అక్షరాలు.. అంకెల్లో ఆసనాలు!

అనుకోకుండా యోగాలోకి అడుగుపెట్టింది సడగోపురం ప్రసన్న. అమ్మాయిలకు దీంతో పనేముందన్నా కొనసాగించింది. కొత్త ప్రయోగాలతో అందరినీ ఆకట్టుకుంది.

Updated : 01 Aug 2023 05:01 IST

అనుకోకుండా యోగాలోకి అడుగుపెట్టింది సడగోపురం ప్రసన్న. అమ్మాయిలకు దీంతో పనేముందన్నా కొనసాగించింది. కొత్త ప్రయోగాలతో అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు అదే ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. యోగా వ్యాపకం కాదు.. జీవితమంటున్న ఆమె ప్రయాణం తన మాటల్లోనే..

అనుకోకుండా ఓసారి మేడ పైనుంచి పడ్డా. 24 గంటలు గడిస్తేకానీ ఏమీ చెప్పలేమన్నారు వైద్యులు. అలాంటిది త్వరగా కోలుకున్నా. ‘నీ యోగా సాధన వల్లే శరీరానికి పెద్దగా హాని జరగలేద’న్నారు వైద్యులు. అంతెందుకు ఇప్పుడు నేనీ స్థాయిలో ఉండటానికీ అదే కారణమని చెబుతా. మాది కర్నూలు. మధ్యతరగతి కుటుంబం. నాన్న వాసుదేవ నాయుడు చిరుద్యోగి, అమ్మ హేమావతి. ముగ్గురం ఆడపిల్లలం. అయిదో తరగతిలో అక్కతోపాటు సరదాగా యోగాలో చేరా. ‘అంతంతమాత్రం ఆదాయం. ముగ్గురమ్మాయిలు.. వాళ్ల చదువులూ కష్టమే. ఈ యోగా అవసరమా?’ అన్నారందరు. కానీ నా ఇష్టాన్ని కాదనలేక అమ్మానాన్న కొనసాగనిచ్చారు. నేనూ పట్టుదలగా నేర్చుకున్నా. అలాగే ఎక్కడ పోటీల్లో పాల్గొన్నా బహుమతితో వచ్చేదాన్ని. దీంతో స్కూలు వాళ్లు ఫీజు లేకుండా చదువుకోనిచ్చారు. డిగ్రీవరకూ అలా ఎంతోకొంత సాయం అందుతూ వచ్చింది. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో బెంగళూరు, పంజాబ్‌ల్లో 2 యోగా సర్టిఫికేషన్‌ కోర్సులూ చేశా. దూరవిద్యలో ఎంఎస్సీ పూర్తి చేసి, ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాన్నీ సాధించా.

ఎన్ని అవాంతరాలొచ్చినా మా యోగా గురువులు వెన్ను తట్టి ప్రోత్సహించేవారు. అందుకే నాదంటూ ప్రత్యేకత ఉండాలనుకున్నా. వేగంగా ఆసనాలు వేయడం సాధన చేశా. 13 నిమిషాల్లో 101 ఆసనాలు వేయగలను. ఆంగ్ల అక్షరాలు, అంకెలే కాదు.. భరత నాట్యానికి యోగా మిళితం చేయడం నా ప్రత్యేకత. రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో ప్రతిభ కనబరిచాను. వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, యోగా ప్రీమియర్‌ లీగ్‌, ఇంటర్‌ యూనివర్సిటీ, యోగా ఫెడరేషన్‌ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించా. రిథమిక్‌ యోగా, రిబ్బన్‌ యోగా, భరతనాట్యం, హులా హూప్‌, శివపార్వతులతో కూడిన యోగాసనం లాంటి ప్రయోగాలెన్నో చేస్తుంటా. అంతేకాదు ఆసక్తి ఉన్నవారికీ నేర్పుతున్నా. నా వద్ద శిక్షణ పొందిన వారిలో అయిదుగురు అమ్మాయిలు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారు. ఇన్ఫోసిస్‌లోనూ యోగా కార్యక్రమాలు నిర్వహించా. ఉద్యోగం చేస్తూనే కర్నూలులోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులకు, హైదరాబాద్‌లోని ప్రైవేటు సంస్థ ఉద్యోగులకు తరగతులు తీసుకుంటున్నా. ఇంత తీరిక లేకుండా ఎలా ఇవన్నీ అంటారంతా. వ్యాయామం వల్లే శరీరంతోపాటు మనసూ ప్రశాంతంగా ఉందని చెబుతా. భవిష్యత్తులో యోగా స్టూడియోలు ఏర్పాటు చేసి అందరికీ శిక్షణివ్వాలనేది నా కల. యోగాలో కొత్త విధానాలు నేర్చుకోవాలి, ప్రయోగాలు చేయాలనివుంది. ప్రస్తుతం జల యోగ సాధన చేస్తున్నా. పట్టుదల, ఇంట్లోవాళ్లు, గురువుల సాయమూ తోడవడం వల్లే ఇలా రాణించగలుగుతున్నా.

- పిల్లనగోయిన రాజు, ఈనాడు జర్నలిజం స్కూల్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్