మాంద్యం ముప్పు.. ఈ తప్పులు చేయకండి..!

ఆర్థిక మాంద్యం ముప్పు రోజు రోజుకీ పెరుగుతోంది. రాబోయే 12 నెలల్లో మాంద్యం వచ్చే అవకాశాలున్నాయని ఇటీవలే ఓ సర్వేలో 86 శాతం మంది సీఈవోలు అభిప్రాయపడ్డారు. గత కొంత కాలంగా భారతీయ రిజర్వు బ్యాంకు కూడా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం కోసం....

Updated : 10 Oct 2022 19:14 IST

ఆర్థిక మాంద్యం ముప్పు రోజు రోజుకీ పెరుగుతోంది. రాబోయే 12 నెలల్లో మాంద్యం వచ్చే అవకాశాలున్నాయని ఇటీవలే ఓ సర్వేలో 86 శాతం మంది సీఈవోలు అభిప్రాయపడ్డారు. గత కొంత కాలంగా భారతీయ రిజర్వు బ్యాంకు కూడా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం కోసం కీలక వడ్డీ రేట్లు పెంచుతూనే ఉంది. మాంద్యం వచ్చినప్పుడు నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటుతుంటాయి. ప్రజల ఆదాయం తగ్గిపోవడంతో పాటు నిరుద్యోగం పెరిగిపోతుంది. కాబట్టి, ఈ సమయంలో ఆర్థిక క్రమశిక్షణ ఎంతో అవసరం అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు. మరి, అవేంటో తెలుసుకుందామా...

వీటి విషయంలో జాగ్రత్త..

సొంత ఇల్లు, కారు.. ఈ రెండూ ఉండాలని చాలామంది కోరుకుంటారు. ఇందుకోసం బ్యాంక్‌ నుంచి రుణం తీసుకుని, తమ కలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే మాంద్యం సమయంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతుంటాయి. ఫలితంగా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఇలాంటి సమయంలో రుణానికి సంబంధించిన నెలవారీ చెల్లింపులు కష్టమవుతుంటాయి. కాబట్టి, ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ముందే ఎక్కువ మొత్తం చెల్లించి తక్కువ మొత్తంలో ఈఎమ్‌ఐ ఉండేటట్లు చూసుకోవడం, వడ్డీ రేటు తక్కువగా ఉన్న బ్యాంకులను ఎంచుకోవడం కూడా మంచి మార్గాలే..

ప్రత్యామ్నాయం అవసరం..

మాంద్యం సమయంలో ప్రజలు మాత్రమే కాదు.. సంస్థలు కూడా ఒడిదొడుకులకు లోనవుతుంటాయి. ఈ క్రమంలో సంస్థలు ఖర్చులు తగ్గించుకోవడం, ఉద్యోగులను తొలగించడం, లేఆఫ్‌లు ప్రకటించడం.. వంటివి చేస్తుంటాయి. ఇది ఉద్యోగ భద్రతపై ప్రభావం చూపిస్తుంటుంది. అయితే కొంతమంది ఉద్యోగం పోతే మరొక సంస్థలో సంపాదించుకోవచ్చనే ధీమాతో ఉంటారు. అయితే మాంద్యం సమయంలో ఇది అంత సులభం కాదని గుర్తుపెట్టుకోవాలి. అలాంటి సమయాల్లో సురక్షితంగా ఉండాలంటే ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ ఆదాయ వనరు సృష్టించుకోవాలంటున్నారు నిపుణులు. దానివల్ల ఉద్యోగం ప్రమాదంలో పడినా మాంద్యం ముప్పు నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు.

హామీలొద్దు...

స్నేహితులు, శ్రేయోభిలాషులు ఆర్థిక సహాయం అడిగినప్పుడు కొంతమంది తమ దగ్గర డబ్బులు లేకున్నా తెలిసిన వారి దగ్గర్నుంచి ఇప్పిస్తుంటారు. ఈ క్రమంలో వారు మధ్యవర్తిగా వ్యవహరిస్తుంటారు. అయితే డబ్బులు తీసుకున్న వ్యక్తి తిరిగి సక్రమంగా చెల్లిస్తే ఏ సమస్యా ఉండదు. కానీ, మాంద్యం సమయంలో ధరలు పెరగడం, ఉద్యోగ భద్రత తక్కువగా ఉండడం.. వంటి కారణాల వల్ల ఈ సమయంలో వారు తిరిగి డబ్బు చెల్లించే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఆర్థికపరమైన అంశాల్లో వ్యక్తిగత హామీలు ఇవ్వకపోవడం మంచిది. ప్రత్యేకించి మాంద్యం సమయంలో ఇలాంటి విషయాల్లో సాధ్యమైనంత వరకు మీ ప్రమేయం లేకుండా చూసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

వ్యాపారం కోసం లోన్ తీసుకుంటున్నారా?

ఈ రోజుల్లో చాలామంది స్టార్టప్‌ల పేరుతో వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్నారు. అయితే తమ వ్యాపారాలను మరింతగా విస్తరించాలంటే పెట్టుబడులు పెట్టడం ముఖ్యం. ఇందుకు అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అప్పుడు వీరికి కనపడే మొదటి ఎంపిక బ్యాంకు రుణం తీసుకోవడం. అయితే సాధారణ సమయంలో వ్యాపారం కోసం బ్యాంకు రుణాలు తీసుకోవడం మంచిదే. కానీ, మాంద్యం వచ్చినప్పుడు డబ్బులు తిరిగి చెల్లించడం కష్టం కావచ్చు. అయితే ఇది చేసే వ్యాపారాన్ని బట్టి ఉంటుంది. కరోనా సమయంలో చాలా సంస్థలు నష్టాలు చవిచూసినా కొన్ని సంస్థలు మాత్రం లాభాలు పొందాయి. కాబట్టి, వీటిని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడుల నిమిత్తం బ్యాంకు రుణాల గురించి ఆలోచించడం మంచిదంటున్నారు నిపుణులు.

ఇవి కూడా..

ఆర్థిక అత్యవసరాలు ఏ సందర్భంలోనైనా రావచ్చు. వచ్చే ముందు ఇవి చెప్పి రావు. దీనికి మాంద్యంతో సంబంధం ఉండదు. కాబట్టి, ఇలాంటి వాటికి ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలంటారు ఆర్థిక నిపుణులు. ఇందుకు మీ జీతంలో సాధ్యమైనంత ఎక్కువ మొత్తాన్ని అత్యవసర నిధి కోసం కేటాయించుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే మాంద్యం ముంచుకొస్తోన్న నేపథ్యంలో విలాసాలకు, అనవసరమైన షాపింగ్‌కు దూరంగా ఉండడమే మంచిదని సూచిస్తున్నారు. దీనికి బదులుగా ఆ మొత్తాన్ని ఇతర మార్గాల్లో పెట్టుబడి పెట్టడం మేలని సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్