నీటిలో ఫ్యాషన్లను ఆవిష్కరిస్తోంది!
రంగు రంగుల దుస్తులు.. వాటిని ధరించిన మోడళ్లను బంధించే ఫొటోగ్రాఫర్లు ఎందరో! దానిలో తన ప్రత్యేకత ఏముంది అనుకుంది కృతి. అప్పుడే నీటి అడుగున మరో ప్రపంచం తనను ఆకర్షించింది.
రంగు రంగుల దుస్తులు.. వాటిని ధరించిన మోడళ్లను బంధించే ఫొటోగ్రాఫర్లు ఎందరో! దానిలో తన ప్రత్యేకత ఏముంది అనుకుంది కృతి. అప్పుడే నీటి అడుగున మరో ప్రపంచం తనను ఆకర్షించింది. ఫ్యాషన్, జలప్రపంచాన్ని జత చేస్తూ ఆమె చేసిన ప్రయత్నం ఎంతో మంది దృష్టినీ ఆకర్షించింది. ఇంతకీ తనెవరో.. ఆ ప్రయత్నమేంటో.. చదివేయండి.
ఫొటో ఒక జ్ఞాపకంలా కాదు.. అద్భుతంలా ఉండాలంటుంది కృతి బిసారియా. తనకి చిన్నప్పట్నుంచీ కళలు, సృజనాత్మకతకు చోటుండే అంశాలంటే ఆసక్తి. అదే ఆమెను ఫ్యాషన్ కమ్యూనికేషన్స్ వైపు నడిపింది. తనది మధ్యప్రదేశ్‌లోని చింద్వారా. తండ్రి ఉద్యోగరీత్యా భోపాల్, జయపుర, ముంబయిల్లో పెరిగింది. నిఫ్ట్- ముంబయిలో ఫ్యాషన్ కమ్యూనికేషన్ డిజైన్‌లో చేరింది. కాలేజీ ప్రాజెక్టు కోసం ఫ్యాషన్ మ్యాగజీన్లు తిరగేస్తున్న తనను ఓ అడ్వర్టైజింగ్ ఫొటోగ్రాఫర్ ఆకర్షించాడు. మోడళ్లను అందంగా చూపిస్తూనే దుస్తులు, యాక్సెసరీలవైపూ ఆకర్షితులయ్యేలా చేసిన అతని పనితనం కృతిని ఆకట్టుకుంది. అలా తన మనసు ఫొటోగ్రఫీవైపు మళ్లి అమెరికాలో ప్రముఖ సంస్థలో కోర్సులో చేరింది.
మళ్లీ.. మ్యాగజీనే..
‘2012.. కోర్సు చివరి సెమిస్టర్. ఫొటో థీసిస్ ప్రాజెక్టు కోసం ఆలోచిస్తున్నా. ఆర్టిస్ట్‌లో సృజనాత్మకతను వెలికితీసే గొప్ప అంశాల్లో ప్రకృతిని మించింది లేదు. అందుకే సముద్రతీరాన కూర్చొని ఆలోచిస్తున్నా. ఎగసిపడే అలలు.. డైవింగ్ చేస్తున్నవారు కొందరు.. సర్ఫింగ్ చేస్తున్నవారు ఇంకొందరు. వాళ్లని చూశాక నీటి అడుగునున్న అందాలను బంధించాలని అనిపించింది. ఆ ఆలోచన ఎంతకీ వదల్లేదు. దీనికితోడు మ్యాగజైన్లలో నీటి అడుగున తీసిన కొన్ని ఫొటోలను చూశా. అదినన్ను మరింత ఆకట్టుకుంది. ఇంకేం.. మరుసటి రోజు సముద్రం మధ్యలో ఉన్నా.. స్కూబా డైవింగ్ నేర్చుకోవడానికి. దానిలో సర్టిఫికేషన్ చేశాక అండర్ వాటర్ ఫొటోగ్రాఫర్స్ వర్క్‌షాపుల్లో చేరా. ఏడాదిపాటు బ్రూక్స్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నా. అలా అండర్ వాటర్ ఫొటోగ్రాఫర్‌నయ్యా’ అంటుంది కృతి.
వాటిని చూపాలనే..
‘డైవ్ సూట్, వెనుక ఆక్సిజన్ ట్యాంకు, ఒంటికి ట్యూబ్స్.. చేత కెమెరా పట్టి నీళ్లలో దూకిన ఆ క్షణం మర్చిపోలేను. తెలియని భయం, నీళ్లలోకి చేరుకున్నాక అక్కడి లోకాన్ని చూసి మాటల్లో చెప్పలేని అనుభూతి. ఇవి నా ఫొటోల్లోనూ కనిపించాలి అనుకుంటా. ఇక్కడ ఆలోచనొక్కటే సరిపోదు. దాన్ని అనుసరించగల మోడళ్లూ దొరకాలి. శ్వాసని పట్టి ఉంచుతూనే భంగిమలూ పెట్టగలగాలి. దీనికోసం నీటి బయటా, లోపలా ఎంతో సాధన చేస్తాం. తగిన దుస్తులు ఎంచుకోవడం, నప్పే రంగులు, సరైన లైటింగ్ లాంటి సమస్యలెన్నో. సమయం, శారీరక అలసట, మాటల్లేకుండానే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ పనిచేయడం శ్రమతో కూడుకున్నవి. ఒక అద్భుతాన్ని సృష్టించాలన్న ఆలోచన ముందు ఇవన్నీ చిన్నగా అనిపిస్తా’యనే కృతి ప్రపంచవ్యాప్తంగా అతి కొద్దిమంది అండర్‌వాటర్ ఫొటోగ్రాఫర్లలో ఒకరు. తన ఆల్బమ్‌లతో ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలూ అందుకుంది. ‘ద ప్లంగ్’ని దిల్లీ ఆర్ట్ మాగ్నమ్‌లో ప్రదర్శించి ప్రశంసలూ అందుకొంది. ‘అత్యుత్తమ అండర్‌వాటర్ ఫొటోగ్రాఫర్‌గా నిలవాలి, ఎన్నో అద్భుతాలను సృష్టించాలనేది కల’నే కృతికి సాహస క్రీడలంటే ఇష్టం. స్కైడైవింగ్, క్లిఫ్ జంపింగ్, రివర్ రాఫ్టింగ్, స్కీయింగ్‌ల్లో ప్రావీణ్యం ఉంది. ‘ప్రతి ఒక్కరికీ ఏదోక కల ఉంటుంది. దాన్ని సాధించడానికి ఎంతకైనా సిద్ధమేనా అని ప్రశ్నించుకోండి.అలా అనిపిస్తే కష్టానికి వెరవొద్దు. నేర్చుకోవడానికి వెనుకాడొద్దు. ఈ లక్షణాలను అలవరచుకుంటే మన ప్రత్యేకత చాటుకోవచ్చు’ అని సలహానీ ఇస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.