వాళ్లెందుకు పత్రికకు దూరమవ్వాలి..
సాంకేతికత పెరిగి సామాజిక మాధ్యమాల వెనక పడుతున్నా... నిద్ర లేచీ లేవగానే పత్రికలను చదవడం ఎంతోమందికి దినచర్యలో భాగం.
సాంకేతికత పెరిగి సామాజిక మాధ్యమాల వెనక పడుతున్నా... నిద్ర లేచీ లేవగానే పత్రికలను చదవడం ఎంతోమందికి దినచర్యలో భాగం. ఆ సౌలభ్యం అంధులకు ఎందుకు లేదు? ఇదే ప్రశ్న ఆమెను ఆలోచింపజేసింది. ఎంతలా అంటే ఉద్యోగాన్ని వదిలి బ్రెయిలీ మ్యాగజైన్ ప్రచురించేంతలా. ఆ ఆలోచన వెనకున్న కారణాలేంటో ఉపసనా మకాటినే అడిగి తెలుసుకుందాం..
నేను పుట్టి పెరిగింది ముంబయి. చదువైన వెంటనే పబ్లిక్ రిలేషన్స్‌లో మంచి ఉద్యోగం. కాలేజీ రోజుల్లో నాకో స్నేహితురాలుండేది. ఆమెకు చదవడం అంటే చాలా ఇష్టం. కానీ అంధురాలు అవ్వడం వల్ల దినపత్రికని నాతో చదివించుకుని వినేది. అప్పటి నుంచే అంధులకు ఒక పత్రిక ఉంటే బాగుండు కదా అనుకునేదాన్ని. చదువయ్యాక వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో నిమగ్నమై దాని జోలికి పోలేదు. కానీ ఒకరోజు అనుకోకుండా నాకో ఆలోచన వచ్చింది. వెంటనే నా స్నేహితులందరికి వీడియో కాల్‌లోకి రావాలని సందేశం పంపించాను. వాళ్లంతా ఏమైందో అనుకొని చాలా ఆతృతగా వచ్చారు. అంధులకు ఒక మ్యాగజైన్ ఉంటే బాగుంటుంది కదా అన్న నా ఆలోచనను పంచుకుంటే.. ‘అర్ధరాత్రి లేపి ఏంటీ గోల నిద్రపోనీ’ అన్నారు. ‘పిచ్చా నీకు? సాంకేతికత చాలా అభివృద్ధి చెందింది. అరచేతిలోనే ప్రపంచం ఉంది. అలాంటప్పుడు అంధులు మాత్రం ఎందుకు పుస్తకాలు చదువుతారు?’ అన్నారు కొందరు. కానీ నాకెందుకో రాజీపడాలి అనిపించలేదు. పరిశోధన ప్రారంభించాను.
కోరికున్నా చదవలేం
అంధుల దినచర్య తెలుసుకోవాలని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లైండ్స్‌కు వెళ్లా. నా ఆలోచన చెప్పి వాళ్ల అభిప్రాయాలు సేకరించాను. అందరు చెప్పింది ఒకే మాట.. ‘చదవాలని కోరికుంటే సరిపోతుందా... మాకోసం బ్రెయిలీలో పత్రికలు ఎవరు తీసుకొస్తారు’ అనే! అప్పుడే ఎంత కష్టమైనా వాళ్లకోసం నెలవారీ పత్రిక తేవాలని నిశ్చయించుకున్నా. 2013 మేలో 64పేజీల మొట్టమొదటి బ్రెయిలీ మ్యాగజైన్ ‘‘వైట్ ప్రింట్’’ మొదటి కాపీని విడుదల చేశాను. దీనికోసం నేను పొదుపు చేసుకున్న డబ్బులు మొత్తాన్ని వెచ్చించాను. లాభాపేక్ష లేదు. అందుకే రిస్క్ భయం లేదు.
ఎక్కని గుమ్మం లేదు
ఏ పత్రిక నడవాలన్నా అడ్వర్టైజ్‌మెంట్స్ ప్రధాన ఆర్థిక వనరులు. కానీ అంధుల మ్యాగజైన్‌కి యాడ్స్ ఎందుకు ఇస్తారు. ప్రతి కంపెనీకి తిరిగాను. చాలా విఫలయత్నాల తర్వాత కొన్ని సంస్థలు యాడ్స్ ఇవ్వడానికి ఒప్పుకొన్నాయి. అవే ఇప్పుడు పత్రికకి ఫండ్స్ సమకూరుస్తున్నాయి. నా వంతుగా ఆడియో రికాడ్స్, బుక్స్ రైటింగ్ వాటి నుంచి సంపాదించిన మొత్తాన్ని దీనికే కేటాయిస్తున్నాను. ప్రస్తుతం ముంబయిలోని అన్నీ పాఠశాలలు, కళాశాలలు, గ్రంథాలయాలు, కార్యాలయాల్లో ఇది అందుబాటులో ఉంది. ఆటలు, బాలీవుడ్, పాటలు, మానవత్వ కథనాలు లాంటి అన్ని జానర్లను పొందుపర్చాం. ప్రముఖ జర్నలిస్టులు ఫ్రీలాన్సర్లుగా కంటెంట్ అందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.