తారనుకునేదాన్ని. అన్నయ్య, నేను పుట్టాక అమ్మను ప్రోత్సహించి బీఎడ్‌ చేయించారు. తర్వాత చరిత్రలో పీజీ, ఆపైన 45 ఏళ్లకి పీహెచ్‌డీ సీటు సాధించి నాన్న ప్రోత్సాహంతో అదీ పూర్తి చేయగలిగింది. అప్పుడు తన పనివేళల్ని సర్దుబాటు చేసుకుని మరీ మా బాగోగులు చూసుకున్నారు నాన్న.   మహిళలకు ఆర్థిక స్వావలంబన ముఖ్యమనేవారు. ఆర్బీఐ గవర్నర్‌గా స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకు ఖాతాలు తెరుచుకునే వీలు ఆయనే కల్పించారు. అన్నయ్యలా గ్రాడ్యుయేషన్‌ కోసం అమెరికా వెళ్తానంటే ఆడపిల్లనని నిరుత్సాహపరచకుండా ‘కచ్చితంగా వెళ్లు.. వాడిలా స్కాలర్‌షిప్‌ తెచ్చుకుని నువ్వేమీ తక్కువకాదని నిరూపించుకోవాలి’ అని ప్రోత్సహించేవారు. అలా ఎనభైల్లోనే అమెరికా వెళ్లి బయాలజీ, అంటువ్యాధులపైన గ్రాడ్యుయేషన్‌, మాస్టర్స్‌, పీహెచ్‌డీ, పోస్ట్‌ డాక్టోరల్‌ చేయగలిగా. మాకోసం సమయం కేటాయిస్తూ తన అనుభవాలనీ, జ్ఞాపకాలనీ పంచుకునేవారు. తాతయ్య ఆయుర్వేద వైద్యులు. సొంతంగా కొన్ని మందుల్ని కనిపెట్టి బోదకాలు వంటి కఠినమైన వ్యాధుల్ని నయం చేసేవారనీ, వైద్యం కోసం ఆయన దగ్గరకు సుదూరాలనుంచీ వచ్చేవారనీ.. ఇలా తాతగారి గురించి చాలా చెప్పేవారు. నేను ఆరోగ్య రంగం ఎంచుకోవడానికీ, పరిశోధకురాలిగా మారడానికీ ఆ మాటలే స్ఫూర్తి. తనకు ఇబ్బంది అయినా, నేను తల్లి అయినప్పుడు అమ్మని నా దగ్గరకి పంపారు. ఉద్యోగం వదిలి సొంత సంస్థ పెట్టినపుడు కాస్త ఆందోళన చెందినా నా తపన చూసి ప్రోత్సహించారు. ప్రస్తుతం ‘మద్రాస్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌’ వ్యవహారాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. పత్రికలకు వ్యాసాలనీ రాస్తుంటారు. నాన్న మాకెప్పుడూ సూచనలూ, సలహాలూ పాఠాల్లాగా చెప్పలేదు. ఆయన్ని చూస్తూనే క్రమశిక్షణ, అంకితభావం, కెరియర్‌ నిర్మాణం... వంటివన్నీ అలవర్చుకున్నాం.

- జె.రాజు హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్