అమ్మల కోసం.. ఆమె!

కెరియర్‌లో ఎంత దూసుకెళుతున్న వారికైనా అమ్మయ్యాక ఓ కుదుపు ఖాయం. పిల్లలనీ, ఆఫీసు బాధ్యతల్నీ సమన్వయం చేసుకోలేక ఉద్యోగాన్నీ వదులుకుంటారు.

Updated : 04 Jun 2023 06:33 IST

కెరియర్‌లో ఎంత దూసుకెళుతున్న వారికైనా అమ్మయ్యాక ఓ కుదుపు ఖాయం. పిల్లలనీ, ఆఫీసు బాధ్యతల్నీ సమన్వయం చేసుకోలేక ఉద్యోగాన్నీ వదులుకుంటారు. ఆ తర్వాత? కష్టపడిన చదువు, ప్రతిభ వృథా అయిన భావన. శంకర పరిస్థితీ అలాంటిదే! తనలా ఎందరో ఇలా నలిగిపోతున్నారని గ్రహించిన ఆమె.. దానికో మార్గాన్నీ కనిపెట్టింది.

చిన్నప్పట్నుంచీ మంచి విద్యార్థినిగా పేరు తెచ్చుకుంది శంకర కర్పగం. దానికి తగ్గట్టే చదువు పూర్తవుతుండగానే మంచి కొలువొచ్చింది. ఇంతలో పెళ్లి, బాబు. అమ్మయ్యాక కెరియర్‌నీ కుటుంబాన్నీ చూసుకోవడం ఇబ్బంది అయ్యిందామెకు. పిల్లాడిని నిర్లక్ష్యం చేయడం కంటే ఉద్యోగాన్ని పక్కన పెట్టడమే నయమనుకుంది. తన బాగోగులు చూసుకుంటూ గడిపేయడం మొదలుపెట్టింది. అప్పటిదాకా తన కాళ్లపై తాను నిలబడిన ఆమెకి ప్రతి చిన్న అవసరానికీ భర్త, ఇంట్లోవాళ్ల ముందు చేయి చాపడం ఇబ్బందిగా తోచింది. ‘ఇంట్లో ఖాళీ’ అన్న ఊహ తనను కుంగదీయడం గమనించింది. ఇలా కాదని పిల్లాడిని చూసుకుంటూనే సంపాదించే మార్గాల కోసం వెదికింది. అలాంటి అవకాశాలే కనిపించలేదామెకు. తర్వాత తనలాగే ఎంతోమంది పరిస్థితిదని అర్థమయ్యాక పరిష్కారాలకోసం ప్రయత్నించింది 30 ఏళ్ల శంకర.

వీళ్లది చెన్నై దగ్గర తూత్తుకూడి. మధ్యతరగతి కుటుంబం. అయినా పై చదువులు చదివించాలనుకున్నారు అమ్మానాన్న. బంధువులు వారిస్తున్నా కూతురిని ప్రోత్సహించారు. తగ్గట్టుగానే ఎంఐటీలో సీటు, చదువు పూర్తయ్యాక ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం సాధించింది తను. నాయకత్వ స్థాయికీ ఎదిగింది. ‘అలాంటి నేను కుంగిపోవడమేంటి అనుకున్నా. ఉద్యోగం చేసేప్పుడు బోలెడు పరిచయాలు. వాళ్లతో మాట్లాడా. నా సమస్యనే చెబుతూ.. నాలాంటి తల్లులకు అవకాశాలు కల్పించగలమా అని అడిగా. కొందరు ముందుకొచ్చారు. అలా 2022లో ‘ఓవర్‌ క్వాలిఫైడ్‌ హౌజ్‌వైవ్స్‌’ ప్రారంభించా. వెబ్‌సైట్‌నీ స్వయంగా రూపొందించా. దాని ద్వారా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని నచ్చిన వేళల్లో పనిచేసే వీలు కల్పిస్తున్నా. వ్యాపారవేత్తగా సాగుతూనే ఎంతోమందికి తిరిగి ఉపాధి కల్పించగలుగుతున్నా’నని ఆనందంగా చెబుతోంది శంకర. తొలిరోజుల్లో అమ్మలనేసరికి చిన్న, నాన్‌ టెక్నికల్‌ ఉద్యోగాలకే మొగ్గు చూపేవారట. కొందరు ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించిన సందర్భాలూ లేకపోలేదు. అలాంటివన్నీ దాటుకొంటూ ముందుకు సాగుతోందామె. ఇప్పుడు దాదాపు 200 సంస్థలకు సేవలందిస్తోంది. వెయ్యికిపైగా అమ్మలకు అవకాశాలు కల్పించిన ఈమె.. ప్రయాణం ఆదర్శమేగా మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్