అందుకే ఇలాంటి బంధాలు వద్దు..

స్పందన ఓ మల్టీనేషనల్ కంపెనీలో పని చేస్తోంది. తన టీమ్‌లో ఉన్న రాకేష్ ఆమెకు మంచి స్నేహితుడు. ఇద్దరూ ప్రాజెక్టు విషయాల్లో ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. రాన్రానూ ఆ స్నేహం మరింత దృఢమైంది. ఇద్దరూ తమ వ్యక్తిగత విషయాల గురించి చర్చించుకోవడం; కాఫీలు, డిన్నర్‌లకు కలిసి బయటికి వెళ్లడం వంటివి జరిగేవి. కొన్నాళ్లకు ఇద్దరూ ఒకరిని వదిలి మరొకరు ఉండలేని పరిస్థితికి చేరుకున్నారు. అయితే ఏంటి? ఇద్దరూ వివాహం చేసుకోవచ్చుగా అనుకుంటున్నారా? వీరిద్దరూ వివాహితులే.

Published : 06 Jul 2021 19:34 IST

స్పందన ఓ మల్టీనేషనల్ కంపెనీలో పని చేస్తోంది. తన టీమ్‌లో ఉన్న రాకేష్ ఆమెకు మంచి స్నేహితుడు. ఇద్దరూ ప్రాజెక్టు విషయాల్లో ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. రాన్రానూ ఆ స్నేహం మరింత దృఢమైంది. ఇద్దరూ తమ వ్యక్తిగత విషయాల గురించి చర్చించుకోవడం; కాఫీలు, డిన్నర్‌లకు కలిసి బయటికి వెళ్లడం వంటివి జరిగేవి. కొన్నాళ్లకు ఇద్దరూ ఒకరిని వదిలి మరొకరు ఉండలేని పరిస్థితికి చేరుకున్నారు. అయితే ఏంటి? ఇద్దరూ వివాహం చేసుకోవచ్చుగా అనుకుంటున్నారా? వీరిద్దరూ వివాహితులే. ఆఫీసులో అయిన పరిచయం వీళ్లిద్దరి మధ్యా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇలాంటి పరిస్థితులు చాలామంది జీవితాల్లో ఎదురవుతూనే ఉంటాయి. మరి, ఈ వివాహేతర సంబంధాలు ఏర్పడడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు.

ఇద్దరి మధ్య గాఢమైన అనుబంధం, ఒకరంటే మరొకరికి చెప్పలేనంత ప్రేమ, సాన్నిహిత్యం.. సాధారణంగా ఏ బంధంలోనైనా ఈ మూడు అంశాలుంటే అది పర్ఫెక్ట్‌గా ఉన్నట్లు లెక్క. అయితే కొందరిలో ఈ మూడూ ఒకే వ్యక్తిపై ఉండాలని రూలేం లేదు. ఈ క్రమంలో ఒకే వ్యక్తి ఒకరితో కలిసి ఉంటూ, మరొకరితో అనుబంధం పెంచుకోవచ్చు. సాధారణంగా ఇదే వివాహేతర సంబంధాలకు కారణమవుతుంది. ఎక్కువ శాతం మందికి ప్రస్తుతం ఉన్న బంధంలో బోర్ కొట్టడం లేదా అందులోని ఒత్తిడిని తగ్గించుకోవడానికి వేరొకరిని ఆశ్రయించడం, తమని తమ భాగస్వామి కంటే ఎక్కువగా ప్రేమించేవారు ఉన్నారని వారిపై ప్రేమను, నమ్మకాన్ని పెంచుకోవడం.. ఇలా వివాహేతర సంబంధాలకు చాలా కారణాలే ఉంటాయి. సాధారణంగా కొన్ని వివాహేతర సంబంధాలను పరిశీలిస్తే..

కేవలం కోరికలకే..

కేవలం కోరికలకే పరిమితమయ్యే బంధాలు కూడా కొన్నుంటాయి. ఇలాంటి సంబంధాల్లో ఉన్నవారికి వివాహేతర సంబంధంలో ఉన్న తమ భాగస్వామిపై తమకున్న కోరికలను నెరవేర్చుకునే వరకు వాళ్లని విడిచిపెట్టాలన్న ఆలోచన ఏమాత్రం రాదు. అయితే కేవలం ఆ ఒక్కరితో మాత్రమే శారీరక సంబంధానికి కట్టుబడి ఉండకపోవచ్చు. ఇలాంటి బంధాలు ఎక్కువ కాలం నిలవవు. తమ భాగస్వామితో చక్కటి జీవితం గడుపుతున్నాం.. అన్న ఆలోచన వచ్చి కనువిప్పు కలగగానే ఇలాంటి బంధాలకు దూరంగా ఉండడం ప్రారంభిస్తారు కొందరు. ఎదుటివాళ్లు మనతో కాస్త క్లోజ్‌గా మాట్లాడితే చాలు.. వాళ్లకు మనతో సమయం గడపడమంటే ఇష్టమని, తామిద్దరం ప్రేమలో ఉన్నామని భావిస్తుంటారు మరికొందరు. వీరికోసం అవతలివారు తమ భాగస్వామిని కూడా వదిలేస్తారని వూహించుకుంటారు. కానీ ఇలా మధ్యలో కలిసిన బంధాలు మధ్యలోనే విడిపోతాయి. దీంతో చివరకు నిరాశే మిగులుతుంది. అంతేకాదు.. ఇలాంటి పనులు చేస్తున్నారని అసలు భాగస్వామికి తెలిస్తే.. అప్పటివరకు ఉన్న సదభిప్రాయం పోవడంతో పాటు, వివాహ బంధానికే ముప్పు వాటిల్లే అవకాశముంటుంది. కాబట్టి ఇలాంటి బంధాలు ప్రారంభించడం కంటే మీ భాగస్వామితో మాట్లాడి, వీలైతే సెక్సాలజిస్ట్, సైకాలజిస్ట్.. వంటి నిపుణుల్ని సంప్రదించి చికిత్స తీసుకోవడం.. అలాంటి ఆలోచనలు మదిలోకి రాకుండా జాగ్రత్తపడడం మంచిది.

కోపంతో ప్రారంభమయ్యేవి..

వివాహేతర సంబంధాల్లో ఈ తరహా బంధాలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. భర్త లేదా భార్య తమతో సరిగ్గా సమయం గడపట్లేదనో.. తాము చెప్పినట్లు వినట్లేదనో కోపగించుకొని వివాహేతర బంధాలను ప్రారంభించేవారూ లేకపోలేదు. మరికొందరు ఇలాంటి బంధాలు కొనసాగించే తమ భాగస్వామిపై కోపగించుకొని వారూ ఇలాంటి బంధాల్ని ఆశ్రయిస్తుంటారు. ఇలాంటి రిలేషన్‌షిప్స్‌లో ప్రస్తుత బంధంలో తమకున్న ఒత్తిడి, సమస్యలను ఎదుటివారితో పంచుకోవడానికి మాత్రమే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. పైగా వీటివల్ల ఒరిగేదేమీ ఉండదు.. దంపతుల మధ్య గొడవలు జరగడం తప్ప. 'తన కోపమే తన శత్రువు' అన్నట్లుగా భాగస్వామిపై కోపంతో ఇలాంటి పంతాలకు పోతే తమ వివాహబంధంలో నిరాశే మిగులుతుంది. కాబట్టి ఇలాంటి బంధాలు ప్రారంభించే బదులు భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలను వారే మాట్లాడుకొని పరిష్కరించుకోవడం వల్ల భేదాభిప్రాయాలన్నీ సమసిపోయి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది.

మానసిక బంధాలు..

ఇలాంటి బంధాల్లో సాధారణ దాంపత్య బంధంలోలాగా శృంగారానికి ఆస్కారం ఉండదు. కానీ మానసికంగా ఒకరిపై మరొకరు పూర్తిగా ఆధారపడతారు. అందుకే దీన్ని మనసుకు సంబంధించిన బంధంగా పేర్కొంటారు. ఇలాంటి రిలేషన్‌షిప్‌లో అడుగుపెట్టిన వారు శారీరక సంబంధం కొనసాగించకపోయినా.. శృంగారం గురించి మాట్లాడుకోవడం, పూర్తిగా వ్యక్తిగతమైన విషయాలు కూడా చర్చించుకోవడం.. వంటివి చేస్తుంటారు. ఒకరి గురించి మరొకరు ఎక్కువగా ఆలోచించడం ఈ బంధంలోనూ కనిపిస్తుంది. ఇలాంటి బంధాలను మొగ్గలోనే తుంచేయడం మంచిది. ఎందుకంటే ఇతరులపై మరీ ఎక్కువగా ఆధారపడడం వల్ల జీవితానికే చేటు జరుగుతుందని గుర్తుంచుకోవాలి. మానసికంగా మరీ ఎక్కువకాలం ఆధారపడిన తర్వాత వారిని మర్చిపోవడం, వదలడం కూడా కష్టంగా మారుతుంది. అందుకే మొదట్లోనే ఇలాంటి బంధాల నుంచి దూరమైతే అందరికీ మంచిది.

ఇది కూడా..

ఇక మరో తరహా బంధంలో ఇద్దరు వ్యక్తులు నిజజీవితంలో భార్యాభర్తల్లాగే ఒకరిపై ఒకరు మానసికంగా ఆధారపడతారు. శారీరకంగా దగ్గరవుతారు. అవతలివారితో ఉన్నప్పుడు వీరు ఎంతో ఆనందంగా ఫీలవుతుంటారు. అంతేకాదు.. వాళ్ల సాంగత్యంలోనే ఆనందాన్ని వెతుక్కుంటారు. అలాగే ఎప్పుడూ వాళ్లతోనే సమయం గడపాలనిపించడం.. వారి గురించే ఆలోచిస్తుండడం వల్ల తమ భాగస్వామికి ఎక్కువ సమయాన్ని కేటాయించలేరు. ఇలాంటి బంధాల వల్ల వారి వైవాహిక బంధంలో గొడవలు తప్ప మరే ఉపయోగమూ ఉండదు. ఇది శ్రుతి మించితే విడాకులకు కూడా దారితీయచ్చు. ఒకవేళ ఏదైనా కారణం వల్ల వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఇద్దరూ విడిపోవాల్సి వస్తే.. ఉన్న సమస్యకు అదనంగా మరో సమస్య తోడవుతుంది. ఇలాంటి సంబంధాల వల్ల అన్ని విధాలా చివరికి బాధే మిగులుతుంది. అందుకే దీన్ని తొలి దశలోనే గుర్తించి అసలు భాగస్వామితో మాట్లాడడం, మానసిక వైద్యుల్ని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం.. వంటివి చేయడం వల్ల ఇలాంటి బంధాలకు దూరంగా ఉండడమే కాదు.. వివాహ బంధాన్నీ అరమరికల్లేకుండా ఆస్వాదించవచ్చు.

ఇష్టంలేని పెళ్లి చేసుకోవడం, దాంపత్య బంధంలో ఎదురయ్యే సమస్యలు, ఒత్తిళ్లు.. ఇతరత్రా ఆకర్షణలు, అవసరాలు.. వంటి పలు కారణాల వల్ల వివాహేతర సంబంధాలను ఆశ్రయిస్తుంటారు కొందరు. అయితే ఆ బంధాలు తాత్కాలికంగా సంతోషాన్ని, ప్రశాంతతను అందించినప్పటికీ చివరికి మిగిలేది, శాశ్వతమయ్యేది మాత్రం నిజమైన భార్యాభర్తల బంధమే అని గుర్తుంచుకోవడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్