నిమ్మరసం అమ్మిన చోటే.. పోలీసు అధికారిణిగా..

కట్టుకున్నోడికీ, కుటుంబానికీ దూరమై.. చేతిలో నెలల చిన్నారితో ఒంటరైంది! ఆ పసివాడి ఆకలి తీర్చడానికి చిన్నాచితకా పనులెన్నో చేసింది..

Published : 29 Jun 2021 01:49 IST

కట్టుకున్నోడికీ, కుటుంబానికీ దూరమై.. చేతిలో నెలల చిన్నారితో ఒంటరైంది! ఆ పసివాడి ఆకలి తీర్చడానికి చిన్నాచితకా పనులెన్నో చేసింది.. చివరికి రోడ్డువారన నిమ్మరసం కూడా అమ్మింది 31 ఏళ్ల అన్నీశివ.  ఆ పరిస్థితి నుంచి ఎస్సైగా మారి అందరి మన్ననలు అందుకుంటున్న అన్నీ కథ ఎందరికో స్ఫూర్తిదాయకం...

దువులో చురుకుగా ఉండే అన్నీని పోలీసు ఆఫీసర్‌గా చూడాలనేది ఆమె తండ్రి కల. తన ఆశయం కూడా అదే. కానీ ప్రేమించిన వాడికోసం చదువునూ, ఆశయాన్నీ పక్కనపెట్టింది. దురదృష్టవశాత్తు ఆ బంధం ఎన్నో రోజులు నిలబడలేదు. ఒక బాబు పుట్టాక వాళ్లు విడిపోయారు. ఆరునెలల ఆ చిన్నారిని తీసుకుని ఒంటరిగా బయటకొచ్చింది. అప్పటికి ఆమె వయసు 18. ఇటు కన్నవాళ్లూ చేరదీయలేదు. ఉద్యోగం చేద్దామంటే చేతిలో డిగ్రీ లేదు. దాంతో సేల్స్‌గర్ల్‌గా ఇంటింటికీ తిరిగి చిన్నచిన్న వస్తువులను అమ్మేది. పర్యాటక ప్రాంతాల్లో నిమ్మరసం, ఐస్‌క్రీం అమ్ముతూ పొట్టపోసుకుంది. ఇలా కష్టపడుతూనే... డిగ్రీ పూర్తిచేసి దూరవిద్యలో పీజీ చదివింది. పోలీసుశాఖలో చేరడానికి ప్రవేశ పరీక్షకు హాజరై ఉత్తీర్ణత సాధించింది. సివిల్‌ పోలీసు ఆఫీసర్‌గా 2016లో విధుల్లో చేరింది. ఎస్సై అవ్వాలనే తన ఆశయాన్ని మర్చిపోలేదు. మూడేళ్ల తర్వాత తన కల నెరవేరింది. ‘నన్ను పోలీసు ఆఫీసర్‌గా చూడాలనేది నాన్న కల. ఏడాదిన్నరపాటు శిక్షణ పూర్తిచేసుకుని ఇప్పుడు ఎస్సై అయ్యా. వర్కలా పోలీసుస్టేషన్‌ పరిధిలో శివగిరి వంటి పర్యాటక ప్రాంతాలెక్కువ. ఇక్కడే నా బిడ్డను పోషించుకోవడం కోసం నిమ్మరసం, ఐస్‌క్రీం అమ్మేదాన్ని. ఇప్పుడదే పోలీసు స్టేషన్‌కు ఎస్సైగా వచ్చా. ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలెదుర్కొన్నా. ఒంటరిగా నా కొడుకును పెంచడానికి చాలా శ్రమించా. మంచి స్కూల్లో వేశా. వాడితోపాటు నేనూ చదువుకున్నేదాన్ని. నా ఆశయ సాధనలో మగవాళ్ల నుంచి ఇబ్బంది రాకూడదని అబ్బాయిలా కనిపించడానికి క్రాఫ్‌ చేయించుకున్నా. జీవితంలో అనుకోనిది జరిగితే ఏడుస్తూ కూర్చోకూడదు. అవకాశం ఉన్నంతవరకూ పోరాడుతూనే ఉండాలి. నా గెలుపును మా పోలీసు విభాగం ఫేస్‌బుక్‌లో ప్రస్తావించి అభినందనలు తెలపడం ఆనందంగా ఉంది. ‘కష్టాలెన్నెదురైనా వాటిని ఛాలెంజ్‌గా తీసుకుని సాధించింది’ అంటూ సోషల్‌మీడియాలో సినీనటులు, ప్రముఖులెందరో ప్రశంసిస్తుంటే సంతోషంగా ఉంది. అన్నింటికంటే ఎక్కువగా ‘చేతిలో నెలల చిన్నారితో అనాథలా నిలిచినా, జీవితంతో పోరాడి గెలిచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ గర్వకారణమైంది’ అని మా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణాజార్జి అనడం, శశిథరూర్‌ నా కథను చదివి చాలా స్ఫూర్తి పొందానంటూ ప్రశంసించడం నా జీవితంలో మర్చిపోలేను’ అంటోంది అన్నీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్