18 ఏళ్లు.. 5 గిన్నిస్‌ రికార్డులు!

గిన్నిస్‌ రికార్డు ఒక్కటి సాధిస్తేనే ఆశ్చర్యంగా చూస్తారంతా. కానీ ఈ అమ్మాయి ఏకంగా ఐదు సాధించింది. పదకొండేళ్లకు మొదటిది సాధించిన ఈ అమ్మాయి.. తన రికార్డులను తానే బద్దలు కొడుతూ అందరి చేతా ఔరా అనిపించుకుంటోంది.

Published : 23 Jul 2023 00:16 IST

గిన్నిస్‌ రికార్డు ఒక్కటి సాధిస్తేనే ఆశ్చర్యంగా చూస్తారంతా. కానీ ఈ అమ్మాయి ఏకంగా ఐదు సాధించింది. పదకొండేళ్లకు మొదటిది సాధించిన ఈ అమ్మాయి.. తన రికార్డులను తానే బద్దలు కొడుతూ అందరి చేతా ఔరా అనిపించుకుంటోంది. సృష్టి ధర్మేంద్ర శర్మ.. ఆమెవరంటే..

క్రాల మీద రయ్యిమంటూ దూసుకెళ్లే స్కేటింగ్‌ గురించి మనకు తెలిసిందే! రెండు కాళ్లను వెడల్పుగా చాపుతూ శరీరాన్ని పూర్తిగా ముందుకు వంచి సమాంతరంగా ఉంచిన ఇనుప చువ్వల కింద నుంచి దూసుకెళ్లాలి. ఈ క్రమంలో శరీరం ఏమాత్రం నేలకుకానీ, చువ్వలకు కానీ తాకకూడదు. లింబో స్కేటింగ్‌గా పిలిచే ఈ ఆటలో దూసుకెళుతోంది 18 ఏళ్ల సృష్టి. ఈమెది మహారాష్ట్రలోని చిన్నపల్లె. అయిదో ఏట సరదాగా ఇంటికి దగ్గర్లో ఉండే స్కేటింగ్‌ అసోసియేషన్‌లో సాధన మొదలుపెట్టిందీమె.

ఏడాదికే పోటీలో పాల్గొంది సృష్టి. వేగంగా వెళ్లలేకపోవడమే కాదు.. ఒక రౌండ్‌నీ పూర్తిచేయలేకపోయింది. దీంతో తనను సిబ్బంది బయటకు తీసుకొచ్చేశారు. రౌండ్‌ పూర్తి చేయనివ్వలేదని ఏడ్చేసింది సృష్టి. అందరూ పర్లేదన్నా.. ఆమె మాత్రం తర్వాతి రోజు నుంచి పట్టుదలగా ప్రయత్నించింది. తర్వాతి పోటీలో బంగారు పతకం సాధించింది. 11 ఏళ్ల వయసులో తొలి గిన్నిస్‌ రికార్డు సాధించిన సృష్టి.. 2017లో 17 ఏళ్లకి లోయెస్ట్‌ లింబో ఐస్‌ స్కేటింగ్‌లోనూ రికార్డు సాధించింది. అవి ఇప్పటికీ తన పేరిటే ఉన్నాయి. తర్వాత లింబో స్పీడ్‌ స్కేటింగ్‌పై దృష్టిపెట్టిన సృష్టి 2020లో ఈ విభాగంలోనూ రికార్డు కొట్టింది. 2021లోనే కాదు.. తాజాగా తన రికార్డులను తనే బద్దలు కొట్టింది. గత ఏడాది 7.38 సెకన్లలో 51 బార్లను దాటిన తను ఈ ఏడాది 6.94 సెకన్లలోనే పూర్తిచేసి రికార్డు తన పేరిటే తిరిగి లిఖించుకుంది. అందుకే ఈమెను ‘క్వీన్‌ ఆఫ్‌ లింబో స్కేటింగ్‌’ అని పిలుస్తారు. ‘వయసు పెరిగేకొద్దీ లింబో స్కేటింగ్‌ నీకిక సాధ్యం కాదంటుంటారు చాలామంది. కానీ ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమేనన్న నమ్మకమే నన్ను గెలిపిస్తోం’దనే సృష్టి ‘సేవ్‌ ఎ గర్ల్‌ చైల్డ్‌’ ప్రోగ్రామ్‌కి అంబాసిడర్‌ కూడా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని