చిట్టి పిచ్చుక... చిరునామా ఎక్కడ?

చూరుల్లో దాక్కుంటూ, కొమ్మ అంచుల్లో వయ్యారంగా ఊగుతూ, పెరట్లో కీటకాలను తింటూ... కనిపించే ఆ చిట్టి పిచ్చుక మచ్చుకైనా కనిపించడం లేదు.

Updated : 20 Mar 2024 03:14 IST

చూరుల్లో దాక్కుంటూ, కొమ్మ అంచుల్లో వయ్యారంగా ఊగుతూ, పెరట్లో కీటకాలను తింటూ... కనిపించే ఆ చిట్టి పిచ్చుక మచ్చుకైనా కనిపించడం లేదు. ఇంటి చుట్టుపక్కలే కాదు, గడ్డివాములూ పంటచేల దగ్గరా జాడ లేదంటూ ఆ బుల్లిపిట్టల సంరక్షణ కోసం కృషి చేస్తున్నారు రజని వక్కలంక, సాధనా రాజకుమార్‌. ‘ప్రపంచ పిచ్చుకల దినోత్సవం’ సందర్భంగా వారిని ‘వసుంధర’ పలకరించింది. 


కాపాడాల్సిన బాధ్యత మనదే!

- రజని వక్కలంక

హైదరాబాద్‌లో గేటెడ్‌ కమ్యూనిటీలో ఉంటాం. మా కాలనీకి దూరంగా రకరకాల పక్షులు కనిపించేవి. వాటిని చూసేటప్పుడు  చిన్నప్పుడు కనిపించే ఊర పిచ్చుకలు గుర్తొచ్చేవి. మనతోపాటు ఇంట్లో కలిసి తిరిగే అవి ఏమయ్యాయా అనిపించేది. దాంతో మా పక్క పార్కులో వాటి కోసం వెతికేదాన్ని. తుమ్మచెట్టుపై అవి గూడు కట్టుకోవడం చూశా. గతంలో పొలాల్లో, ఇళ్లల్లో పిచ్చుకలకు ఆహారం దొరికేది. అప్పట్లో చేలకి మందుల వాడకం బాగా తక్కువ. దాంతో అక్కడి పురుగులు తిని ఆరోగ్యంగా ఉండేవి. కానీ రసాయనాలతో కూడిన సేద్యం పిచ్చుకలకు ప్రాణసంకటమైంది. విషపూరితమైన పురుగులను తినిపించడంతో పిల్ల పిచ్చుకలు రెక్కలు రాకముందే చనిపోతున్నాయి. ఇక, పెద్ద పిచ్చుకలు పెట్టే గుడ్లు పొదగకముందే పగిలిపోతున్నాయి. అదీగాక, భవనాలు పెరగడం, నీటి ఎద్దడి.. వల్లా వీటి సంఖ్య తగ్గిపోతోంది. అందుకే వాటికి ఆవాసం, ఆహారం అందించాల్సిన బాధ్యత మనదే అనిపించింది.  

పిచ్చుకల గురించి అవగాహన పెంచేందుకు ‘బర్డ్స్‌ ఇన్‌ అవర్‌ నైబర్‌హుడ్‌’ ప్రారంభించా. వృథా చెక్కను సేకరించి గూళ్లు తయారు చేయించి పార్కులు, రోడ్లలో ఎత్తైన చోట పెట్టించేదాన్ని. కొన్ని రోజుల్లోనే మా కాలనీలో పిచ్చుకల సందడి మొదలైంది. పిచ్చుక కనిపించగానే గూడు సిద్ధం చేయడం అలవాటైంది. ఇది తెలిసి చాలామంది గూడు కోసం ఫోన్‌ చేసేవారు.  ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా గూళ్లు పంపుతుంటా. పాఠశాలలు, కళాశాలలు, కార్పొరేట్‌ ఆఫీసుల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తుంటా. షూ బాక్సులు, ప్లాస్టిక్‌ డబ్బాలు, మట్టి కూజాలను పిచ్చుకలకు గూడుగా మార్చడం నేర్పిస్తుంటా. జూపార్కులోనూ ‘వేస్ట్‌ వుడ్‌ బ్యాంకు’ ఏర్పాటు చేసి వాటితో బాక్సులు చేయించా. పక్షుల కోసం మర్రి, రావి, వేప, జామ, రేగు చెట్లను నాటి ఫుడ్‌ ఫారెస్ట్‌నూ ఏర్పాటు చేశా. జీవావరణంలో చిట్టి పిచ్చుకలూ కీలకమే. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ బుల్లి పిచ్చుకలు మానవాళికి చేసే మేలెంతో మరి..!


పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా?!

-  సాధనా రాజకుమార్‌

చెెన్నై పెరంబూరులో వందేళ్ల క్రితం కట్టిన మా ఇంట్లో పిచ్చుకలకోసం చిన్న చిన్న గూళ్లు ఉండేవి. చిన్నప్పటినుంచీ వాటిని చూడటం వల్లేమో... పిచ్చుకల మీద ఇష్టం ఉండేది. బిజీ లైఫ్‌లో వాటి గురించి మర్చిపోయా. 2010లో అనుకుంటా... అమ్మ ‘ఈ మధ్య పిచ్చుకలెక్కడా కనిపించడం లేదు’ అనడం ఆలోచించేలా చేసింది.    

పాత తరాలన్నీ ప్రకృతితో కలిసి బతికితే మనం దానికి దూరమవుతున్నాం. ఆవరణ వ్యవస్థలో మనం ఒంటరిగా జీవించలేం. చిట్టి పిచ్చుకల నుంచి భారీ ఏనుగుల వరకూ అన్నీ ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. ఇక్కడ... చైనాలో జరిగిన ఓ సంగతి చెప్పాలి. మావో పాలనలో... పక్షులు, ముఖ్యంగా పిచ్చుకలు పంటల్ని తినేస్తున్నాయని వాటిని ఎలాగైనా అంతమొందించాలని ‘గ్రేట్‌ స్పారో క్యాంపెయిన్‌’ పేరుతో ప్రజలకు పిలుపునిచ్చారట. విషపూరిత మందులతో భీకర శబ్దాలతో రాళ్లతో వాటిని తరిమి తరిమి కొట్టారట. దాంతో కోట్లాది పిచ్చుకలు చనిపోయాయి. ఆ ప్రభావం తరవాత కనిపించింది. మిడతల సంఖ్య విపరీతంగా పెరిగింది. అవి పెనుతుపానులా పంటపొలాలపై విరుచుకుపడి మొత్తం తినేశాయి. దాంతో తీవ్రమైన కరవు ఏర్పడి కోట్లాదిమంది చనిపోయారు. సుమారు 4 నుంచి 7 కోట్ల మంది చనిపోయారని అంచనా. ఆ కరవు నుంచి దేశం కోలుకోవడానికి చాలాకాలం పట్టింది. చివరకు తప్పు తెలుసుకుని పొరుగు దేశాల నుంచి పిచ్చుకల్ని దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది చైనాకి. ఈ పరిస్థితి మనకూ ఎదురుకాదని చెప్పలేం. ఎందుకంటే పిచ్చుకలు పంటచేలల్లోని పురుగుల్నీ కీటకాల్నీ తింటాయి. దోమ లార్వాల్ని వాటి పిల్లలకు ఆహారంగా అందిస్తాయి. అవి తగ్గడం వల్లే దోమలూ తద్వారా వైరల్‌, డెంగ్యూ, మలేరియా జ్వరాలూ పెరిగాయి. అందుకైనా వాటిని మనం కాపాడుకోవాలి. పిచ్చుకలు మనిషికి దగ్గరగా ఉంటాయి. చెట్లమీదకన్నా ఇంటి వసారా చూరుల్లోనే కాపురముంటాయి. కానీ నేడు మనం కడుతున్న కాంక్రీటు భవనాల్లో వాటికి చోటే దొరకడం లేదు. చెరువులూ, జలాశయాల సంఖ్య తగ్గడంతో వాటి దాహార్తీ తీరడం లేదు. అందుకే పిచ్చుకలు కనిపించడం లేదు.
ఇవన్నీ ఆలోచించే... నా వంతుగా పక్షులకోసం రెండుమూడు చోట్ల ఎకరం స్థలం చొప్పున తీసుకొని సపోటా, మామిడి, జామ... వంటి 20 రకాల పండ్ల చెట్లను పెంచుతున్నా. ఇలా ప్రతిచోటా ఒక మినీ ఫారెస్ట్‌ ఉంటే మేలు. ఇక, ప్రత్యేకంగా పిచ్చుకల సంరక్షణ కోసం నెస్ట్‌లు తయారుచేయించి దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉచితంగా అందిస్తూ అవగాహన కలిగిస్తున్నా. దుబాయి, అమెరికా... వంటి దేశాలకూ ఈ గూళ్లను పంపుతున్నా. గుజరాత్‌లో ప్రతి ఇంటా ‘చాబుత్రో’ పేరుతో పక్షి ఆహారం కోసం ప్రత్యేక ఏర్పాటు చేసే సంప్రదాయం ఉంది. ఇలా అందరూ చేస్తే పిచ్చుకలను కాపాడుకోవచ్చు. చెక్క, మట్టి గూళ్లు మార్కెట్‌లో ఉంటున్నాయి. బియ్యం, వడ్లు, తృణధాన్యాలు... ఇలా ఏవైనా వాటికి ఆహారంగా వేయొచ్చు. దాహానికి నీరు నింపిన ఓ చిన్న గిన్నెను వాటికి కనిపించేలా బాల్కనీ లేదా వరండాలో ఉంచితే చాలు. బుల్లి పిచ్చుక కిచకిచలాడుతూ మన వాకిలి లేదా బాల్కనీని కళకళలాడేలా చేస్తుంది. దాంతో పర్యావరణమూ బాగుంటుంది... తద్వారా మనమూ ఆరోగ్యంగా ఉంటాం... ఏమంటారు?!


తొలి మహిళ

చేతనా సిన్హా... మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మహారాష్ట్రలో మొదటి గ్రామీణ బ్యాంకును మహిళల కోసం నెలకొల్పారు. ముంబయిలో పుట్టిపెరిగి, బాంబే యూనివర్సిటీలో కామర్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. ప్రతిష్ఠాత్మక ‘నారీ శక్తి’ పురస్కారాన్నీ అందుకున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్