అప్పుడు నో చెప్పొచ్చు!
పని ప్రదేశంలో ‘కుదరదు’ అని చెప్పే అమ్మాయిలు చాలా తక్కువ. కెరియర్ ప్రారంభంలో అయితే ఆ ఆలోచనకే భయపడతారు. అదే వద్దంటున్నారు నిపుణులు. కొన్ని సందర్భాల్లో ‘నో’ చెప్పకపోవడమే తప్పంటున్నారు.
పని ప్రదేశంలో ‘కుదరదు’ అని చెప్పే అమ్మాయిలు చాలా తక్కువ. కెరియర్ ప్రారంభంలో అయితే ఆ ఆలోచనకే భయపడతారు. అదే వద్దంటున్నారు నిపుణులు. కొన్ని సందర్భాల్లో ‘నో’ చెప్పకపోవడమే తప్పంటున్నారు.
* ఉద్యోగం కొత్తలో ప్రతిదీ తెలుసుకోవాలన్న తపన సాధారణమే. మీ విభాగంతో సంబంధం ఉన్న ప్రతిదాని గురించీ తెలుసుకోవాలి కూడా. అందుకని మీ బాధ్యతలను పక్కన పెట్టి, ఇతరులకు పనిచేసి పెట్టడం లాంటివి వద్దు. సీనియర్లు పని అప్పగించినా.. అది మీ పరిధిలోనిది కాకపోతే సున్నితంగానైనా ‘చేయలేను’ అని చెప్పండి. తప్పులొస్తే మీ ఉద్యోగానికే ఎసరు.
* ఆఫీసులో ప్రతి పనికీ గడువులు ఉంటాయి. ఆ సమయంలోగా అప్పగించాల్సిందే కూడా. అలాగని వారం రోజుల పని రెండు రోజుల్లో చేయమన్నారనుకోండి. ఎవరికైనా కష్టమే కదా! ఒక గంట ఎక్కువ పని చేయాల్సి వస్తే సరేననొచ్చు. కానీ మరీ కష్టమైతే మాత్రం ‘ఏమనుకుంటారో’ అని ఆలోచించొద్దు. ‘ఈ సమయంలోగా పూర్తిచేయలేను. వేరొకరిని సాయంగా ఇవ్వండి లేదా అదనపు సమయం ఇవ్వండి’ అని అడగొచ్చు. ఇలాంటి ఇబ్బందులు చెప్పకపోతే అవతలి వాళ్లకి ఎప్పటికీ అర్థం కావు.
* సెలవుల్లో మెదడు తెలియకుండానే విశ్రాంతిని తీసుకుంటుంది. ఆ సమయంలోనూ పనికి సంబంధించిన ఫోన్లు వస్తుంటే చిరాకే కదూ! లీవ్‌కు ముందే అప్పగించాల్సిన పనిని పూర్తిచేయండి. ఆ వివరాలను తోటివారితో పంచుకోండి. మీ విరామ సమయంలో వేరే వాళ్లూ మిమ్మల్ని కదిలించరు. మీ పనిలో సందేహాలు అయితే సెలవుల్లోనూ సాయం చేయొచ్చు. కానీ మిగతా ఏదైనా అందుబాటులో ఉండనన్న మెసేజ్ ముందుగానే తోటివారికి చేరేలా చూడండి.
* పని విషయంలో సందేహాలు సాధారణమే. ఒకసారి మీకు పక్కవాళ్ల అవసరమొస్తే.. ఇంకోసారి పక్కవాళ్లకి మీ అవసరం రావొచ్చు. అయితే దానికీ హద్దు ఉండాలి. కొందరు మాటల్లో పెట్టి, వాళ్ల పనినీ చేయించాలని చూస్తుంటారు. దానికి... బాగా చేస్తారన్న పొగడ్తో, నా వల్ల కావడం లేదన్న సాకో చెబుతుంటారు. ఒకటి, రెండుసార్లు అయితే సరే! పదే పదే జరుగుతోంటే.. ‘సమయం లేద’ని చెప్పాల్సిందే.
* ఆఫీసన్నాక తోటివారితో అనుబంధం తప్పనిసరే! కానీ తోటివాళ్లని మెప్పించాలనో, వాళ్లని సంతోష పరచాలనో వాళ్లకి నచ్చని వాళ్లని ఇబ్బంది పెట్టొద్దు. వాళ్లు ప్రోత్సహించినా, ఆదేశించినా ‘కుదరద’ని కరాఖండిగా చెప్పేయండి. లేదంటే వాళ్ల పరిస్థితే రేపు మీకూ రావొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.