మొక్కలు చనిపోతే ఏడ్చేశా..!

ఆమెకు మొక్కలంటే ప్రాణం. మూడు దశాబ్దాలుగా లక్షలకొద్దీ మొక్కలు నాటారీమె. ఎందుకంటే ముగ్గురికి ప్రాణవాయువును అందించగలిగే శక్తి ఓ మొక్కకు ఉంటుంది.

Updated : 18 Mar 2024 04:21 IST

ఆమెకు మొక్కలంటే ప్రాణం. మూడు దశాబ్దాలుగా లక్షలకొద్దీ మొక్కలు నాటారీమె. ఎందుకంటే ముగ్గురికి ప్రాణవాయువును అందించగలిగే శక్తి ఓ మొక్కకు ఉంటుంది. అదే మొక్క పర్యావరణ కాలుష్యాన్నీ... తరిమికొడుతుంది. అందుకే అడవిలా ఉన్న ప్రాంతాలను అందమైన పార్కులుగా మార్చుతున్నారు, మైదానంలా ఉండే చోట మొక్కలు నాటి పచ్చదనం నింపుతున్నారీ... 55 ఏళ్ల కందుల శారదావాణి. అంతేనా... ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ స్థలాలూ, ప్రముఖ విద్యాసంస్థల్లో అందమైన పార్కుల వెనుక ఈమె కృషి ఎంతో... ఈ సందర్భంగా ఆమెను వసుంధర పలకరించింది...

మాది మచిలీపట్నం.నాన్న పోతన బాబురావు రైతు. అమ్మ జయలక్ష్మి గృహిణి. ఏడుగురు పిల్లల్లో నేను మూడోదాన్ని. సమయం ఉన్నప్పుడల్లా నాన్న సమీపంలోని అటవీప్రాంతానికెళ్లి రకరకాల ఆకులు, వేర్లు తెచ్చేవారు. వాటితో అందరికీ వైద్యం చేసేవారు. దాంతో చిన్నప్పటి నుంచే మొక్కలు, వాటి ప్రయోజనాలు తెలుసుకున్నా. ఎక్కడికెళ్లినా అక్కడి నుంచి మొక్కలు తెచ్చి మా ఇంటి పెరట్లో పెంచేదాన్ని. మంచి సంబంధం అంటూ నాకు 15 ఏళ్లకే పెళ్లి చేసేశారు. మావారు కేవీడీ ప్రసాద్‌ విజయవాడలో పోలీసు. మాకిద్దరు పిల్లలు. ఆయన జీతం సరిపోయేది కాదు, దీంతో ఆర్థికంగా ఇబ్బందులెన్నో ఎదుర్కొన్నాం. పగలూ రాత్రి, దుస్తులు కుట్టడంతోపాటు గృహోపకరణాలూ తయారుచేసేదాన్ని. వాటిని విక్రయించి ఇంటి ఖర్చులు, పిల్లల చదువులకు సాయపడేదాన్ని. మొక్కలంటే ఇష్టంతో ఇంట్లో పూలు, కూరగాయలు, పండ్లు కూడా పండించేదాన్ని.

అలా జరిగింది...

మా అబ్బాయికి యాక్సిడెంట్‌ అయినప్పుడు రెండు నెలలపాటు సలజా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఉన్నాం. అక్కడి వైద్యులు నీకేదైనా ఉద్యోగం ఇస్తాం, చేరతావా అని అడిగారు. తెలిసిన పని కావడంతో గార్డెన్‌ బాగు చేసిస్తానని చెప్పా. ఒక్క నెలలో అక్కడి తోటను కళకళలాడేలా చేయడంతో నర్సరీ పెట్టుకోవడానికి చోటిచ్చి, ఆర్థిక సాయమూ... చేశారు. దాంతోపాటు తెలిసిన ఆసుపత్రులు, కళాశాలల్లో పార్కుల్ని డిజైన్‌ చేసే అవకాశం ఇచ్చారు. అలా నా జీవితం అనుకోని మలుపు తిరిగింది. ఏ కోర్సులూ చేయకుండానే పార్కుల డిజైనింగ్‌లో మంచి పేరు తెచ్చుకొన్నా. దాంతో పిల్లల చదువు కష్టం లేకుండా గడిచింది. విజయవాడలోని పార్కుల్ని చూసి నా గురించి తెలుసుకొని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాష్‌ పిలిపించారు. ప్రభుత్వ పార్కుల అభివృద్ధికి టెండర్‌ వేయడమెలాగో నేర్పించారు. అలా 2002 నుంచి గవర్నమెంట్‌కు సంబంధించి లాండ్‌స్కేపింగ్‌ పనులు మొదలుపెట్టా. ఆ తర్వాత కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పనిచేసే అవకాశాలను అందుకున్నా. అడవిలాంటి ప్రాంతాన్ని తీసుకొని అందమైన పార్కుగా మార్చేదాన్ని. దాదాపు 100కుపైగా ప్రాజెక్టులు చేశా. 30మందికిపైగా ఉపాధి కల్పించా. 15మంది కలెక్టర్ల దగ్గర పని చేశా. ముఖ్యమంత్రుల నుంచి ప్రశంసలూ అందుకున్నాను.

ఫౌండేషన్‌ పేరుతో...

ఎవరిని కలిసినా మొక్కలనే కానుకగా అందించడం నా అలవాటు. లయన్స్‌ క్లబ్‌ సభ్యురాలిగా చేరినప్పటి నుంచి ప్రతి కార్యక్రమంలోనూ అందరితో మొక్కలు నాటించేదాన్ని. అందరికీ మొక్కల పెంపకం అలవాటు చేసేదాన్ని. చాలామంది నా వద్ద నుంచి తీసుకెళ్లిన మొక్కలను సరిగ్గా సంరక్షించకపోవడంతో చనిపోయేవి. ఒకసారి విత్తనాలు వేసి పెంచిన లక్ష మొక్కలను క్లబ్‌లన్నింటికీ పంపిణీ చేస్తే వాటిలో చాలా వరకు చనిపోయాయని తెలిసి ఏడ్చేశా. అలా ఎవరికీ ఇవ్వకుండా నేనే సొంతంగా ఏదైనా చేయాలని, 2018లో ‘సేవ్‌ ద నేచర్‌ బై గ్రోయింగ్‌ ట్రీస్‌(ఎస్‌ఎన్‌జీ)’ ఫౌండేషన్‌ ప్రారంభించా. సంస్థ పేరుతో కొండపల్లిలో మొక్కలను నాటడం మొదలుపెట్టా. మొత్తం 30 ఏళ్లలో వేప, గానుగ, గుల్‌మొహర్‌ వంటివెన్నో లక్షన్నరకుపైగా నాటాను. వాటిలో కొన్ని మహావృక్షాలయ్యాయి. గతేడాది జులై 14న అరనిమిషంలో ఒకటిన్నర ఎకరంలో 1,850 మొక్కలు నాటి వండర్‌బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం దక్కించుకున్నా. దీనికి వేలమంది నాకు చేయూతనందించారు. మొక్కలను నాటిన ప్రతిసారీ వాటిని చుట్టుపక్కలవారికి దత్తత ఇచ్చి, పర్యవేక్షిస్తుంటా. దేశవ్యాప్తంగా ఎక్కడ పచ్చదనం లేదో అక్కడ మా ఫౌండేషన్‌ సేవలందించడం నా లక్ష్యం. రేపు నేను లేకపోయినా, తరతరాలకు ఇవి నీడనందించాలి. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలనేదే నా కల.


తొలి మహిళ

సురేఖాయాదవ్‌ది మహారాష్ట్రలోని సాతారా జిల్లా. ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తిచేసి, తొలి మహిళా లోకోపైలట్‌గా నియమితులయ్యారు. మొదటిసారి రైలుని నడిపి జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులని అందుకున్నారు. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ని నడిపి మరో రికార్డునీ సొంతం చేసుకున్నారీమె.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్