Updated : 14/01/2022 05:01 IST

పండగవేళ.. అలంకరిద్దామిలా!

మనకు ఇంటి అలంకరణతోనే ఏ పండగైనా ప్రారంభమయ్యేది. సంక్రాంతికీ కొత్తగా ప్రయత్నించాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే వీటినోసారి చూసేయండి.

* భిన్న రకాల వస్త్రాలను వివిధ సైజుల్లో గాలిపటాల ఆకారంలో కత్తిరించి గోడకు అంటించేయండి. చిన్నారుల గదులకు కొత్త హంగులద్దినవారవుతారు.

* చతురస్రాకారంలో ఓ పెద్ద నల్లని వస్త్రాన్ని తీసుకోండి. దానికి నలువైపులా బోర్డరులా చెమ్కీలను నచ్చిన రంగులో చట్రంలా అంటించాలి. ఆపై గాలిపటాలు, చిన్న కుండల్లా పెయింట్‌ వేసుకోవాలి. గాజులను అంటించి చుట్టూ రంగు వేసినా బావుంటుంది. ఆపై కొన్ని పప్పు ధాన్యాలను అంటిస్తే సరి! ఆపై గోడకి వేలాడదీస్తే సహజంగా ఉంటుంది.

* సన్న పెయింటింగ్‌తో మట్టికుండలు మార్కెట్‌లో దొరుకుతాయి. భిన్న పరిమాణాల్లో ఉన్నవాటిని మూడు చొప్పున తీసుకుని ఒకదానిపై ఒకటి ఉంచి పక్కనే అరటి కొమ్మో, చెరకు గడో ఉంచినా సరిపోతుంది. ఇంటి బయటా/ దేవుడి మందిరం ఎక్కడ పెట్టినా కొత్త అందమే!

* ఏదైనా గుండ్రని రింగులాంటి దానికి పూలను చుట్టి.. పూసలు, స్ట్రాలను కత్తిరించి చివరన పూలు, చిన్న అట్టముక్కలతో చేసిన రంగు రంగుల పతంగులను అతికించి, గోడలకు వేలాడదీయండి.

* వాడని గుండ్రని పాత్రలు ఉంటే వాటికి మట్టి రంగువేయండి. ఆపై తెల్ల రంగుతో ముగ్గులా గీయాలి. పైన బంతుల దండ చుట్టి లోపల పూలు, దూదిని ఉంచి, ఇంట్లో అక్కడక్కడా ఉంచండి. లేదూ.. రంగుల కాగితాలను పొడవుగా చుట్టి చెరకు గడల్లా రంగులేసి సిద్ధం చేసుకోవాలి. వాటి ముందు రాళ్లతో చిన్న పొయ్యి, దానిపై కుండను ఉంచి పక్కన చిన్న పాత్రల్లో ధాన్యాలను అమర్చుకున్నా చూడ చక్కగా ఉంటుంది.

* గుమ్మాలకు తోరణాలు తప్పక కడతాం. వాటిని ఇంటిలోకీ తెచ్చేయండి. కాస్త దూరంగా ఆకులను కట్టి మధ్యలో పొడవైన దారానికి రంగురంగుల చిన్న కాగితాలను గాలిపటాల్లా కత్తిరించి అతికించాలి. మధ్యలో, ఇరువైపులా పెద్ద గాలిపటాల్ని ఒకదాని తర్వాత ఒకటి అతికిస్తే చాలు. పక్కన పచ్చని మొక్కల్ని ఉంచితే పండగకు ఆధునికత ఉట్టిపడుతుంది.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని