హార్డ్‌ వర్క్‌ను స్మార్ట్‌గా...

ఉదయం నుంచి సుష్మితకు ఇంట్లో క్షణం తీరిక  ఉండదు. అయినా సమయానికి పనవ్వదు. పూర్తయినా పనిలో నాణ్యత ఉండదు. అలాగే ఆఫీస్‌లోనూ నిమిషం ఖాళీగా ఉండకుండా బాధ్యతలు పూర్తిచేద్దామని చూసినా వీలుకాదు. అందుకే ఎంతపని ఉన్నా స్మార్ట్‌గా పూర్తిచేసే నైపుణ్యాలను పెంచుకోవాలంటున్నారు నిపుణులు.

Published : 17 Aug 2022 01:48 IST

ఉదయం నుంచి సుష్మితకు ఇంట్లో క్షణం తీరిక  ఉండదు. అయినా సమయానికి పనవ్వదు. పూర్తయినా పనిలో నాణ్యత ఉండదు. అలాగే ఆఫీస్‌లోనూ నిమిషం ఖాళీగా ఉండకుండా బాధ్యతలు పూర్తిచేద్దామని చూసినా వీలుకాదు. అందుకే ఎంతపని ఉన్నా స్మార్ట్‌గా పూర్తిచేసే నైపుణ్యాలను పెంచుకోవాలంటున్నారు నిపుణులు.

నుల్ని రోజూ ఒకే సమయానికి ప్రారంభించాలి. సమయ పాలన పాటించాలి. ప్రతి పనికీ నిర్ణీత సమయాన్ని కేటాయించుకోవాలి. ఆ రోజు చేయాల్సినవి ఓ చోట రాసుకోవాలి. దేనికి ఎంత సమయం పడుతుందో అంచనా వేసుకుని, ఆలోపే చేయడానికి ప్రయత్నించాలి. ఇవన్నీ పాటించాలంటే ముఖ్యంగా కావాల్సింది ఏకాగ్రత. ఇందుకోసం రోజూ ఉదయం అరగంట ధ్యానం, యోగా చేస్తే మనసు ప్రశాంతంగా, మెదడు ఉత్సాహంగా మారి ఏకాగ్రత పెరుగుతుంది. పనిపైనే దృష్టి నిలిచి, నాణ్యతా ఉంటుంది. 

లెక్కగా.. మల్టీ టాస్కింగ్‌ చేసి ఎందులోనూ నాణ్యత లేకుండా చేస్తే విఫలం అయినట్టే. అందుకే రోజూ నిర్దిష్ట సంఖ్యలోనే పనులను కేటాయించుకోవాలి. వాటిని సవాలుగా తీసుకుని ఏకాగ్రతతో బాగా చేయాలి. అయ్యాక ఒకటికి రెండు సార్లు సరి చూసుకోవడం మంచిది. పొరపాట్లను గుర్తించగలిగితే, మరోసారి జరగకుండా జాగ్రత్త పడొచ్చు. ఈ పద్ధతి అలవడిన తర్వాత పనుల సంఖ్యను కాస్త పెంచుకోవాలి. చిన్న చిన్న లక్ష్యాల నుంచి మొదలు పెట్టి క్రమేపీ పెద్ద లక్ష్యాన్ని పెట్టుకోవడానికి అలవాటు పడాలి. ఇది మెదడుకు ప్రాక్టీస్‌గా మారుతుంది. మొదట రెండుమూడు పనుల నుంచి నాలుగైదింటిని సునాయసంగా చేసేలా మెదడు మారుతుంది. దీనివల్ల హార్డ్‌వర్క్‌ కూడా స్మార్ట్‌గా చేయగలుగుతాం.

మరొకటి.. ఒక పని చేసేటప్పుడు మరొకపని గురించి ఆలోచించకూడదు. చేసే పనిపైనే ధ్యాసపెట్టాలి. దీనికి మెదడుకు తగిన వ్యాయామాన్ని అందించాలి. పజిల్స్‌ పూర్తి చేయడం, ఈ అంశాలకు సంబంధించిన పుస్తకాలు చదవడం మంచి ఫలితాన్నిస్తుంది. తెలియని అంశాలపై అవగాహన పెంచుకోవడం, ఏ విషయానికైనా త్వరగా స్పందించడం అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ మెదడును చురుకుగా మార్చి, క్లిష్టమైన సమస్యనైనా తేలికగా పరిష్కరించేలా చేస్తాయి. పని పూర్తయ్యాక ముందు నాణ్యత విషయాన్ని పరిశీలించాలే కానీ దానికి సమయమెంత పట్టిందన్నది కాదు. ముందు మెదడు వేగంగా ఆలోచించేలా చేయడం ప్రారంభిస్తే... ఆ తర్వాత గడువులోగా పనులన్నీ పూర్తవడం మొదలవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని