అందమైన ఇంటి కోసం పావుగంట నియమం
close
Published : 24/01/2022 00:24 IST

అందమైన ఇంటి కోసం పావుగంట నియమం

ఇల్లాలంటేనే బహు కళా కోవిదురాలు. ఎన్నో పనులు చక్కబెట్టుకుంటుంది. ప్రతిదీ కళాత్మకంగా ఉండాలని చూస్తుంది. తన నైపుణ్యంతో ఇంటిని అందంగా అమర్చుకుంటుంది. ఏ వస్తువులు ఎక్కడుంటే సదుపాయమో, చూడముచ్చటగా ఉంటాయో ఆలోచిస్తుంది. అందుకు తోడ్పడే ఇంకొన్ని సూచనలు...

ల్లు సర్దబోతున్నారా... అయితే పావుగంట నియమం ఒకటి కల్పించుకోండి! సరిగ్గా సమయం చూసి పదిహేను నిమిషాల్లో ఒక గదిని లేదా అరని ఎంతవరకూ సర్దగలిగితే అంతవరకూ సర్ది, ఇక అంతటితో ఆపేయండి. వేగంగా చేయడం మీదే మీ దృష్టి ఉంటుంది కనుక ఎంతమాత్రం అలసట కలగదు. మిగిలిన పని మర్నాడు మళ్లీ చేసుకోవచ్చు. మొత్తానికి చాలా త్వరగా పని పూర్తవుతుంది. ఎంతో సంతృప్తిగానూ అనిపిస్తుంది.

* పడేయొద్దు.. చెప్పులు, బూట్లకు వచ్చే అట్టపెట్టెలు అడ్డుగా అనిపించి పడేస్తుంటాం. నిజానికి వాటినలాగే ఉంచితే రోజూ వాడనివి వాటిల్లో పెట్టుకోవచ్చు. ఒకదాని మీద ఒకటి పేర్చడం సులువుగా ఉంటుంది.

* ఎలక్ట్రానిక్‌ వస్తువులు  బల్బులు, వైర్లు, ప్లగ్‌లు, ఎక్స్‌టెన్షన్‌ బాక్స్‌, అదనంగా ఉన్న చార్జర్లు లాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులన్నీ ఒక అరలో భద్రపరిస్తే అవసరమైనప్పుడు సులువుగా తీసుకోవచ్చు. లేదంటే సమయానికి దొరకవు.

* పరిశుభ్రత.. క్లీనింగ్‌ లిక్విడ్‌, అవసరమైన బ్రష్షులు, ఫెదర్‌ డస్టర్‌, స్క్రబర్‌, న్యాప్‌కిన్‌లు, మాప్‌స్టిక్‌, మాప్‌ బకెట్‌ లాంటి శుభ్రపరిచే వస్తువులన్నీ ఒక టబ్బులో ఉంచితే దేనికోసమూ వెతుక్కోక్కుండా త్వరగా, తేలిగ్గా ఇల్లు పరిశుభ్రమవుతుంది.

* హ్యాండ్‌బ్యాగ్‌.. వాలెట్‌.. ఇల్లు దాటి బయటకు వెళ్తున్నారంటే భుజానికి హ్యాండ్‌బ్యాగ్‌ ఉండాల్సిందే కదా! అయితే అందులో అనవసరమైన కాగితాలన్నీ పేరుకుపోయి అత్యవసరమైన కరెంట్‌ బిల్లో, మెడికల్‌ ప్రిస్క్రిప్షనో ఒకపట్టాన దొరకదు. ఇలాంటి సమస్య రాకుండా ఎప్పటికప్పుడు అనవసరమైనవన్నీ తీసేయండి. బ్యాగులో ఉండే వాలెట్‌కీ ఇది వర్తిస్తుంది. క్రెడిట్‌, డెబిట్‌, హెల్త్‌ కార్డుల్లాంటి అత్యవసరమైనవి మాత్రమే ఉండేలా చూసుకోండి.


Advertisement

మరిన్ని