ఆ భావనతోనే ఒత్తిడి...

మౌనిక ఆఫీస్‌లో ఉన్నంతసేపూ ఉత్సాహంగానే ఉండగలుగుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. అప్పటివరకు ఉన్న చురుకుదనం ఒంటరిగా అయ్యేసరికి ఒక్కసారిగా మటుమాయం కావడం ఆమెకు అర్థంకాని సమస్యగా మారింది. ఇటువంటి సమయంలో ఒత్తిడిని జయించకపోతే అది పలు రకాల ప్రతికూల ఆలోచనలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు మానసిక నిపుణులు....

Published : 01 Sep 2021 01:18 IST

మౌనిక ఆఫీస్‌లో ఉన్నంతసేపూ ఉత్సాహంగానే ఉండగలుగుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. అప్పటివరకు ఉన్న చురుకుదనం ఒంటరిగా అయ్యేసరికి ఒక్కసారిగా మటుమాయం కావడం ఆమెకు అర్థంకాని సమస్యగా మారింది. ఇటువంటి సమయంలో ఒత్తిడిని జయించకపోతే అది పలు రకాల ప్రతికూల ఆలోచనలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు మానసిక నిపుణులు.

గుర్తించాలి... ఏయే సమయాల్లో మనసు ఒత్తిడికి లోనవుతుందో కనిపెట్టాలి. ఏదైనా అంశం గురించి ఆలోచించేటప్పుడు లేదా ఆయా సందర్భానికి ఆందోళన మనల్ని దరిచేరుతోందా అనేది ఎవరికి వారు గుర్తించగలగాలి. కొందరికి ఒంటరిగా ఉన్నామనే భావనే తీవ్ర ఒత్తిడికి దారితీసేలా చేస్తుంది. వీటిలో ఏది మనసును ఆందోళనలోకి నెడుతుందో తెలుసుకోవాలి.

సాధన... ఒత్తిడికి గురయ్యే సందర్భాలను తెలుసుకున్న తర్వాత వాటికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఏయే ఆలోచనలు మనసును ఆందోళనపరుస్తున్నాయో అవి దరికి చేరకుండా సాధన చేయాలి. ఆ సమయాన్ని మరొక దిశగా మార్చడానికి కృషి చేయాలి. మనసుకు నచ్చిన పుస్తక పఠనం, తోట పెంపకం, చెస్‌ వంటి మైండ్‌గేమ్స్‌ ఆడటం ద్వారా మనసు మరోవైపు మళ్లుతుంది. యోగా, వ్యాయామం శరీరాన్ని మాత్రమే కాక మనసునూ ప్రశాంతంగా ఉంచుతాయి. వీటిని ప్రయత్నించండి.

నచ్చిన వారిని... మనసుకు దగ్గరైన, నచ్చిన స్నేహితులతో వీడియో కాల్‌ మాట్లాడటం వల్ల కొంత ప్రశాంతత దక్కుతుంది. వీలైనంత వరకూ ఒంటరిగా కాకుండా నలుగురితో కలిసి అవుట్‌డోర్‌ గేమ్స్‌ ఆడటం లేదా ట్రెక్కింగ్‌ చేసి ప్రకృతిని ఆస్వాదించడం వంటివి కూడా ఒత్తిడిని దూరం చేస్తాయి. నచ్చిన వంటకాన్ని తయారు చేయడం, చిత్రకళను నేర్చుకోవడం వంటివీ ప్రశాంతతను అందిస్తాయి.

కొత్తగా... నిత్యం చేసే పనులు కాకుండా కొత్తగా ఆలోచించడం, అప్పటి వరకు చేయని ఏదైనా పనిని ఎంచుకోవడం ద్వారా ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. సౌందర్య పరిరక్షణకు కొంత సమయాన్ని ఉపయోగించడం, ఉన్న దుస్తులతో కొత్తగా మ్యాచింగ్‌ ప్రయత్నించడం, వినూత్నంగా హెయిర్‌స్టైల్‌ మార్చుకోవడం వంటివి చేస్తే మనసు మళ్లుతుంది.

సాయం... అనాథ చిన్నారుల ఆశ్రమం, వృద్ధాశ్రమాలకు వెళ్లి వారి అవసరాలను తెలుసుకోవాలి. వారికి చేతనైనంత సాయం చేయడానికి ముందడుగు వేయాలి. మొదట కొత్తగా అనిపించినా, దీనిద్వారా మనసు సంతోషంతో నిండుతుంది. అనాథల కష్టాలను చూసినప్పుడు వారి కన్నా మన పరిస్థితి ఎంతో మెరుగు అనే భావం మనల్ని మానసిక అనారోగ్యాల నుంచి దూరం చేస్తుంది. లేనివారికి చేయూత నందించామనే తృప్తినీ అందిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్