ప్రధానితో కలిసి పాట రాసింది!
‘చాలా ఆనందంగా ఉంది’.. ‘గర్వంగా భావిస్తున్నా..’ తన పాట ‘అబండెన్స్ ఇన్ మిల్లెట్స్’ విడుదల సందర్భంగా గాయని ఫాలూ ఆనందంతో వ్యక్తం చేసిన మాటలివి! అయితే ఆమె సంతోషం తన ప్రతిభను అందరి ముందుకు తెస్తున్నందుకు కాదు.. ప్రధానితో కలిసి రాసి, పాడిన పాట అది! ఇంకా.. ప్రపంచానికి సాయపడే ఒక సందేశాన్నీ జోడించారామె.
‘చాలా ఆనందంగా ఉంది’.. ‘గర్వంగా భావిస్తున్నా..’ తన పాట ‘అబండెన్స్ ఇన్ మిల్లెట్స్’ విడుదల సందర్భంగా గాయని ఫాలూ ఆనందంతో వ్యక్తం చేసిన మాటలివి! అయితే ఆమె సంతోషం తన ప్రతిభను అందరి ముందుకు తెస్తున్నందుకు కాదు.. ప్రధానితో కలిసి రాసి, పాడిన పాట అది! ఇంకా.. ప్రపంచానికి సాయపడే ఒక సందేశాన్నీ జోడించారామె. ప్రధానిని ఒప్పించేలా.. ప్రపంచాన్ని కదిలించేలా చేసిన ఆమెవరో.. ఆ పాటేంటో.. చదివేయండి!
ఫాలూ ఉరఫ్ ఫాల్గుణి షా.. భారతీయ అమ్మాయే! గత ఏడాది గ్రామీ అవార్డునూ అందుకున్నారు. పుట్టి పెరిగిందంతా ముంబయి. సంగీతానికి ప్రాధాన్యమిచ్చే కుటుంబం కావడంతో మూడో ఏట నుంచే సరిగమల ఓనమాలు మొదలు పెట్టారు. ఉస్తాద్ సుల్తాన్ ఖాన్ వంటి ఎందరో ప్రముఖుల వద్ద సంగీతం నేర్చుకున్నారు. శాస్త్రీయ సంగీతమే కాదు జానపదాలు, గజల్స్‌పైనా మనసు పారేసుకొని వాటినీ నేర్చుకున్నారు. భారత శాస్త్రీయ సంగీతంలో పీజీ చేసిన ఫాలూ ఎన్నో పాటల పోటీల్లో బహుమతులూ గెలిచారు.
పెళ్లయ్యాక 2000లో భర్త గౌరవ్ షాతో కలిసి అమెరికా వెళ్లి పోయారు. అక్కడ ఇండో- అమెరికన్ బ్యాండ్ ‘కరిష్మా’కి లీడ్ సింగర్‌గా మారారు. కొన్ని విశ్వవిద్యాలయాల్లో అతిథి అధ్యాపకురాలు కూడా. సింగర్ ‘యో యో మా’తో చేసిన ప్రాజెక్టుతో ఈమె పేరు ప్రపంచమంతా తెలిసింది. కార్నెగీ హాలులో భారత సంగీతానికి దౌత్యవేత్తగా వ్యవహరించింది. భర్తతో కలిసి కోల్‌కతా రెడ్‌లైట్ ఏరియా వేశ్యల జీవితాలపై చేసిన డాక్యుమెంటరీ, ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో పాడిన ‘జయహో’ పాట, ఏంజెలీనా జోలీతో కలిసి చేసిన ‘ఏ ప్లేస్ ఇన్ టైమ్’.. వంటివెన్నో అంతర్జాతీయ సంగీత ప్రపంచంలో ఆమెకో గుర్తింపును తెచ్చిపెట్టాయి. సొంతంగానూ ఎన్నో ఆల్బమ్‌లు రూపొందించిన ఫాలూని ప్రముఖ పురస్కారాలెన్నో వరించాయి. గత ఏడాది తన ఆల్బమ్ ‘ఎ కలర్‌ఫుల్ వరల్డ్’కి ‘ఉత్తమ పిల్లల ఆల్బమ్’ కేటగిరీలో గ్రామీ అవార్డు కూడా వరించింది.
ఆ అవకాశమిలా..
గ్రామీ అందుకున్నాక ఫాలూ దేశానికొచ్చారు. అప్పుడు ప్రధాని మోదీని కలిశారు. భవిష్యత్ ప్రణాళికలో భాగంగా తృణ ధాన్యాలపై గీతాన్ని రచించాలనుంది అన్నారట. ‘ఎలాంటివారిలోనైనా మార్పుతెచ్చే శక్తి సంగీతానిది. తృణధాన్యాల్లో పోషక విలువలు సమృద్ధిగా ఉన్నాయి. ఆకలి నిర్మూలన.. వాటిల్లోని పోషక విలువలను ప్రచారం చేసేలా చూడండి. భారత్ కూడా వాటిని ప్రచారం చేయాలని భావిస్తోంద’ని మోదీ సలహానిచ్చారట. దానికి ఫాలూ ‘మీరూ మాతో కలిసి ప్రయత్నిస్తారా’ అనడిగితే ప్రధాని వెంటనే సరేనన్నారట. ఫాలూ, తన భర్త, ప్రధాని మోదీ ముగ్గురూ కలిసి గీతరచన పూర్తి చేశారు. ‘అబండెన్స్ ఇన్ మిల్లెట్స్’ పేరుతో దాన్ని విడుదల చేశారు. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో సాగే ఈ పాట ఫాలూ గాత్రం మధ్యలో చిరుధాన్యాల ప్రయోజనాలు వివరించే మోదీ మాటలతో సాగుతుంది. త్వరలోనే దీన్ని ఇతర ప్రాంతీయ భాషల్లోకి అనువాదం చేయనున్నారు.
గర్వకారణం..
‘చిన్నతనంలో ఓసారి దెబ్బతగిలితే ‘నీకిష్టమైన పాట పాడుకో! ఎంతటి నొప్పైనా దెబ్బకు మాయమవుతుంది’ అన్న అమ్మ సలహా నాకెప్పుడూ గుర్తే! స్కూల్లో నన్ను ‘నల్ల దున్నపోతు’ అని పిలిచేవారు. బుల్లీయింగ్‌నీ ఎదుర్కొన్నా. వాటినుంచి నన్ను బయటపడేసింది సంగీతమే! ఇండో అమెరికన్ సింగర్‌గా పేరు తెచ్చుకున్నా మన భారతీయ మూలాలను ఎప్పుడూ మరచిపోలేదు. ప్రపంచాన్ని ‘ఆకలి బాధ’ను తప్పించే శక్తి తృణధాన్యాలకు ఉంది. వాటిని పండించడమూ తేలికే! వీటి గొప్పదనం అందరూ అర్థం చేసుకోగలిగితే రైతులకు ఉపాధి దొరకడమే కాదు, ప్రపంచంలో క్షుద్భాదితులు లేకుండా చేయవచ్చు. ఈ సందేశాన్ని పాట ద్వారా అందించడం.. దానికి ప్రధాని సహకారమివ్వడం ఆనందం, గర్వమేగా మరి’ అంటున్నారు 42 ఏళ్ల ఫాలూ! ఈమె ప్రయత్నాన్ని అభినందించాల్సిందేగా మరి!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.