Updated : 21/07/2022 08:48 IST

సాటెవ్వరు సోఫియాకి!

మోడల్‌గా అంతర్జాతీయ ఫ్యాషన్‌ షోల్లో మెరిసింది, జాతీయస్థాయి క్రీడాకారిణి. అక్కడితో అయిపోలేదు ఆమె ప్రత్యేకతలు.. ప్రొఫెషనల్‌ బైకర్‌, సినిమా నటి కూడా. కానీ తనకు వినిపించదు, మాట్లాడ లేదు. అయితేనేం... ఎనలేని ఆత్మవిశ్వాసంతో కలలు కంటూ, వాటిని సాకారం చేసుకుంటూ దూసుకెళ్తోంది సోఫియా.

ది నెలలప్పుడే సోఫియాకి వినికిడి సమస్య ఉన్నట్టు గుర్తించారు తల్లిదండ్రులు. నాన్న జో ఫ్రాన్సిస్‌ హిందూస్థాన్‌ పెట్రోలియంలో అధికారిగా రిటైరవ్వగా, తల్లి గారెట్టి రిటైర్డ్‌ టీచర్‌. వీరిది కేరళలోని ఎర్నాకుళం. సోఫియాని సాధారణ పిల్లల్లానే పెంచాలనుకున్నారు వాళ్లు. అందుకని మామూలు స్కూళ్లకే పంపారు. అక్కడ ఆమె ఇంగ్లిష్‌, మలయాళం పదాల్ని పెదాల కదలికల ద్వారానే అర్థం చేసుకోవడం నేర్చుకుంది. అవరోధాలెన్ని ఎదురైనా చదువుల్ని విజయవంతంగా పూర్తిచేసింది. చదువుతూనే క్రీడల్లోనూ అడుగుపెట్టింది. టీనేజ్‌లో ఉండగానే బధిరుల విభాగంలో ఎనిమిది సార్లు రాష్ట్ర, మూడుసార్లు జాతీయ స్థాయిలో షాట్‌పుట్‌లో విజేతగా నిలిచింది. ‘దివ్యాంగులుగా బతకడంలో క్లిష్టమైన అంశమేంటంటే... మా ప్రతిభకన్నా ముందు మా లోపాల్ని గుర్తిస్తారు. వెంటనే ఒక అంచనాకి వచ్చేసి సానుభూతి చూపిస్తారు. అది ఎంతో నిరుత్సాహపరుస్తుంది. మమ్మల్ని కూడా అందరిలో ఒకరిగా చూస్తే సాధారణ జీవితం గడపగలం. అందరితో పోటీ పడగలం’ అంటూ సైగల భాషలో వివరిస్తుంది సోఫియా.

సాహసాలంటే సై అనే సోఫియా బైకర్‌ అవ్వాలనుకుంది. బధిరులకు లైసెన్స్‌ ఇవ్వలేమని అధికారులు తిరస్కరించారు. తను ఊరుకుంటుందా? న్యాయస్థానం తలుపుతట్టి మరీ లైసెన్స్‌ తెచ్చుకుంది. కేరళలో సాధారణ డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందిన తొలి బధిరురాలు తనే. సోఫియా తమ్ముడు రిచర్డ్‌దీ ఇదే సమస్య. ఇద్దరూ కోయంబత్తూరులో బైక్‌ రేసింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. ప్రొఫెషనల్‌ బైక్‌ రేసర్లుగా గుర్తింపు సాధించారు.

సినిమాల్లోనూ...

మోడలింగ్‌లోనూ మెరిసింది సోఫియా. చాలా ఫ్యాషన్‌ షోల్లో పాల్గొంది. ఓ ప్రముఖ ఛానెల్‌ నిర్వహించిన రియాలిటీ షోలో విజేత తను. మిస్‌ డెఫ్‌ ఇండియా 2014 రన్నరప్‌గా, ప్రేగ్‌లో జరిగిన మిస్‌ డెఫ్‌ వరల్డ్‌ 2014 పోటీల్లో ఆరో స్థానంలో నిల్చింది. 2018లో మలయాళంలో వచ్చిన ‘శబ్దం’ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది సోఫియా. అంతా బధిరులే ఉన్న ఓ కుమ్మరి కుటుంబంపైన తీసిన ఆ సినిమాలో రిచర్డ్‌ సోఫియాకు కొడుగ్గా నటించడం విశేషం. ‘ఆ సినిమా ద్వారా బధిరుల సమస్యల్ని వెలుగులోకి తేవడం మర్చిపోలేని అనుభవం’ అని చెబుతోందామె. ఇటీవల వచ్చిన మమ్ముట్టి చిత్రం ‘సీబీఐ 5’లో కూడా నటించింది. వైకల్యం ఉన్నా పట్టుదల, ఆసక్తి ఉంటే ఏదైనా సాధించవచ్చని, వాళ్లు ఎవరికీ తీసిపోరని నిరూపిస్తోన్న 27 ఏళ్ల సోఫియా ఇకపై ఏదో ఒక రంగంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలనుకుంటున్నట్టు చెబుతోంది. తన పట్టుదల, శక్తి సామర్థ్యాలు తెలిశాయి కాబట్టి ఆ లక్ష్యాన్ని సాధిస్తుందన్న దాంట్లో అనుమానం లేదు కదా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని