తల్లుల బాధ చూడలేక... ఆ పనిచేశా!

ఆమె పనిష్మెంట్‌కి ఎంత ప్రాధాన్యత ఇస్తారో, పరివర్తనకీ అంతే విలువనిస్తారు! ఆమె పేరుచెబితే నేరస్తుల గుండెల్లో రైళ్లు పరుగుబెట్టే మాట ఎంత నిజమో... మారిన వారి జీవితాల్లో వెలుగులు నిండిన మాటా అంతే వాస్తవం. ఒడిశా నుంచి తొలి మహిళా ఐపీఎస్‌గా మొదలైన సౌమ్యా మిశ్రా ప్రయాణం... తెలంగాణ జైళ్లశాఖకు తొలి డైరెక్టర్‌ జనరల్‌గా మారేంతవరకూ వచ్చింది.

Updated : 28 Jan 2024 08:10 IST

ఆమె పనిష్మెంట్‌కి ఎంత ప్రాధాన్యత ఇస్తారో, పరివర్తనకీ అంతే విలువనిస్తారు! ఆమె పేరుచెబితే నేరస్తుల గుండెల్లో రైళ్లు పరుగుబెట్టే మాట ఎంత నిజమో... మారిన వారి జీవితాల్లో వెలుగులు నిండిన మాటా అంతే వాస్తవం. ఒడిశా నుంచి తొలి మహిళా ఐపీఎస్‌గా మొదలైన సౌమ్యా మిశ్రా ప్రయాణం... తెలంగాణ జైళ్లశాఖకు తొలి డైరెక్టర్‌ జనరల్‌గా మారేంతవరకూ వచ్చింది. తాజాగా కేంద్ర హోంశాఖ ప్రకటించిన రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం అందుకోనున్న సందర్భంగా ఆమె తన అనుభవాలను వసుంధరతో పంచుకున్నారు...

మాది ఒడిశాలోని కటక్‌. నాన్న లెక్చరర్‌గా పనిచేసేవారు. పెద్దగా ఆస్తులేమీ సంపాదించలేదు కానీ మమ్మల్ని బాగా చదివించారు. నేనూ, అక్క తదాషా చిన్నప్పట్నుంచీ చదువులో చురుగ్గా ఉండేవాళ్లం. ఎన్నో గోల్డ్‌మెడల్స్‌ సాధించాం. నేను ఎమ్మెస్సీ అయ్యాక జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌కు ఎంపికయ్యా. ఉత్కళ్‌ యూనివర్సిటీలో సోషియాలజీలో పీహెచ్‌డీ చేశా. కానీ సివిల్స్‌కి సిద్ధమయ్యిందీ, ప్రజల కోసం పనిచేయాలన్న ఆలోచన మొలకెత్తిందీ వరంగల్‌లోనే. ఎందుకంటే మావారు దేవబ్రతకంఠ అక్కడ జాయింట్‌ కలె క్టర్‌గా పనిచేసేవారు. ఏ కోచింగ్‌ లేకుండా... ప్రభుత్వం ఇచ్చిన క్వార్టర్స్‌లోనే ఉంటూ సివిల్స్‌కి ప్రిపేరయ్యా. ఇంటర్వ్యూ కోసమని వెళ్తుంటే.. మావారి గన్‌మేన్‌ ఒకరు ఎదురొచ్చి ‘అమ్మా... మీరు ఐపీఎస్‌ అయి ఎస్పీగా ఈ జిల్లాకే రావాలి’ అన్నాడు. అదేంటి నేను ఐఏఎస్‌ అవ్వాలనుకున్నా. అమ్మాయిలకు ఐపీఎస్‌ నప్పుతుందా అని ఆలోచించా. గతంలో ఒకసారి మా ఇంటికి ఐపీఎస్‌ అనురాధా మేడమ్‌ యూనిఫామ్‌లో వచ్చారు. బహుశా ఆ యూనిఫామ్‌ కూడా నాలో పోలీస్‌ అవ్వాలన్న స్ఫూర్తిని రగిలించి ఉండొచ్చు. 1994లో అక్కా, నేనూ ఇద్దరం ఒకేసారి ఐపీఎస్‌లుగా ఎంపికయ్యాం. అది కూడా ఒడిశా రాష్ట్రం నుంచి తొలిసారి. ఒక ఇంట్లోంచి ఇద్దరు అమ్మాయిలు ఈ విజయం సాధించడం అరుదు కదా! దాంతో అంతవరకూ నిరుత్సాహపరిచిన వారే ప్రశంసలతో ముంచెత్తారు. నేను ఏపీ క్యాడర్‌ ఎంచుకుంటే.. అక్క ఝార్ఖండ్‌ కేడర్‌ను ఎంచుకుంది.

ఆడవాళ్ల కష్టాలు విని..

మొదట్లో పెద్ద ఆశయాలతో ఈ వృత్తిలోకి అడుగు పెట్టలేదు. కానీ ప్రజలకు పోలీసుల అవసరం ఎంత ఉందో నాకు పరిస్థితులే తెలియచెప్పాయి. హైదరాబాద్‌లోని నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో ట్రెయినింగ్‌లో రాజేంద్రనగర్‌ ఎస్సైగా పనిచేశా. అప్పట్లో పోలీస్‌శాఖలో ఆడవాళ్లు తక్కువ. ఠాణాల్లో సరైన వాష్‌రూమ్‌ సదుపాయమూ ఉండేది కాదు. ఇక, మా పోలీస్‌స్టేషన్‌కొచ్చే మహిళల ఇబ్బందులపై దృష్టిపెడితే... చాలామంది తమపై జరుగుతున్న హింస గురించి ఫిర్యాదు చేసినా... భర్తపై కేసు పెట్టకుండా కౌన్సెలింగ్‌ చేసి మార్చమనేవారు. లేదంటే బెదిరించి వదిలేయమనేవారు. నేను సోషియాలజీ స్టూడెంట్‌ని కావడంతో కేవలం పోలీసింగ్‌కే పరిమితం కాకుండా గృహహింస బాధితుల కుటుంబాల్లోని సమస్యల్ని చక్కదిద్దేందుకు నాన్‌ఫార్మల్‌ పోలీసింగ్‌ అవసరం ఉందనిపించింది. ఇదే అంశంపై అకాడమీకి తిరిగి వెళ్లాక ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ ప్రెజెంట్‌ చేశా.

నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో...

నేను ఐపీఎస్‌గా విధుల్లోకి చేరిన తొలినాళ్లలో నక్సల్స్‌ ప్రభావం ఎక్కువగా ఉండేది. కాకతాళీయంగా... ఆ గన్‌మేన్‌ కోరినట్టు వరంగల్‌కే ఎస్పీగా వెళ్లా. అక్కడ ఎన్నో ఎన్‌కౌంటర్లు. మరోపక్క బిడ్డల్ని కోల్పోయిన తల్లుల కన్నీళ్లతో నేనూ ఆవేదన చెందా. అప్పుడే అజ్ఞాతంలో ఉన్న నక్సల్స్‌ లొంగిపోయేలా చేసి, వారిని కుటుంబాల చెంతకు చేర్చాలనే ఆలోచనతో దిద్దుబాటు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇందుకోసం ప్రత్యేకంగా పోలీస్‌ బృందాలను ఏర్పాటు చేశా. నక్సల్స్‌ ఇళ్లకు వెళ్లి కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్‌ చేయడం వారి పని. కరీంనగర్‌, విజయనగరం జిల్లాలోనూ ఇదే అనుభవం. ఫలితంగా 110 మంది సాయుధులు జనజీవన స్రవంతిలో కలవడం సంతృప్తినిచ్చింది. సొంత రాష్ట్రంలో పనిచేసే అవకాశం రావడంతో మూడేళ్లపాటు ఒడిశాలో ఫైర్‌ సర్వీసెస్‌ అండ్‌ హోంగార్డ్‌ల విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేశా. ఇప్పుడిక మీకు తెలిసిందే... తెలంగాణ జైళ్లశాఖకు తొలి డైరెక్టర్‌ జనరల్‌గా కొద్దిరోజుల క్రితమే బాధ్యతలు తీసుకున్నా. మహిళా ఖైదీల సంక్షేమంపై దృష్టి సారించా. కారాగారం నుంచి బయటికి వెళ్లిన తర్వాత వాళ్లు సొంతకాళ్లపై నిలబడేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వాలన్నదే నా లక్ష్యం. అందుకోసం నైపుణ్యాలు అందివ్వనున్నాం. ఒక మహిళ కష్టాన్ని మరో మహిళ మాత్రమే అర్థం చేసుకోగలదు. ఎన్నో కష్టాలతో పోలీస్‌ స్టేషన్‌ గడప ఎక్కినవారిని అర్థం చేసుకోవాలంటే మహిళా పోలీసులు ఉండాలి. అందుకే యువతులు పోలీస్‌శాఖ వైపు అడుగులేయాలి.

మల్యాల సత్యం, హైదరాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్