క్యాన్సర్‌ నుంచి కోలుకునేలా చేసిందనే...

ఇంట్లో ఇద్దరు క్యాన్సర్‌ బాధితులు. వాళ్లకి ధైర్యం చెబుతూ, బలమైన ఆహారం అందించే క్రమంలో చిరుధాన్యాల శక్తి గురించి చాలా విషయాలే తెలుసుకున్నారు బెల్లంకొండ సుప్రియ. తనుపడ్డ బాధ మరొకరు పడకూడదని ఫ్యాక్టరీ స్థాపించి... రెస్టరంట్లకి  చిరుధాన్యాలతో చేసిన దోశ, ఇడ్లీ పిండిని పెద్ద ఎత్తున సరఫరా చేస్తూ లాభాలబాట పట్టారు.

Updated : 24 Jan 2024 02:41 IST

ఇంట్లో ఇద్దరు క్యాన్సర్‌ బాధితులు. వాళ్లకి ధైర్యం చెబుతూ, బలమైన ఆహారం అందించే క్రమంలో చిరుధాన్యాల శక్తి గురించి చాలా విషయాలే తెలుసుకున్నారు బెల్లంకొండ సుప్రియ. తనుపడ్డ బాధ మరొకరు పడకూడదని ఫ్యాక్టరీ స్థాపించి... రెస్టరంట్లకి  చిరుధాన్యాలతో చేసిన దోశ, ఇడ్లీ పిండిని పెద్ద ఎత్తున సరఫరా చేస్తూ లాభాలబాట పట్టారు. ఆ విశేషాలని మనతో పంచుకున్నారిలా...

ఇంట్లో ఒకరికి అనారోగ్యం అంటేనే తట్టుకోవడం కష్టం. అలాంటిది మా ఇంట్లో అమ్మ, మామగారు ఇద్దరికీ క్యాన్సర్‌. ఇక మా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఈ పరిస్థితుల నుంచి మాకు ఊరటనిచ్చినవి చిరుధాన్యాలే. మాది విశాఖపట్నం. అమ్మ నాగవల్లి, నాన్న నారాయణమూర్తి బీహెచ్‌ఈఎల్‌లో పనిచేసి రిటైర్‌ అయ్యారు. బీటెక్‌ మెకానికల్‌ చదివి ఇన్ఫోటెక్‌లో రెండేళ్లు పనిచేశా. మావారు అంజనీ  కుమార్‌ ఐటీ ఉద్యోగి. పెళ్లి తర్వాత జెనీవా వెళ్లిపోయాం. అంతా బాగానే ఉంది అనుకొనే సమయానికి... మామగారికి క్యాన్సర్‌ అని తెలిసింది. ఇండియా వచ్చేశాం. ఆయనకి చికిత్స అందిస్తున్నప్పుడే, అమ్మకీ రొమ్ముక్యాన్సర్‌ అని తెలిసింది. మాఇద్దరికీ ఏం చేయాలో పాలుపోలేదు. వాళ్లకి ఏ చెడు అలవాట్లూ లేవు. ఆరోగ్యంపట్ల శ్రద్ధ ఉంది. మరి ఎందుకిలా? సమాధానం లేదు. డాక్టర్లు రసాయనాల్లేని ఆహారమే ఇవ్వమన్నారు. అప్పుడు మొదలైంది. స్వచ్ఛమైన ఆహారం కోసం మా వెతుకులాట. ఆ క్రమంలోనే చిరుధాన్యాలపై పనిచేస్తున్న ఖాదర్‌వలీ వీడియోలు దొరికాయి. క్యాన్సర్‌ బాధితులకు ఆయన సూచించే డైట్‌తో ప్రయోజనం ఉంటుందనిపించింది. దాంతో ఇంట్లో వాళ్లకి వాటినే ఓపిగ్గా వండి పెట్టేదాన్ని. కొన్నాళ్లకి ఇద్దరికీ చికిత్స గుణం కనిపించింది. వాళ్లు కోలుకోవడానికి మిల్లెట్స్‌ సహకరించాయని నమ్మా. ఐదేళ్లవుతోంది, వాళ్లు ఆరోగ్యంగా ఉన్నారు. నేను కాస్త తెరిపినపడ్డాక... నాకు తెలిసినవారంతా ఏం తింటున్నారో దృష్టి పెట్టా. ఆకలంటే పిల్లలకి బేకరీ ఆహారమో, ఫాస్ట్‌ఫుడ్‌నో ఇవ్వడం బాధనిపించింది. ఆ తీరు మార్చాలనుకున్నా. అందుకే 2019లో హైదరాబాద్‌లో మిల్లెట్స్‌తో చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టాం. ఇంతలో కొవిడ్‌...!

కొవిడ్‌ చేసిన సాయం...

ముందుగా స్ట్రీట్‌ఫుడ్‌ తయారీదారుల్లో మార్పు తీసుకురావాలనుకున్నా. మైదాకి బదులుగా మిల్లెట్స్‌ ప్రత్యామ్నాయం గురించి చెప్పా. ఒక్కరూ వినలేదు. ఒప్పించడం కష్టమైంది. ఆశలు వదలుకుంటున్న సమయంలో కొవిడ్‌ మాకు వరమైంది. ఎందుకంటే అందరూ వ్యాధినిరోధకశక్తిపై దృష్టిపెట్టారు. నావంతుగా ఒక షాప్‌ పెట్టి మిల్లెట్స్‌తో గుంటపొంగనాలు, దోసె, ఇడ్లీలు వేసిచ్చేదాన్ని. నా ప్రయత్నం విజయవంతమై, చాలామంది ఇవి తినడానికి ఆసక్తి చూపించారు. ఆ ఉత్సాహంతోనే స్ట్రీట్‌ఫుడ్‌ దుకాణాలకీ, రెస్టరంట్లకీ దోసె, ఇడ్లీ పిండిని అందిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేశా. ఎవరి భాగస్వామ్యంతో అయినా చేద్దాం అంటే ఒక్కరూ ముందుకు రాలేదు. చివరికి నేనూ, మావారు కలిసి... 2021లో నిజాంపేట్‌లో బ్యాంకు రుణంతో ఫ్యాక్టరీని మొదలుపెట్టాం. పాలిష్‌ పట్టని అరికెలు, సామలు, కొర్రలు, రాగులతో చేసిన ఇడ్లీ, దోసెపిండిని తయారు చేసేదాన్ని. రుచీ, నాణ్యత బాగుండటంతో.. ఆర్డర్లు పెరిగాయి. ఇంట్లో పిల్లలు ఆకలి అంటే జంక్‌ఫుడ్‌ వైపు చూడకుండా ఫ్రిజ్‌లో మిల్లెట్‌ బేటర్‌ రెడీగా ఉండాలన్నది నా కల. ప్రస్తుతం రోజుకి 500 కేజీల పిండిని రెస్టరంట్లకి అందిస్తున్నాం. ఏడాదికి రూ. కోటి వ్యాపారం చేస్తున్నాం. అనంతపురం, తమిళనాడు, మహారాష్ట్ర రైతుల నుంచి వీటిని కొనుగోలు చేస్తున్నాం. ఓ రెస్టరంట్‌నీ ప్రారంభించాం. ఇదీ లాభాల బాటలోనే ఉంది. మావద్ద 130 మంది ఉపాధి పొందుతున్నారు. తీరిక చిక్కినప్పుడల్లా... చిరుధాన్యాల శక్తి గురించి ప్రచారం చేస్తున్నాం. ఎగ్జిబిషన్లలో ప్రదర్శనలూ ఇస్తున్నా. బస్టాండుల్లో మా కియోస్క్‌లను ఏర్పాటు చేసుకొనే అవకాశం దొరికింది. అలాగే అంగన్‌వాడీ కేంద్రాలకూ దోసె, ఇడ్లీ పిండిని అందించనున్నాం. నా కృషికి గుర్తింపుగా గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తమ వ్యాపారవేత్త అవార్డుని అందుకోవడం సంతోషంగా అనిపించింది.

దేవి పట్టపు, హైదరాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్