ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మి... 20 దేశాలు... 4 వేల ప్రదర్శనలు

పట్టుచీర, ఒంటినిండా ఆభరణాలూ, కొట్టొచ్చినట్టు కనిపించే ముక్కు పుడక... ఆమె కచేరీ అంటే.. సంప్రదాయ పాటలనే ఊహిస్తారెవరైనా! కానీ దానికి  భిన్నంగా శాక్సాఫోన్‌ చేతబట్టి శాస్త్రీయ సంగీతంతో మొదలుపెట్టి హిప్‌ హాప్‌, పాప్‌, ఫ్యూజన్‌లతో అదరగొట్టేస్తుంది ఎం.ఎస్‌.సుబ్బలక్ష్మి. ‘శాక్సాఫోన్‌ సుబ్బలక్ష్మి’గా గుర్తింపు తెచ్చుకుని వేల కచేరీలిచ్చింది.

Updated : 08 Oct 2022 07:43 IST

పట్టుచీర, ఒంటినిండా ఆభరణాలూ, కొట్టొచ్చినట్టు కనిపించే ముక్కు పుడక... ఆమె కచేరీ అంటే.. సంప్రదాయ పాటలనే ఊహిస్తారెవరైనా! కానీ దానికి  భిన్నంగా శాక్సాఫోన్‌ చేతబట్టి శాస్త్రీయ సంగీతంతో మొదలుపెట్టి హిప్‌ హాప్‌, పాప్‌, ఫ్యూజన్‌లతో అదరగొట్టేస్తుంది ఎం.ఎస్‌.సుబ్బలక్ష్మి. ‘శాక్సాఫోన్‌ సుబ్బలక్ష్మి’గా గుర్తింపు తెచ్చుకుని వేల కచేరీలిచ్చింది. ఎంతో వివక్ష, సవాళ్లను ఎదుర్కొని మరీ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఆవిడ వసుంధరతో తన జీవనయానాన్ని పంచుకున్నారిలా..

సాధ్యమన్న పనినే చేసి చూపించాలనిపిస్తుంది కొందరికి. నేనూ అంతే. శాక్సాఫోన్‌ శిక్షణలో చేరినపుడు 16 మంది అబ్బాయిల మధ్య.. ఒకే ఒక్క అమ్మాయిని. గురువుగారి దగ్గర శాక్సాఫోన్‌ నేర్చుకున్న మొదటి అమ్మాయినీ. రెండు నెలలు అయ్యాక శాక్సాఫోన్‌ పట్టుకుని ఓ పాటను ప్రయత్నిస్తే అందుకోలేక పోయా. క్లాసంతా నవ్వులు. స్నేహితులూ, బంధువులూ ‘నీకు అసాధ్యం’ అన్నారు. చేసి చూపిస్తానని ఆరోజే గట్టిగా నిర్ణయించుకున్నా.

కళాకారుల కుటుంబం

మాది మంగళూరు. తాతయ్య ఎం.ఆర్‌.రాజప్ప మైసూరు ఆస్థాన విద్వాంసులు. నాన్న సాయినాథ్‌ ఆకాశవాణి ‘ఏ’ గ్రేడ్‌ కళాకారుడు. మృదంగ వాద్య నిష్ణాతులిద్దరూ. అయిదేళ్లకే అమ్మానాన్నల దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకోవడం ప్రారంభించా. గాత్రం, మృదంగమూ ప్రయత్నించా. నాన్నతో పాటు కచేరీల్లో పాడేదాన్ని. విఖ్యాత శాక్సాఫోన్‌ కళాకారులు కద్రి గోపాలనాథ్‌ బృందంలో నాన్న మృదంగం వాయించేవారు. గోపాలనాథ్‌ శాక్సాఫోన్‌తో శబ్దాల్ని పలికించడం మొదటిసారి చూసినపుడే నేనూ నేర్చుకుంటానని నాన్నకు చెప్పా. అది అమ్మాయిలకు కష్టం అన్నారు. పట్టు బట్టడంతో ఆయన దగ్గరే శిక్షణకు చేర్చారు. అప్పట్లో బక్కగా ఉండేదాన్ని. శాక్సాఫోన్‌ పట్టుకుని ఊదాలంటే శక్తి అవసరం.. బాగా తినమని గురువుగారి శ్రీమతి సలహా ఇచ్చారు. కొన్నాళ్లకు పట్టు సాధించా. తర్వాత అక్క లావణ్య కూడా నేర్చుకుంది.

కలిసి దేవాలయాల్లో కచేరీలు చేసేవాళ్లం. బదులుగా బియ్యం, బెల్లం ఇచ్చేవారు. ఆడపిల్లలం కావడంతో ఆ అవకాశాలూ తక్కువే. అప్పుడప్పుడూ గురువుగారి కచేరీల్లోనూ చేసేదాన్ని. గుర్తింపు వచ్చాక సొంత బృందాన్ని ఏర్పాటు చేసుకున్నా. దేవాలయాల్లోనే మా కచేరీలుండేవి. నాన్న రిటైరవ్వడం, అమ్మ అనారోగ్యం.. దీంతో నా సంపాదన తప్పనిసరైంది. కచేరీల్ని పెంచుకో వాలని.. హోటళ్లూ, కంపెనీల ఉత్సవాల్లో అవకాశాల కోసం ప్రయత్నించా. మొదట అంగీకరించినా.. అమ్మాయి అనగానే పెదవి విరిచేవాళ్లు. కొందరైతే పది నిమిషాలే అవకాశం ఇచ్చేవారు. అబ్బాయిలకైతే గంటపైనే ఇచ్చేవారు. దాన్ని బట్టే మా ఆదాయమూ ఉండేది. సంగీత కార్యక్రమాల్లో శ్రోతలు సాయంత్రానికి ఎక్కువగా వస్తారు. నాకు మధ్యాహ్నం సమయం ఇచ్చేవారు. ఎన్నోసార్లు ఇద్దరు ముగ్గురి ముందే కచేరీ చేశా. ఈ అసంతృప్తులేవీ పాటలో కనిపించకుండా చూసుకునే దాన్ని. మావారు కిరణ్‌ కుమార్‌. ఐటీ ఉద్యోగిగా ఉన్నప్పుడు తన పరిచయాలతో కంపెనీల్లో ప్రదర్శనలు ఇప్పించేవారు. తనిప్పుడు నా షోల వ్యవహారాలు చూస్తున్నారు. దేశమంతా కార్పొరేట్‌ కంపెనీల్లో ప్రదర్శనలు ఇస్తుంటా. ప్రస్తుతం నా చేతిలో ఏడాదికి సరిపడా కచేరీలున్నాయి!  20 దేశాల్లో 4 వేల ప్రదర్శనలిచ్చా. ‘నీకు అసాధ్యం’ అన్న వాళ్లతోనే శభాష్‌ అనిపించుకున్నా.


ప్రసవానికి ముందురోజూ..

2009లో గర్భం దాల్చినప్పుడు.. ప్రదర్శనలు ఇవ్వలేననుకుని అడ్వాన్సులు వెనక్కి ఇచ్చేయమనేవారు. చేస్తానన్నా విన్లేదు కొందరు. పట్టుదలతో అప్పుడూ ప్రదర్శనలిచ్చా. డెలివరికీ ముందు రోజూ, ప్రసవమైన పది రోజులకే కచేరీలు చేయడాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నాలుగు కిలోల బరువుండే వాద్యాన్ని ఆ సమయంలో గంటల కొద్దీ మోయడం కష్టమనిపించేది. కానీ మాట తప్పడం నచ్చక అలానే చేసే దాన్ని.

- కె.ముకుంద బెంగళూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్