Updated : 23/01/2022 04:53 IST

అడ్డుగా కాదుఅలంకారంగా...

ఇంటిని చూస్తే ఇల్లాలి తత్వమేంటో అర్థమవుతుంది అంటారు. ఇల్లు చిన్నదా పెద్దదా అనే దాని కంటే దాన్నెలా అమర్చుకున్నారు, ఎంత అందంగా తీర్చిదిద్దుకున్నారు అనేది ముఖ్యం.

* ఒక్కోసారి తీరిక, ఓపిక లేక చాలాకాలం ఇల్లు సర్దలేదనుకోండి.. అంతా గందరగోళంగా ఉంటుంది. దీన్నొక పద్ధతిలోకి తేవడం మనవల్ల అవుతుందా అని భయమేస్తుంది. నిరాశ కలుగుతుంది కూడా. ఇలాంటప్పుడు అంతా ఒక్కసారిగా చేసేయాలని హడావుడి పడొద్దు. ఏమేం చేయాలో, ఎలా చేయాలో ముందుగా ప్యాడ్‌మీద రాసుకోండి. ఒక్కో గది లేదా ఒక్కో కబోర్డ్‌ చొప్పున సర్దడం మొదలుపెడితే తేలిగ్గా ఉంటుంది.

* టేబుల్‌ సొరుగుల్లో రోజూ అవసరమైన వస్తువులు పైదాంట్లో అరుదుగా వాడేవి కింది వాటిల్లో పెడితే సమయానికి తేలిగ్గా దొరుకుతాయి. కత్తెర, కొలత టేప్‌ లాంటివి ఎక్కడున్నాయో తెలీకపోతే ఉండీ ప్రయోజనం ఉండదు కదా!

* హ్యాండ్‌బ్యాగుల్లాంటివి ఆయా సందర్భాలకు అనుగుణంగా వివిధ ఆకృతుల్లో, సైజుల్లో అనేకం ఉండటం మామూలే. వాటిని ఒకచోట పేర్చకుండా ఒక పద్ధతిలో తగిలిస్తే అడ్డు అనిపించకపోగా అలంకరణ సామగ్రిలా అందం తెస్తాయి. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఉపయోగించే మేకప్‌ సామగ్రిని వీటిల్లో ఒక సంచిలో వేస్తే సరి.

* దుస్తులు అందంగా మడవటం కూడా కళే. ఎక్కువ స్థలం ఆక్రమించకుండా మడిచిపెట్టుకోవాలి. తక్కినవి రంగులను బట్టి హ్యాంగర్లకు తగిలిస్తే తీసుకోవడం తేలిక, చూడముచ్చటగా ఉంటాయి.

* చిన్నారులకు అవసరమైన క్రేయాన్స్‌, స్కెచ్‌పెన్నులు, ఆట వస్తువులు, బొమ్మలు లాంటివన్నీ క్రమపద్ధతిలో అమర్చడమే కాదు, వాటిని వాడుకున్నాక యథాస్థానంలో పెట్టేలా అలవాటు చేయాలి. పిల్లల పుట్టినరోజులు పూజలు లాంటి సందర్భాల్లో అలంకరించే స్టిక్కర్లు, రంగు రిబ్బన్లు లాంటి సామగ్రిని ప్రతిసారీ కొనకుండా ఒక డబ్బాలో దాచి అటక మీద పెడితే సమయానికి తీసుకోవచ్చు.

* పెంపుడు జంతువులు కనుక ఉంటే వాటికి ఏ సమయంలో ఎలాంటి ఆహారం పెట్టాలో డబ్బాల్లో పొందిగ్గా అమర్చి, వాటి మీద రాసి ఉంచితే అందరికీ సులువుగా ఉంటుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని