సిరిమువ్వలు... జీవితపాఠాలు!

వేసవి సెలవులు వస్తున్నాయంటే తల్లిదండ్రులకి పెద్ద సవాలే!  పిల్లల అల్లరిని అదుపు చేయడానికి ఏం చేయాలా అని ఆలోచించి  చివరికి ఏదో ఒక యాక్టివిటీతో రాజీపడుతుంటాం. అలా కాకుండా వాళ్లకి ఫిట్‌నెస్‌ని అందిస్తూనే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, కమ్యునికేషన్‌ స్కిల్స్‌, ఎమోషనల్‌ మేనేజ్‌మెంట్‌ వంటివి కూడా అందిస్తే?

Published : 21 Mar 2024 04:44 IST

వేసవి సెలవులు వస్తున్నాయంటే తల్లిదండ్రులకి పెద్ద సవాలే!  పిల్లల అల్లరిని అదుపు చేయడానికి ఏం చేయాలా అని ఆలోచించి  చివరికి ఏదో ఒక యాక్టివిటీతో రాజీపడుతుంటాం. అలా కాకుండా వాళ్లకి ఫిట్‌నెస్‌ని అందిస్తూనే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, కమ్యునికేషన్‌ స్కిల్స్‌, ఎమోషనల్‌ మేనేజ్‌మెంట్‌ వంటివి కూడా అందిస్తే? అమ్మో అవన్నీ ఒకేసారి నేర్పడం ఎలా? అని కంగారు పడకండి. శాస్త్రీయ నృత్యం వీటన్నింటికీ చక్కని పరిష్కారం అంటున్నారు తెలంగాణ సివిల్‌ సప్లయ్స్‌లో అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న ప్రముఖ నృత్యకారిణి వెంట్రాప్రగడ వాణీభవాని...!

యోగాలో వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం ముద్రలు వేస్తారు కదా! అలాగే నృత్యంలో హస్తాలు అని ఉంటాయి. యోగాలో పృధ్వీముద్ర ఉన్నట్టుగా నాట్యంలో మయూరహస్తం ఉంటుంది. ఈ హస్తం లేదా ముద్ర వల్ల దెబ్బలు తగిలితే త్వరగా మానుతాయి. నీరసం ఉండదు. మానసిక స్థిరత్వం వస్తుంది. యోగాలో అపానముద్ర ఉంటే నాట్యంలో సింహముఖ హస్తం ఉంటుంది. దీంతో అజీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. బీపీ అదుపులో ఉంటుంది. యోగా చేస్తే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో, నాట్యంతో అన్ని ప్రయోజనాలూ పిల్లలు అందుకుంటారు.

ఫిజికల్‌ ఫిట్‌నెస్‌: కొవిడ్‌ సమయంలో ఎంతో మంది పిల్లలు ఊబకాయం బారిన పడుతుంటారు. కారణం తోటిపిల్లలతో ఆడుకోలేని పరిస్థితి. మానసికంగానూ ఎన్నో సమస్యల్ని ఎదుర్కొన్నారు. కానీ నాట్యం తెలిసిన పిల్లల్లోకానీ, ఆన్‌లైన్‌లో అభ్యసించిన పిల్లల్లోకానీ ఎటువంటి సమస్యలూ కనిపించడంలేదు. దానికి ఉదాహరణ మా అమ్మాయే. నాట్యంతో వయసుకు తగ్గ ఎదుగుదల ఉంటుంది. వారంలో రెండు క్లాసులకి వెళ్తే చాలు ఆడపిల్లల్లో ఊబకాయం, పీసీఓడీ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఆందోళన, కుంగుబాటు వంటివాటికి దూరంగా ఉంటారు. మనసు పెట్టి చేసే వ్యాయామం ఇది.  

సామాజిక బంధం- కమ్యూనికేషన్‌ స్కిల్స్‌: సోలో ప్రదర్శన కంటే గ్రూప్‌లో డాన్స్‌ చేయడం చాలా కష్టం. కారణం బృందంలో ఎవరో ఒకరు తప్పు చేశారనుకోండి, తోటి నృత్యకారిణులు ఆగిపోరు. దాన్ని సరిదిద్ది తరవాతి స్టెప్‌లోకి వెళ్లిపోతుంటారు. ప్రేక్షకులు గ్రహించేలోపే అప్పటికప్పుడు స్పాంటేనియస్‌గా నిర్ణయాలు తీసుకుంటారు. నాట్యంలో చాలా సహజంగా జరిగే ప్రక్రియ ఇది. అలా పిల్లల్లో టెన్షన్‌ పడకుండా, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొనే శక్తి ఈ నాట్యంతో వస్తుంది. అలాగే బృందంలో ఒకరు వడ్డాణం మరిచిపోతారు. మరొకరి జడబిళ్ల కనిపించదు. కానీ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ నాట్య ప్రదర్శనని విజయవంతం చేస్తారు. పెద్దయ్యాక కూడా ఈ సమయస్ఫూర్తి, బృంద స్ఫూర్తి కొనసాగుతాయి. ఉద్యోగంలో.. టీమ్‌తో కలిసి పనిచేయడం తేలిక అవుతుంది. కలుపుగోలుతనం, కమ్యునికేషన్‌ స్కిల్స్‌ అలవడతాయి. సర్దుకుపోయేతత్వం వస్తుంది.

సవ్యసాచిత్వం: డాన్స్‌లో మీరు గమనిస్తే కుడి చేయి, కాలితో చేసే అభినయాన్నే అంతే అందంగా ఎడమ చేయి, కాలితో కూడా చేస్తారు. ఇలా చేయడం అంత తేలిక కాదు. కుడిచేత్తో చేయడం తేలికే. కానీ ఎడమ చేత్తో అంతే అందంగా అభినయించాలంటే చాలా సాధన కావాలి. ఇలా రెండు చేతులతో చేయగలిగే నైపుణ్యాన్ని యాంటీడెక్సిరిటీ అంటారు. నృత్యం చేసే పిల్లల్లో మెదడు చురుగ్గా ఉంటుంది. మామూలు వాళ్లతో పోలిస్తే సృజనాత్మకంగా ఉంటారు. అది చదువుల్లోనూ, కెరియర్‌లోనూ ప్రతిఫలిస్తుంది.

ఓపిక వస్తుంది: సాయంత్రం ఆరింటికి ప్రోగ్రామ్‌ ఉందంటే నృత్యం చేసే పిల్లలు కనీసం రెండున్నర గంటల ముందు మేకప్‌ గదిలో కూర్చోవాలి. అదే గ్రూప్‌గా ప్రదర్శన ఉంటే మధ్యాహ్నమే వెళ్లాలి. కాస్ట్యూమ్స్‌, మేకప్‌ పూర్తయ్యేంత వరకూ పిల్లలు మరే పనీ చేయకుండా కామ్‌గా, ఓపిగ్గా కూర్చోవాలి. మామూలు పిల్లలు చేతిలో మొబైల్‌ లేకుండా అంతసేపు ఓపిగ్గా కూర్చోగలరా? నాట్యంలో పిల్లలు అలవరుచుకునే ఈ ఓపిక పెద్దయ్యాక ఇంట్లో వంట వండేటప్పుడు, ఉద్యోగం చేసేటప్పుడు మంచి ఫలితాల్ని ఇస్తుంది.

ఏకాగ్రత పెరుగుతుంది: చేసే పనిని మనకు తెలియకుండానే శ్రద్ధగా చేస్తాం. అబ్జర్వేషన్‌ స్కిల్స్‌ పెరుగుతాయి. కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌కి మెమరీ, రీజనింగ్‌ వంటి వాటిని తేలిగ్గా చేయగలరు.

క్రమశిక్షణ: అలాగే ఒక ప్రదర్శన చేయాలంటే... చాలా అభ్యాసం ఉండాలి. గురువు దగ్గర ఎంతో వినయంగా ఉండాలి. అవన్నీ కుదిరితేనే ప్రదర్శన ఇవ్వగలరు. ఈ క్రమశిక్షణ మనకు జీవితంలోనూ అలవడితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.

మెడిటేషన్‌: పిల్లల్ని పదినిమిషాలు ధ్యానంలో కూర్చోమనండి. అదంత సులభం కాదు. కానీ లీనమై చేసే నాట్యంతో ఆ మెడిటేషన్‌ని తేలిగ్గా చేయొచ్చు.

ఆధ్యాత్మిక మార్గంలో: ఒక ప్రదర్శనకి ఎన్నోసార్లు అభ్యాసం చేస్తాం. ఆ క్రమంలో చేసే పనిపై భక్తి పెరుగుతుంది. నాట్యం అంటే భక్తి నివేదనే కదా!


ఆహ్వానం

వసుంధర పేజీ పై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్న 9154091911 కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్