అంధులు.. క్యాన్సర్‌ను కనిపెడుతున్నారు

శరీరంలో పైకి కనిపించని రొమ్ము క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే వీరిద్దరూ స్పర్శతో గుర్తించగలరు. అలాగని వీరు వైద్యనిపుణులు కాదు. కంటి చూపూ లేదు.

Updated : 05 Jul 2023 06:03 IST

శరీరంలో పైకి కనిపించని రొమ్ము క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే వీరిద్దరూ స్పర్శతో గుర్తించగలరు. అలాగని వీరు వైద్యనిపుణులు కాదు. కంటి చూపూ లేదు. అయినా ఈ వ్యాధిని ఇట్టే కనిపెట్టి వేల మంది మహిళలను ప్రాణాపాయం నుంచి కాపాడుతున్నారు.  మహిళారోగ్య సంరక్షణ వ్యవస్థలో ప్రముఖ పాత్ర వహిస్తున్న మెడికల్‌ టెక్టైల్‌ పరీక్షకులు ఆయేషా బాను, నూరున్నీసా స్ఫూర్తి కథనమిది.

బెంగళూరులోని నిట్టే మీనాక్షి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ప్రాంగణమంతా విద్యార్థులు, ఉపాధ్యాయులతో కిక్కిరిసిపోతుంటుంది. రొమ్ము క్యాన్సర్‌పై ప్రసంగించే ఆయేషా బాను, నూరున్నీసా అవగాహనా పాఠాల గురించి వినడానికి అందరూ అక్కడికి వస్తుంటారు. అంధులైన వీరిద్దరూ మెడికల్‌ టెక్టైల్‌ ఎగ్జామినర్స్‌(ఎమ్టీఈ)గా క్యాన్సర్‌ను ఎలా గుర్తించగలుగుతారు, దానివల్ల ప్రయోజనాలు చెబుతుంటే ఉత్సాహంగా వింటారు. ఈ పరీక్షను తాము నిర్వహిస్తామన్నప్పుడు కొందరు  మహిళలు తమతో సహకరించరంటారు 23 ఏళ్ల ఆయేషా. ‘ఎనేబుల్‌ ఇండియా ఎన్జీవో అందించిన ఈ శిక్షణ  తృప్తినిస్తోంది. మొదట్లో రోజుకి ఒక్కరినే టెస్ట్‌ చేయగలిగే నేనిప్పుడు ఏడెనిమిది మందికి చేయగలుగుతున్నా. క్యాన్సర్‌ను ముందుగా కనిపెట్టడంలో వైద్యులకు మేం సహాయకులం. రొమ్ముపై అదుముతూ కేవలం నాలుగు చేతి వేళ్లతో చేసే ఈ పరీక్షకు చాలామంది అభ్యంతరం తెలుపుతారు. వారికి అవగాహన కలిగిస్తాం. రొమ్ము క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రాణాంతక పరిస్థితి నుంచి  బయట పడొచ్చని చెబుతాం. అలా అనుమానాస్పదమైన కణతులను మా చేతివేళ్ల చివర్లలోని హై టెక్టైల్‌ సెన్స్‌ ద్వారా గుర్తిస్తా’మంటున్నారీమె.

దేశవ్యాప్తంగా...

క్యాన్సర్‌ ఆసుపత్రి సైట్‌కేర్‌లో ఆయేషాబాను, నూరున్నీసాలు విధులు నిర్వహిస్తూనే, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ఎన్జీవోలు, మారుమూల గ్రామీణ ప్రాంతాలంటూ దేశవ్యాప్తంగా పర్యటించి మహిళలకు అవగాహన కలిగిస్తున్నారు. ‘దేశంలో 60శాతం మందికి నాలుగో స్టేజిలోనే గుర్తించగలుగుతున్నారు. దీంతో బయట పడేవారి సంఖ్య చాలా తక్కువ. మేం చేసే ఈ పరీక్షలో ముందుగా బ్రెయిలీ మార్క్‌డ్‌ డాక్యుమెంటేషన్‌ టేప్స్‌ను రొమ్ములపై ఉంచి ఆ ప్రాంతాన్నంతా నాలుగుభాగాలుగా విభజిస్తాం. ఆ తర్వాత చేతివేళ్ల స్పర్శద్వారా అసాధారణ కణతులున్నాయా అని ప్రతి సెంటీమీటర్‌నూ నాలుగువైపులా పరీక్షిస్తాం. అలా అరగంట నుంచి 40 నిమిషాలు చేసే స్పర్శ ద్వారా మార్క్‌చేసే డాక్యుమెంట్‌ను వైద్యుల పరిశీలనార్థం మెయిల్‌లో పంపుతాం. ఆ నివేదికను చూసి అవసరమైతే మామోగ్రఫీ లేదా అల్ట్రాసౌండ్‌ పరీక్షలను వైద్యులు సూచిస్తార’ని చెబుతారు 20 ఏళ్ల నూరున్నీసా. ఇప్పటివరకు వేలాదిమందికి పరీక్ష జరిపిన ఈ ఇరువురూ.. నిర్వహిస్తున్న విధులు అభినందదాయకం కదూ...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్