ఆ పిల్లల కోసమే... ‘సంప్రదాయం’

ప్రయోగాలు చేయాలంటే ధైర్యం ఉండాలి. అలాంటి గుండె ధైర్యం నిండుగా ఉన్న కళాకారిణి స్వాతి సోమనాథ్‌. కూచిపూడి నృత్యశైలిలో కామసూత్రను ప్రదర్శించి ‘రాడికల్‌’ అనిపించుకున్నా వెనక్కి తగ్గలేదు. పైగా మరెన్నో ప్రయోగాలకూ తెర తీశారామె.

Published : 15 Mar 2024 14:25 IST

ప్రయోగాలు చేయాలంటే ధైర్యం ఉండాలి. అలాంటి గుండె ధైర్యం నిండుగా ఉన్న కళాకారిణి స్వాతి సోమనాథ్‌. కూచిపూడి నృత్యశైలిలో కామసూత్రను ప్రదర్శించి ‘రాడికల్‌’ అనిపించుకున్నా వెనక్కి తగ్గలేదు. పైగా మరెన్నో ప్రయోగాలకూ తెర తీశారామె. ప్రస్తుతం తెలుగువారి కూచిపూడి పేద, గిరిజన విద్యార్థులకీ చేరువకావాలని శ్రీకాకుళంలో ‘సంప్రదాయం’ గురుకులాన్ని నిర్వహిస్తున్నారు...  

శాంతినికేతన్‌, కళాక్షేత్రాల స్థాయిలో ‘సంప్రదాయం’ని తీర్చిదిద్దాలనుకుంటున్న స్వాతి పుట్టి, పెరిగిందంతా హైదరాబాద్‌లోనే అయినా స్వస్థలం శ్రీకాకుళం. తండ్రి దూసి సోమనాథరావు, తల్లి లక్ష్మి. సాహిత్యంపై ఉన్న ప్రేమతో కూతుర్ని వెంటపెట్టుకుని సోమనాథ్‌ కళా ప్రదర్శనలకు, సాహిత్య సభలకూ తీసుకెళ్లేవారు. ‘అలా ఎల్‌బీ స్టేడియంలో జరుగుతున్న మొదటి ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరయ్యా. అక్కడే యామిని కృష్ణమూర్తి నాట్య ప్రదర్శన చూసి కూచిపూడిని ప్రేమించా. ఇంటికొచ్చి అమ్మానాన్నలని ఒప్పించి భాగవతుల రామకోటయ్యగారి వద్ద నాట్యం నేర్చుకున్నా. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్‌ లిటరేచర్‌, సెంట్రల్‌ యూనివర్సిటీ నుంచి కూచిపూడిలో మాస్టర్‌ డిగ్రీ పూర్తిచేశా. మావారు చావలి రవికుమార్‌ సినిమా దర్శకుడు. ఆయన ప్రోత్సాహంతోనే హైదరాబాద్‌లో నృత్య భారతి స్కూలు స్థాపించి 20 ఏళ్లు సేవలందించా’ననే స్వాతి నాట్యంలో అనేక ప్రయోగాలు చేశారు.

కూచిపూడి నృత్యశైలిలో కామసూత్రను ప్రదర్శించిన నర్తకిగా అందరి దృష్టినీ ఆకర్షించారు స్వాతి. ఆ తరవాత జగద్గురు ఆదిశంకరుల జీవితం ఆధారంగా కూచిపూడి డ్యాన్స్‌ బ్యాలెను రూపొందించారు. మానసిక వికలాంగులైన పిల్లలకు కూచిపూడి నేర్పించి దిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద ప్రదర్శించారు. టిబెట్‌లోని మానససరోవరంలో గడ్డకట్టే చలిలో ప్రదర్శన ఇచ్చి నాట్యంపై తన ప్రేమని చాటుకున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలోని ‘సంప్రదాయం’ కూచిపూడి గురుకుల కళాక్షేత్రానికి డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పేద, గిరిజన విద్యార్థులకు స్వయంగా నాట్యం నేర్పిస్తున్నారు. ఇక్కడ హాస్టల్‌ సదుపాయం కూడా ఉంది. పదోతరగతి చదివిన వారూ చేరేందుకు అర్హులు. ఇక్కడ విద్య నేర్చుకున్న వారికి ఉపాధి అవకాశాలూ బాగుండటంతో కొత్త వారూ ఆసక్తి చూపిస్తున్నారు. ‘మన తెలుగు వారి నాట్యం కూచిపూడి. కానీ ఏపీలో ఏ ఒక్క విశ్వవిద్యాలయంలోనూ ఈ కోర్సు అందించకపోవడం బాధాకరం. పూర్వం మారుమూల ఊళ్లో ఉత్సవాలు జరిగినా కూచిపూడి నాట్యం తన వైభవాన్ని చాటేది. ఇప్పుడా పరిస్థితి లేదు. కడుపునింపలేని ఈ కళలెందుకు అని తల్లిదండ్రులు అనుకుంటున్నారు కానీ... ఈ కళలు మనల్ని ఆర్థికంగానూ ఆదుకుంటాయి. ఇంటిపట్టునే కూర్చున్నా చక్కని సంపాదన ఉంటుంది’ అనే స్వాతి కొన్ని కార్యక్రమాలకు యాంకర్‌గా పనిచేసి, ఆ వచ్చిన డబ్బుతో పేదలకు అండగా ఉంటున్నారు.

మహేష్‌ వెల్లంకి, ఈటీవీ, శ్రీకాకుళం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్