Priyanka Tumpala: 16 ఏళ్లు.. 150 సినిమాలు!
అందాల తారల నోటివెంట చిన్న డైలాగ్ చాలు.. ప్రేక్షకుల మదిలో నిలిచిపోయేలా చేయడానికి! తెరమీద కనిపించేది వాళ్లే కానీ.. చాలామంది గొంతు అరువుదే!
అందాల తారల నోటివెంట చిన్న డైలాగ్ చాలు.. ప్రేక్షకుల మదిలో నిలిచిపోయేలా చేయడానికి! తెరమీద కనిపించేది వాళ్లే కానీ.. చాలామంది గొంతు అరువుదే! అలా కాజల్ నుంచి రష్మిక, అనన్యపాండే, కేతిక శర్మ వరకు ఎంతోమంది హీరోయిన్లకు గాత్రదానం చేసింది ప్రియాంక తుంపాల(Priyanka Tumpala) 16 ఏళ్లలో తెలుగు, హిందీ దాటి డిస్నీ, మార్వెల్ లాంటి హాలీవుడ్ సంస్థలకూ ఆమె ప్రయాణం సాగింది. వసుంధర పలకరించగా.. తన గురించి పంచుకుందిలా..
తొలి సినిమాకి పనిచేసే వరకూ ‘డబ్బింగ్’ విభాగమొకటి ఉంటుందనే తెలియదు నాకు. తెలిశాక ఆశ్చర్యపోయా. తర్వాత అదే అభిరుచి అయ్యింది. మాది విశాఖపట్నం. అమ్మానాన్న రాధిక, మాధవరావు. బీఏ పూర్తిచేశా. 16 ఏళ్ల వయసు నుంచే నా కాళ్లమీద నేను నిలబడ్డా. ఆర్‌జే, ప్రొడక్ట్ బ్రాండింగ్, మార్కెటింగ్ విభాగాల్లో చేశా. ఏదో పనిమీద అన్నపూర్ణ స్టూడియోస్‌కి వెళితే ‘విలేజ్‌లో వినాయకుడు’కి డబ్బింగ్ ఆడిషన్స్ జరుగుతున్నాయి. అప్పుడే డబ్బింగ్ ఆర్టిస్ట్‌ల గురించి తొలిసారి విన్నా. ఆసక్తి అనిపించి సరదాగా ప్రయత్నించా. నా గొంతు డైరెక్టర్‌కి నచ్చి అవకాశమిచ్చారు. అదే నా తొలిసినిమా. నచ్చడంతో కొనసాగించా. నేను కార్పొరేట్ ఉద్యోగిని కూడా! ఉదయం 7-9, మళ్లీ సాయంత్రం కుదిరిన వేళల్లో గాత్రదానం చేస్తుంటా. అనుకోకుండా మంచి అవకాశమొచ్చి విదేశాలకు వెళ్లా. అప్పుడు మాత్రం ఇక డబ్బింగ్ కెరియర్ ముగిసినట్లే అనుకున్నా. కానీ అప్పుడూ పిలుపొచ్చింది. జ్యో అచ్యుతానంద, నైను.. శైలజ లాంటి చిత్రాలకు వచ్చి డబ్బింగ్ చెప్పి తిరిగి వెళ్లిన రోజులున్నాయి. ‘నేను.. శైలజ’ హిట్ అవడంతో కీర్తి సురేష్ వల్ల నాకూ పేరొచ్చింది. అప్పుడే పూర్తిస్థాయిలో డబ్బింగ్‌ను కెరియర్‌గా మలచుకోవాలనుకున్నా.
ఇద్దరి ఒకేసారి!
తెర వెనుకుండి గాత్రమివ్వడం సులువనుకుంటారు. కానీ ప్రతిదీ సవాలే. అచ్చం ఆ వ్యక్తి మాట్లాడుతున్నట్లుగానే ప్రేక్షకులను నమ్మించాలి. మన కథానాయికల్లో చాలామంది ఇతర భాషలవాళ్లే. వాస్తవంగా పలికేప్పుడు చాలాసార్లు ఇబ్బంది పడుతుంటారు. దాన్నీ డబ్బింగ్‌తో కవర్ చేస్తుంటాం. అలాగని అందరికీ ఒకేలా గొంతుక ఉండకూడదు. అలా అనిపిస్తే నేను విఫలమైనట్టే అనుకుంటా. ఒకేరోజు ఇద్దరు హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పిన సందర్భాలున్నాయి. పాత్రలో ముందు నేను లీనమై వాళ్ల బాడీలాంగ్వేజ్‌ను గమనిస్తా. దాన్ని బట్టి చెబుతా కాబట్టే.. భిన్నత్వం చూపించ గలుగుతున్నా. ఆ విషయాన్ని నేను మొదట్లోనే గ్రహించి నన్ను నేను మెరుగుపరచుకున్నా. చాలామంది కథానాయికలు నా పేరు ప్రతిపాదించడానికీ అదే కారణం.
నాలుగు.. ఎనిమిదవుతాయ్..
ఈ 16 ఏళ్లలో 150 సినిమాలకు.. కాజల్ అగర్వాల్, రాశిఖన్నా, తమన్నా, పూజా హెగ్దే, సాయిపల్లవి, ఐశ్వర్య లక్ష్మి, రెజీనా, నభా నటేష్, కేతిక శర్మ, అనన్యపాండే, దీపికా పదుకొణె, రష్మిక లాంటి అగ్రతారలందరికీ గాత్రమిచ్చా. హాలీవుడ్ చిత్రాలకూ పనిచేస్తున్నా. డిస్నీ, మార్వెల్ సంస్థల చిత్రాలకు తెలుగు అధికారిక డబ్బింగ్ ఆర్టిస్ట్‌ని. ఇక్కడా ఎన్నో సవాళ్లు. ఆంగ్ల చిత్రాల్లో సంభాషణలు వేగంగా సాగుతాయి. వాళ్లు నాలుగు వాక్యాలే చెప్పినా.. తెలుగుకొచ్చేసరికి ఎనిమిదవుతాయి. అంతే వేగంలో, సహజంగా పూర్తిచేయడం ఆషామాషీ పనికాదు. ఇలాంటి సవాళ్లెన్నో. నచ్చిన పని కదా.. ఇష్టంగా చేస్తుంటా. రమ్యకృష్ణ, నివేదా పేతురాజు, రెజీనా లాంటి కథానాయికలకు ఫ్రెండ్లీగా మేనేజర్‌గానూ చేశా. తొలినాళ్లలో వాయిస్ కల్చర్ ఎలా ఉంటుందో తెలియదు. స్నేహితుల్లేరు, సీనియర్లు తెలియదు. సొంతంగా నేర్చుకున్నా. ఓ వ్యక్తి ఎన్ని రకాలుగా మాట్లాడొచ్చన్నది అధ్యయనం చేశా. అలా తెరపై వ్యక్తే మాట్లాడుతోందన్న అనుభూతి ప్రేక్షకులకు కలగజేయడంలో విజయం సాధించా. ఆ ఇబ్బందులు తెలుసు కాబట్టే.. కొత్తవాళ్లకు సహకరిస్తుంటా, మెలకువలూ చెబుతుంటాను.
- సతీష్ దండవేణి, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.