నాట్యం చేస్తూ... మట్టికి రూపమిస్తూ...

సాధారణంగా శాస్త్రీయ నృత్య ప్రదర్శనలంటే ఏం గుర్తొస్తాయి? తగ్గ వస్త్రధారణ, వేదికపై తాళానికి తగ్గట్టుగా చేసే అభినయం అవునా! మట్టి వస్తువులను అందంగా తీర్చిదిద్దడం కూడా అభినయమే అంటారు విద్యా తిరునారాయణ్‌. అందుకే ఈ రెంటినీ కలిపి ప్రత్యేక నృత్యరూపకంగా తీర్చిదిద్దారీమె.

Updated : 24 Jan 2024 07:16 IST

సాధారణంగా శాస్త్రీయ నృత్య ప్రదర్శనలంటే ఏం గుర్తొస్తాయి? తగ్గ వస్త్రధారణ, వేదికపై తాళానికి తగ్గట్టుగా చేసే అభినయం అవునా! మట్టి వస్తువులను అందంగా తీర్చిదిద్దడం కూడా అభినయమే అంటారు విద్యా తిరునారాయణ్‌. అందుకే ఈ రెంటినీ కలిపి ప్రత్యేక నృత్యరూపకంగా తీర్చిదిద్దారీమె. అదెలాగో తెలుసుకుందాం రండి.

ఊహ తెలిసినప్పటి నుంచీ విద్యకి నృత్యమే లోకం. భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించిన ఆమె దాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నారు. చెన్నైకి చెందిన విద్య, మద్రాస్‌ యూనివర్సిటీ నుంచి బీఏ ఎకనామిక్స్‌, ఫైన్‌ఆర్ట్స్‌లో పీజీ డిప్లొమాతోపాటు లండన్‌ యూనివర్సిటీ నుంచి కల్చరల్‌ పాలసీ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంఏ చేశారు. 1994లో సంకల్పం పేరుతో అంతర్జాతీయ టూరింగ్‌ డ్యాన్స్‌ని ప్రారంభించారు. విదేశాల్లో ప్రదర్శనలతోపాటు కొన్ని నృత్యరూపకాలకు కొరియోగ్రఫీ కూడా చేశారు. ఆర్ట్స్‌ కౌన్సిల్‌ ఇంగ్లాండ్‌ సహా పలు ప్రతిష్ఠాత్మక సంస్థలతో కలిసి పనిచేశారు. ఫండింగ్‌లనీ అందుకున్నారు. పాతికేళ్ల నృత్య ప్రయాణం. ప్రపంచమంతా పర్యటించారు. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆసక్తి ఉన్నవారికి శిక్షణనీ ఇచ్చారు. ఇన్నేళ్లలో విశ్రాంతి అన్న మాటే ఎరుగరు. అప్పుడే ఈ ప్రయాణం నుంచి కొంత విరామం కావాలి అనిపించిందామెకు. కొత్తగా ఏదైనా ప్రయత్నించాలి అనుకుంటున్న ఆమెను పాటరీ ఆకర్షించింది.

శిక్షణనీ తీసుకున్నారు.
‘మట్టికే మాట వస్తే ఏం చెబుతుంది? పూర్వకాలంలో మహిళల పరిస్థితుల్నా.. నేటి తరం ఆశయాలనా అన్న ఆలోచన వచ్చింది. నృత్యం, పాటరీ.. ఎన్ని దశాబ్దాల నాటి కళలు. ఎన్ని తరాలను చూసుంటాయి. నృత్యంలోనే కాదు.. మట్టి కోరిన రూపంలోకి రావాలన్నా అభినయానిదే ప్రధాన పాత్ర. పైగా రెండిట్లో ఏది చేస్తున్నా మనసుకి తెలియని ప్రశాంతత. ఇది గ్రహించాక ఈ రెంటినీ కలపాలన్న ఆలోచన వచ్చింది’ అంటారీమె. రెండేళ్లు దీనిపై పరిశోధన చేశారు విద్య. ప్రపంచవ్యాప్తంగా భిన్నరకాల డ్యాన్సర్లను కలిసి ప్రయోగాలెన్నో చేశారు. అంతా సిద్ధమయ్యేనాటికి కొవిడ్‌. అయినా ఆన్‌లైన్‌ ప్రదర్శనలతో గుర్తింపు తెచ్చుకున్నారు. శాస్త్రీయ నృత్యాన్ని వేదికపై చేస్తారు కదా.. ఈవిడ మాత్రం ఇనుప తెరలాంటిది ఏర్పాటు చేసుకొని దాని మధ్యలో ఓవైపు నృత్యం చేస్తూనే మట్టిని కలపడం దగ్గర్నుంచి.. పాత్ర రూపకల్పన పూర్తిచేస్తారు. ఈ నృత్యరీతికి ‘లైవ్స్‌ ఆఫ్‌ క్లే’ అని పేరు పెట్టారు. అలా రూపొందించిన పాత్రలని డ్యాన్సింగ్‌ పాట్స్‌ పేరుతో ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు కూడా. వివిధ సంస్థలు, ఆర్ట్‌ థియేటర్లతో కలిసి దేశవిదేశాల్లో ప్రదర్శనలిస్తున్న విద్య... క్లే డ్యాన్స్‌కీ ఆదరణ ఎక్కువే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్