ఇంతందం.. ఏమిటీ రహస్యం?
అందం అనగానే ఠక్కుమని ఐశ్వర్యారాయ్ గుర్తొస్తుంది. యాభైకి దగ్గరవుతున్నా ఆమె సౌందర్యం ఇసుమంత కూడా తగ్గలేదు! సుస్మిత, శిల్ప, అనుష్క ఇంకా కొందరు తారలూ వయసును జయించినట్టు కనిపిస్తుంటారు. అదంతా మేకప్ మాయే అనుకుంటే పప్పులో కాలేసినట్టే... మరోపక్క ముప్పైల్లోకి అడుగు పెట్టామో లేదో అందం తరుగుతోందని బెంగపడే అమ్మాయిలెందరో! ఈ తారలంతా యువతరంతో పోటీపడుతూ అందాన్ని ఎలా కాపాడుకుంటున్నారు? ఇదే అనుమానం వసుంధరకి కూడా వచ్చి శోధించింది. వాళ్లేం చేస్తున్నారో మీరూ చూడండి... ఆచరించండి!
అందం అనగానే ఠక్కుమని ఐశ్వర్యారాయ్ గుర్తొస్తుంది. యాభైకి దగ్గరవుతున్నా ఆమె సౌందర్యం ఇసుమంత కూడా తగ్గలేదు! సుస్మిత, శిల్ప, అనుష్క ఇంకా కొందరు తారలూ వయసును జయించినట్టు కనిపిస్తుంటారు. అదంతా మేకప్ మాయే అనుకుంటే పప్పులో కాలేసినట్టే... మరోపక్క ముప్పైల్లోకి అడుగు పెట్టామో లేదో అందం తరుగుతోందని బెంగపడే అమ్మాయిలెందరో! ఈ తారలంతా యువతరంతో పోటీపడుతూ అందాన్ని ఎలా కాపాడుకుంటున్నారు? ఇదే అనుమానం వసుంధరకి కూడా వచ్చి శోధించింది. వాళ్లేం చేస్తున్నారో మీరూ చూడండి... ఆచరించండి!
* ఫిట్‌నెస్
అందంపై జీవనశైలిదే ఎక్కువ ప్రభావం. అందుకే తారలు యోగా, వ్యాయామాల ద్వారా ఫిట్నెస్‌కు ప్రాధాన్యమిస్తారు. వ్యాయామం శరీర భాగాలన్నింటికీ రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి, కణాలు ఉత్తేజంగా ఉండేలా చేస్తుంది. ఇది లోపల్నుంచీ సౌందర్య పోషణ, మంచి శరీరాకృతిని ఇస్తుంది. ఇక వస్త్రాలు సగం అందానికి కారణం. ఆకర్షించే శరీరానికి ఏ వస్త్రాలైనా ఇట్టేనప్పుతాయి. వయసూ తగ్గినట్లు కనిపిస్తుంది. కాబట్టి, వయసు ప్రభావం పడొద్దంటే వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలన్నమాట.
* ఏం తింటున్నాం?
శరీరానికి ఏం అందిస్తున్నామన్న దానిపైనే ఎలా కనిపిస్తున్నామన్నదీ ఆధారపడుతుంది. చర్మం, కురులు, గోళ్లు నిర్జీవంగా కనిపిస్తున్నాయంటే తగినంత ప్రొటీన్ అందట్లేదనే! బ్యాలెన్స్‌డ్ డైట్‌తోనే చర్మం ఆరోగ్యంగా మెరిసేది. ఆరోగ్యకరమైన కొవ్వులు, విత్తనాలు, పండ్లు, కూరగాయలు రోజూ తప్పకుండా తీసుకుంటే నిత్య యౌవ్వనం మీ సొంతమైనట్లే. ఎంత బిజీగా ఉన్నా వేళకు ఆహారం తీసుకుంటారు మన తారలు. మీరూ వాళ్లలాగే న్యూట్రియంట్లు ఎక్కువగా ఉండే ఆహారం.. ఎక్కువ మొత్తంలో ద్రవపదార్థాలను తీసుకోవడంపై దృష్టిపెట్టేయండి.
* చర్మసంరక్షణ
శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో చర్మానికీ పోషణ అంతే అవసరం. కెమెరా ముందు తళుక్కుమనడానికి మేకప్‌కి ఎంత ప్రాధాన్యమిస్తారో.. దాన్ని తొలగించడంలోనూ అంతే శ్రద్ధ చూపుతారు. స్కిన్‌కేర్ రొటీన్‌ను తప్పక పాటిస్తారు. చర్మం ఆరోగ్యంగా సహజంగా మెరవాలంటే చర్మతత్వానికి తగిన ఉత్పత్తులను ఎంచుకొని కచ్చితమైన స్కిన్ కేర్ రొటీన్‌ను అనుసరించక తప్పదు. ఎంత ఆలస్యమైనా మేకప్‌ను తొలగించాలి.
* ఒత్తిడికి దూరం
ఒత్తిడికి తారలూ మినహాయింపు కాదు. లోపల ఆలోచనలు సతమతం చేస్తోంటే.. బయట నుంచి ఎన్ని పూతలు వేసినా సహజ అందం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ఎప్పుడూ నవ్వుతూ, సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తుంటారు. తమకంటూ కొంత సమయాన్ని తప్పక కేటాయించుకుంటారు. నిద్రా సమయాన్నీ కచ్చితంగా పాటిస్తారు.
మేమేం పాటిస్తామంటే..!
వాటన్నింటికీ దూరం
- ఐశ్వర్యారాయ్ (48)
తినే ఆహారమే అందాన్నీ నిర్ణయిస్తుంది. అందుకే ఈ విషయంలో కచ్చితంగా ఉంటా. ఇంటి భోజనం, తాజా కూరగాయలు, పండ్లకే నా ఓటు. నూనె, ప్యాకేజ్‌డ్ పదార్థాలకు దూరం. తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు ఆహారాన్ని తీసుకుంటా. ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవడంతో కొవ్వు సమస్య ఉండదు. కనీసం 8 గ్లాసుల నీరు తాగుతా. దీంతో చర్మం తేమగా ఉంటుంది. కఠిన వ్యాయామాలు కాక పవర్ యోగా, బ్రిస్క్ వాక్‌లకు ప్రాధాన్యమిస్తా. రసాయనాలతో కూడిన క్రీములను వాడటానికి ఇష్టపడను. సెనగపిండి, పాలు, పసుపు మిశ్రమాన్ని లేదా కీరా రసాన్ని ఫేస్ ప్యాక్‌లుగా వాడతా. ఎప్పుడు ముఖం కడిగినా మాయిశ్చరైజర్ తప్పక రాస్తా. వీటివల్లే యువతతో పోటీ పడగలుగుతున్నా.
నీళ్లంటే ఇష్టం
- శిల్పా శెట్టి (47)
శరీరాన్ని ఉల్లాసంగా, చర్మాన్ని మెరిసేలా చేయడంలో నీళ్లదే ప్రధాన పాత్ర. గోరువెచ్చని నీటితో రోజును ప్రారంభించి, రోజు మొత్తంలో కనీసం 10 గ్లాసుల నీటిని తాగుతా. చిరుధాన్యాలు, గోధుమతో చేసిన అల్పాహారం, పండ్లు, మధ్యాహ్న భోజనానికి దంపుడు బియ్యం, రాత్రికి వెజ్ సూప్, రోటీ... ఇదీ నా మెనూ. స్నాక్స్‌గా ఎక్కువగా పండ్లనే తీసుకుంటా. నెయ్యిని రోజూ తప్పక తీసుకుంటా. రసాయనాలుంటాయని సబ్బును అస్సలు వాడను. మైల్డ్ ఫేస్‌వాష్, మాయిశ్చరైజర్‌కు ప్రాధాన్యమిస్తా. సన్‌స్క్రీన్ లేకుండా అడుగు బయట పెట్టను. రోజూ తప్పక యోగా చేస్తా. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి మనసే కాదు.. చర్మ ఆరోగ్యానికీ సాయపడుతుంది.
మనసు ఆరోగ్యంగా ఉంటేనే
- సుస్మితా సేన్ (46)
అందంగా కనిపించాలంటే మానసిక ఆనందం, ఆరోగ్యం ముఖ్యమని నా నమ్మకం. అందుకే రోజూ యోగాతోపాటు పవర్ ప్లేట్ ఎక్సర్‌సైజ్, పైలేట్స్, క్రంచెస్ వంటివీ చేస్తా. దీనివల్ల చెమటతోపాటు లోపలి మలినాలు బయటికి పోయి చర్మం మెరుస్తుంది. సెనగపిండి, వెన్నతో స్నానం, బొప్పాయి, నారింజ రసాల ప్యాక్‌లు నా మెరిసే చర్మ రహస్యం. వేపుడు పదార్థాలు, జంక్‌ఫుడ్‌కు నేను దూరం. పండ్ల రసాలు, నీటిని ఎక్కువగా తీసుకుంటా. స్నాక్స్‌గా పండ్లు లేదా ఇడ్లీ, ఉప్మా, బాదంలకు ప్రాధాన్యమిస్తా.
మేకప్‌కు దూరం
- అనుష్క శెట్టి (40)
సెట్‌లోంచి కాలు బయటపెడితే మేకప్‌కు వీలైనంత దూరంగా ఉంటా. నా చర్మ, కేశాల ఆరోగ్యానికి నీళ్లు, కొబ్బరినీళ్లు ఎక్కువగా తీసుకుంటా. వంటింటి సాధనాలతోనే సౌందర్యాన్ని పెంచుకుంటా. సెనగపిండిలో నిమ్మరసం ట్యాన్ నుంచి దూరం చేయడమే కాదు, మెరుపునీ, మృదుత్వాన్నీ ఇస్తుంది. చక్కెరకు బదులుగా తేనెని వాడతా. ఎంత బిజీగా ఉన్నా క్రమం తప్పక చేసే యోగా శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంతోపాటు చర్మానికీ మెరుపునిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.