అతిపెద్ద మహిళల మార్కెట్‌!

ఇమా కైతల్‌... ప్రపంచంలోనే అతిపెద్ద మహిళల మార్కెట్‌! మైతేయి భాషలో ఇమా కైతల్‌ అంటే... ‘అమ్మల మార్కెట్‌’. ఇంఫాల్‌లోనే అత్యంత రద్దీగా ఉండే మార్కెట్‌ ఇది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ అమ్మేవారికి ఊపిరిసలపనంత బిజీ ప్రదేశమిది.

Updated : 16 Mar 2024 15:15 IST

నారీ శక్తి

ఇమా కైతల్‌... ప్రపంచంలోనే అతిపెద్ద మహిళల మార్కెట్‌! మైతేయి భాషలో ఇమా కైతల్‌ అంటే... ‘అమ్మల మార్కెట్‌’. ఇంఫాల్‌లోనే అత్యంత రద్దీగా ఉండే మార్కెట్‌ ఇది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ అమ్మేవారికి ఊపిరిసలపనంత బిజీ ప్రదేశమిది. మొత్తం మూడు అతిపెద్ద మల్టీ స్టోరీ భవనాల్లో 5వేలకు పైగా దుకాణాలతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. దుకాణదారులందరూ మహిళలే అవడం ఇక్కడి ప్రత్యేకత. మగవారూ ఇక్కడికి రావొచ్చు...కానీ అమ్మడానికి కాదు, సరకులు కొనడానికీ, ఛాయ్‌ అందించడానికీ లేదా సెక్యూరిటీ గార్డ్స్‌గా మాత్రమే. అయితే ఇక్కడి సంప్రదాయం ప్రకారం...పెళ్లయిన మహిళలకు మాత్రమే దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. వాళ్లనూ, రిటైర్‌ అవబోతోన్న మరో మహిళ నామినేట్‌ చేయాల్సి ఉంటుంది. అందుకు సాధారణంగా సోదరి, కూతురు, కోడలు...వంటి కుటుంబ సభ్యులను వాళ్లు ఎంచుకుంటారు.

ఎలా ఏర్పడిందంటే...

16శతాబ్దంలో కంగ్లీపక్‌ సామ్రాజ్యంలో ఇది బహిరంగ మార్కెట్‌లా ఉండేది. అయితే, 1533లో పొరుగుదేశాలతో యుద్ధం కారణంగా, రాజ్యాన్ని రక్షించుకోవడం కోసం మణిపుర్‌లోని మగవారందరికీ సైనిక శిక్షణను తప్పనిసరి చేశారు. దాంతో నగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆడవారిపైనే పడింది. అప్పుడే కూరగాయలు, చేపలు... ఇలా రకరకాల ఉత్పత్తులను వీరే అమ్మేవారు. అలా ఆ మార్కెట్‌ అనతి కాలంలోనే ఆ ప్రాంత ఎకనామిక్‌ హబ్‌గా మారింది. సామాజికంగా, రాజకీయంగానూ ఇమా కైతల్‌ మహిళలు మరింత ప్రభావవంతంగా మారారు. 500 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఇది... ప్రపంచంలోనే అతిపెద్ద మహిళల మార్కెట్‌!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్