పచ్చా పచ్చని సలహాలు..లక్షల అభిమానులు!
ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం... నిలువెత్తుగా తల ఎత్తడం నేర్పేందుకు అదే తొలిపాఠం... అంటారో గీతంలో సిరివెన్నెల. అలాంటి పాఠాలు నేర్చుకుంటూ పెరిగారీ అమ్మాయిలు... ఆ పాఠాలను పదిమందికీ పంచడం కోసం ఉన్నత చదువులు, పెద్ద ఉద్యోగాలను పక్కన పెట్టేశారు. ఇప్పుడు లక్షలమందిని అలరిస్తున్నారు...
ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం... నిలువెత్తుగా తల ఎత్తడం నేర్పేందుకు అదే తొలిపాఠం... అంటారో గీతంలో సిరివెన్నెల. అలాంటి పాఠాలు నేర్చుకుంటూ పెరిగారీ అమ్మాయిలు... ఆ పాఠాలను పదిమందికీ పంచడం కోసం ఉన్నత చదువులు, పెద్ద ఉద్యోగాలను పక్కన పెట్టేశారు. ఇప్పుడు లక్షలమందిని అలరిస్తున్నారు...
పీహెచ్‌డీ చేసినా...
ఏక్తా చౌదరి.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) నుంచి ఎకాలజీలో పీహెచ్‌డీ చేసింది. పరిశోధనకు సంబంధించి సమాచార సేకరణ, ఎనాలసిస్ లాంటి ఫీల్డ్‌వర్క్ అంతా అయ్యింది. డెస్క్ వర్క్ మాత్రం మిగిలింది. ఎంతసేపూ కూర్చొని చేసే పనే! బోర్ అనిపించింది. సరదాగా ఉంటుందని హాస్టల్ గదిలో మొక్కలు తెచ్చిపెట్టుకుంది. కొద్ది రోజుల్లోనే కీటకాలు, పోషణ సమస్యలు చుట్టుముట్టాయి. ఆన్‌లైన్‌లో వాటి గురించి తెలుసుకునేది. త్వరగానే వాటిపై పట్టూ సాధించింది. ఈ విశేషాలను అందరితో పంచుకోవాలనిపించి 2017లో యూట్యూబ్‌లో ‘గార్డెన్ అప్’ ఛానల్‌ను ప్రారంభించింది. ఈమెది బెంగళూరు. దిల్లీలో లైఫ్ సైన్సెస్‌లో డిగ్రీ, దేహ్రాదూన్‌లో మాస్టర్స్ చేసింది.
‘మొక్కలతో అనుబంధం ఎప్పుడు ప్రారంభమైందీ అంటే చెప్పలేను. మా ఇంటి చుట్టూ మొక్కలే.. అలా చిన్నతనం నుంచీ నా జీవనశైలిలో భాగమయ్యాయి. అవి మానసిక ఆరోగ్యానికీ సాయపడతాయని అర్థమైంది. అందుకే హాస్టల్ గదిలోకీ వాటిని తీసుకొచ్చా. మొదటిసారిగా సంరక్షణంతా నేనే స్వయంగా చూసుకున్నా కదా! జాగ్రత్తల కోసం నెట్‌లో తెగ వెతికే దాన్ని. దానికితోడు నా పరిశోధనతో అవగాహన బాగా పెరిగింది. దీంతో అందరితో పంచుకోవాలనుకున్నా. విషయాన్ని కథలా ఆసక్తిగా వివరించడం నాకలవాటు. అలాగే ప్రతిదాన్నీ ఉపయోగించడం వెనక కారణాన్నీ చెబుతా. అలాగైతే బాగా గుర్తుంటుంది. తక్కువ స్థలంలో పెంచుకునే మార్గాలనూ వివరిస్తా. సేంద్రియ పద్ధతులకే నా ప్రాధాన్యం. దీంతో త్వరలోనే చాలామంది అభిమానులయ్యారు’ అని చెబుతోంది ఏక్తా. ఈమె ఛానెల్‌ను 14 లక్షల మందికిపైగా అనుసరిస్తున్నారు. 2018లో పెళ్లి చేసుకుని ముంబయిలో స్థిరపడింది ఏక్తా. 2019లో గార్డెన్ అప్ పేరుతోనే దుకాణాన్నీ, ఆన్‌లైన్ స్టోర్‌నీ తెరిచింది. చేతివృత్తుల వారు తయారు చేసిన ప్లాంటర్స్, మొక్కలు, ఎరువులు, కంపోస్ట్ వంటివన్నీ విక్రయిస్తోంది. తద్వారా మహిళా చేతివృత్తుల వారికీ ఉపాధి కల్పిస్తోంది. మొదట్లో వీడియోలు ఇంగ్లిష్‌లోనే ఉండేవి. ఇప్పుడు హిందీలోనూ వివరిస్తోంది. అంతే కాదు.. కార్పొరేట్ సంస్థలు, విద్యాసంస్థల్లో వర్క్‌షాప్‌లూ, గార్డెనింగ్ కోర్సులు, తరగతులూ నిర్వహిస్తోంది ఏక్తా.
ప్రభుత్వ ఉద్యోగం కాదని..
చిన్నప్పటి నుంచీ రేష్మా రంజన్ దినచర్య మొక్కల సంరక్షణతోనే మొదలయ్యేది. ఇదంతా తన అమ్మమ్మ, తాతల చలవే. ఈమె బిహార్‌లో వాళ్ల దగ్గరే పెరిగింది. అమ్మమ్మ పూలు, కూరగాయల మొక్కల్ని పెంచుతూ ఆ పరిజ్ఞానాన్ని తనతో పంచుకునేది. అవన్నీ రేష్మ మనసులో నాటుకు పోయాయి. తర్వాత ఝార్ఖండ్‌లోని అమ్మానాన్న దగ్గరికొచ్చినా వాటిని కొనసాగిస్తూ వచ్చింది. ఆ ఇష్టంతోనే ఇంటర్‌లో బైపీసీ తీసుకుంది. అగ్రికల్చర్ సైన్స్ చదివితే రైతులకీ ఉపయోగపడొచ్చనుకుంది. అనుకున్నట్టుగానే పూర్తిచేసి, ప్రభుత్వ విభాగంలో 2015లో అగ్రికల్చర్ కోఆర్డినేటర్ కూడా అయ్యింది. కానీ అక్కడే తనకు వాస్తవం బోధపడింది.
‘నేను కోరుకున్నట్టుగా నా ఉద్యోగం రైతులకు సాయపడేదే. కానీ వాళ్లు మార్పును అంగీకరించేవారు కాదు. దీనికితోడు కొలువులో పడి మొక్కలు పెంచే తీరికా ఉండేది కాదు. రెండు విధాలా సంతృప్తి లేకపోవడంతో ఉద్యోగం మానేశా. కనీసం చుట్టుపక్కల ఆసక్తి ఉన్న కొందరికి సాయపడినా నయమనిపించింది. అప్పుడే సామాజిక మాధ్యమాల్లో గార్డెనింగ్ పట్ల ఎంతోమంది ఆసక్తి కనబరుస్తుండటం చూశా. అమ్మమ్మా తాతయ్యల అనుభవం మరింత మందికి పంచాలనిపించి యూట్యూబ్‌లో ‘ప్రకృతీస్ గార్డెన్’ ప్రారంభించా. ఇది నాలాంటి ఎంతో మందిని పరిచయం చేసింది. పూలు, పండ్లు సహజ పద్ధతుల్లో ఎలా పెంచాలి, ఎక్కువ కాలం పాటు పూలు పూయడానికీ, కాయలు కాయడానికీ ఏం చేయాలి వంటి వాటిపై సూచనలిస్తుంటా. దీంతో సబ్‌స్క్రైబర్లు పెరిగారు. వివిధ బ్రాండ్లూ ప్రచారం కోసం సంప్రదించాయి. అలా ఆదాయమూ మొదలైంది. వ్యాపకం కోసం మంచి ఉద్యోగం కాదన్నానని విమర్శించినవారే ఇప్పుడు నన్ను చూసి ఆశ్చర్యపోతున్నారు’ అని సంతోషంగా చెబుతోంది రేష్మ. ఈమె యూట్యూబ్ ఖాతాకు తొమ్మిదిన్నర లక్షల మంది సబ్‌స్క్రైబర్లున్నారు. ఆకుకూరలు, కూరగాయలు, పూల మొక్కలే కాదు.. స్ట్రాబెరీ, డ్రాగన్ ఫ్రూట్ వంటి విదేశీ రకాల పెంపకాన్నీ చెబుతోంది. సేంద్రియ పద్ధతినే ఉపయోగిస్తుంది. ఈమె దగ్గర దాదాపు 2000 రకాల మొక్కలుంటే అవన్నీ కుండీల్లో పెంచినవే. అదేమంటే... ‘రేపొద్దున పెళ్లితో వేరే ఇంటికి చేరితే వీటినీ తీసుకెళ్లాలిగా! పైగా అందరికీ విశాలమైన ప్రదేశాలుండవు. తక్కువ స్థలంలో మొక్కల్ని ఎలా పెంచుకోవచ్చో ఇలా చేస్తూ... చెప్పొచ్చు కూడా’ అని వివరిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.