అఘాయిత్యం చేశాడు.. వాడికి శిక్ష పడుతుందా?

మా పాప వయసు పదహారేళ్లు. మా ఆడపడుచు కొడుకు వయసు ఇరవై ఎనిమిదేళ్లు. అతడికిచ్చి పెళ్లి చేయమంటే కాదన్నాం. దాంతో మేము లేని సమయం చూసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

Updated : 06 Feb 2024 14:10 IST

మా పాప వయసు పదహారేళ్లు. మా ఆడపడుచు కొడుకు వయసు ఇరవై ఎనిమిదేళ్లు. అతడికిచ్చి పెళ్లి చేయమంటే కాదన్నాం. దాంతో మేము లేని సమయం చూసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం నలుగురికీ తెలిస్తే పరువుపోతుందని గుంభనంగా ఉన్నాం. కానీ, వాడి వేధింపులు ఆగలేదు. పెద్దమనుషులతో చెప్పించినా మారలేదు. దాంతో నా కూతురే కేసు పెడదాం అంటోంది. ఒకవేళ చట్ట సాయం కోరితే.. తనకి రక్షణ దొరుకుతుందా? వాడికి శిక్ష పడుతుందా?

 ఓ సోదరి

ఓ తల్లిగా మీ ఆవేదన అర్థం చేసుకోగలను. తప్పకుండా కేసు పెట్టండి. మైనర్‌ మీద అత్యాచారం చేసినందుకు నిందితుడికి కఠిన శిక్ష పడుతుంది. మీరు ఇంకా తాత్సారం చేస్తే అలుసుగా తీసుకుంటాడు. బాల్యవివాహాల నిషేధ చట్టం ప్రకారం పద్దెనిమిదేళ్లలోపు ఆడపిల్లలకు పెళ్లి చేయడం నేరం. ఒకవేళ దీన్ని ధిక్కరించి వివాహం జరిపిస్తే చేసినవాళ్లకూ, చేయించినవాళ్లకూ, పురోహితులకే కాదు... వాళ్లు మైనర్లని తెలిసీ దాన్ని చూసిన వారికి కూడా శిక్ష పడుతుంది. పోక్సో యాక్ట్‌(ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్స్‌ యాక్ట్‌) ప్రకారం మైనర్‌ సమ్మతి ఉన్నా లేకున్నా తనతో లైంగిక చర్య సాగించడం, వేధింపులకు గురి చేయడం నేరం. అలాంటివారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చట్టం చెబుతోంది. ఇక, ఐపీసీలోని సెక్షన్‌ 375 ప్రకారం మైనర్‌ తన ఇష్టంతోనే శారీరకంగా కలిసినా కూడా నేరంగానే పరిగణిస్తారు. ఎందుకంటే, ఆ అమ్మాయికి దానికి సమ్మతించే వయసు రాలేదు. ఐపీసీలోని సెక్షన్‌-376 ప్రకారం ఇందుకు కనీసం పదేళ్ల పాటు జైలు శిక్ష పడుతుంది. అంతేకాదు, ఇలాంటి నేరాల విచారణ కోసం ప్రతి పోలీస్‌ స్టేషన్‌లోనూ ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేశారు. కేసు కోర్టుకి వెళ్లాక కూడా ఇన్‌కెమెరా అంటే కేవలం జడ్జి, బాధితులు, నేరస్థులను మాత్రమే లోపల ఉంచి విచారణ చేస్తారు. మీరు భయపడకుండా ఫిర్యాదు చేయండి. పరువు కాదు. అమ్మాయి జీవితం ముఖ్యమని గుర్తుంచుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్