ఆ చిన్నారి కథ... ఆస్కార్‌కి వెళ్లింది!

మూడున్నరేళ్ల శ్రమ... చిత్రీకరణ సమయంలో చంపుతామనే బెదిరింపులు. ఇవన్నీ దాటి తను చెప్పాలనుకున్న కథ ‘టు కిల్‌ ఎ టైగర్‌’ను ప్రపంచం ముందుకు తీసుకొచ్చారు నిషా పహూజా!

Updated : 25 Jan 2024 06:47 IST

మూడున్నరేళ్ల శ్రమ... చిత్రీకరణ సమయంలో చంపుతామనే బెదిరింపులు. ఇవన్నీ దాటి తను చెప్పాలనుకున్న కథ ‘టు కిల్‌ ఎ టైగర్‌’ను ప్రపంచం ముందుకు తీసుకొచ్చారు నిషా పహూజా! ప్రశంసలతోపాటు అంతర్జాతీయ అవార్డులూ అందుకున్నారు. తాజాగా ఆస్కార్‌ నామినేషన్లలోకీ ఆ డాక్యుమెంటరీ దూసుకెళ్లింది. ఇంతకీ ఆమెవరంటే...

స్కూలు నుంచి ఆనందంగా రావాల్సిన 13 ఏళ్లమ్మాయి. ఒళ్లంతా గాయాలతో ఇంటికొచ్చి పడిపోయింది. భరించలేని బాధతో గిలగిల్లాడుతున్న బిడ్డని చూసి ఏ తండ్రి మాత్రం తట్టుకోగలడు? తన చిట్టితల్లిపై ముగ్గురు మృగాళ్లు దాడి చేశారని తెలిస్తే గుండె మెలిపెట్టేయదూ? కానీ బాధ ఉన్నా, బయటికి తెలిస్తే అమ్మాయికి పెళ్లవదు, ఇంటి పరువు పోతుందని కిమ్మనకుండా ఉండిపోయేవారే ఎక్కువ. ఆ నాన్న మాత్రం పోరాడాడు. పల్లె అంతా ఎదురుతిరిగినా... ప్రాణాలు పోయే పరిస్థితి ఎదురైనా కూతురికి అన్యాయం చేసిన వారిని కటకటాల వెనక్కి నెట్టాడు. ఝార్ఖండ్‌లోని మారుమూల పల్లెలో చోటుచేసుకున్న ఈ కథను తెరకెక్కించి ‘ఆస్కార్‌’ బరిలో నిలిపారు నిషా పహూజా.

‘ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు చాలావరకూ మనమేం చేస్తాం? తప్పించుకొని వెళతాం. అదీ కుదరనప్పుడు? అందుకే ఎలా తప్పుకోవాలా అని కాదు, మార్పునకు ప్రయత్నించాలి’ అంటారు నిషా. దిల్లీకి చెందిన ఈమె తన చిన్నతనంలోనే కెనడాకి వలస వెళ్లారు. మారిన సంస్కృతి, జీవన విధానానికి తోడు అడపాదడపా ఎదురయ్యే చిన్నచూపు, హేళన ఒకానొక దశలో తనను ఉక్కిరిబిక్కిరి చేసినా, పరిస్థితులకు ఎదురెళ్లడం అలవాటుగా చేసుకున్నారామె. యూనివర్సిటీ ఆఫ్‌ టొరంటోలో ఇంగ్లిష్‌ లిటరేచర్‌ చదువుతున్న సమయంలో అక్కడి ప్రొఫెసర్‌ బోధనకు ఆకర్షితురాలయ్యారు నిషా. రచయిత్రి కావాలని కలలుగన్నారు. కానీ అక్కడి స్థానిక ప్రొడ్యూసర్‌ గీతా సోందీతో పరిచయం ఆవిడ మార్గాన్నే మార్చేసింది. గీత డాక్యుమెంటరీ కోసం ఒక రిసెర్చర్‌ అవసరమవ్వడంతో ఆ బాధ్యత నిషా తీసుకున్నారు. అలా డాక్యుమెంటరీ ఫిల్మింగ్‌లోకి అడుగుపెట్టారు. కొన్నాళ్లకు సొంతంగా తనే చిత్రీకరించే స్థాయికి చేరుకున్నారు. ‘బాలీవుడ్‌ బౌండ్‌’, ‘డైమండ్‌ రోడ్‌’, ‘ద వరల్డ్‌ బిఫోర్‌ హర్‌’... తను చిత్రీకరించిన ప్రతి డాక్యుమెంటరీ ఆమెకు గుర్తింపు, అంతర్జాతీయ అవార్డులను అందించినవే. తాజాగా ‘టు కిల్‌ ఎ టైగర్‌’ ఆస్కార్‌ నామినేషన్‌ కంటే ముందు టిఫ్‌, పామ్‌ స్ప్రింగ్స్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, ద కెనడియన్‌ స్క్రీన్‌ అవార్డ్స్‌ సహా 19 పురస్కారాలు అందుకుంది. న్యూయార్క్‌ టైమ్స్‌లో ‘మోస్ట్‌ యాంటిసిపేటెడ్‌ ఫాల్‌ రిలీజెస్‌’ జాబితాలోనూ చోటు దక్కించుకుంది.

అదే వెతుక్కుంటూ వచ్చింది

జానికి ‘లింగ సమానత్వం’పై పనిచేస్తోన్న ఓ ఎన్‌జీఓ కథను తెరకెక్కించాలనుకున్న నిషాకు అక్కడే బాధితురాలి తండ్రి ‘రంజిత్‌’తో పరిచయమైంది. అలా ఆమె దారి మళ్లింది. డాక్యుమెంటరీ నిడివి గంటన్నరే! కానీ దీనికోసం నిషా మూడున్నరేళ్లు కష్టపడ్డారు. ఊరి పరువు తీస్తున్నారంటూ స్థానికులు ఆమెపై దాడికీ ప్రయత్నించారు. ఇవేమీ నిషా మనసు మళ్లించలేకపోయాయి. ‘చిన్నమ్మాయిపై లైంగిక దాడి తప్పు కదా అంటే... చాలామంది ‘ఎవరో ఒకరికిచ్చి పెళ్లి చేస్తే సరిపోతుంది కదా. వాళ్లకి శిక్ష పడితే మీకేం వస్తుంది’ అనేవారు. పైగా బాధితురాలినే వేలెత్తి చూపేవారు. దేశంలో ప్రతి 20 నిమిషాలకో బలాత్కారం కేసు నమోదవుతోంది. బయటికొచ్చేదీ 30 శాతమే. భారత్‌లోనే కాదు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ ఇదే పరిస్థితి. రంజిత్‌ లాంటి వాళ్ల గురించి పరిచయం చేస్తేనే ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయగలం అనుకున్నా. డాక్యుమెంటరీ పూర్తయ్యాక ఊళ్లో వాళ్లందరికీ చూపించా. అది చూశాక ‘మా ప్రవర్తన తప్పే’ అన్నారు. అది విన్నాక మా కృషి ఫలించింది అనిపించింది’ అంటోన్న నిషా ఆస్కార్‌ నామినేషన్‌ని ఊహించలేదట. దీని ద్వారా కొందరిలోనైనా మార్పు వస్తే చాలంటోన్న ఆమె ఆశ నెరవేరాలని కోరుకుందామా?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్