కోపం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నా ఫ్రెండ్స్ నా మీద జోక్స్ వేసినప్పుడు, తిట్టినప్పుడు, నన్నెవరైనా బాధపెట్టినప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. కోపం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? రెండోది నా ఫ్రెండ్స్ నాకు సిగ్గు ఎక్కువ అంటూ ఉంటారు. నా నవ్వు వల్లో లేక నేను వాళ్లను చూసే....

Published : 26 May 2022 16:38 IST

నమస్తే మేడమ్‌.. నా ఫ్రెండ్స్ నా మీద జోక్స్ వేసినప్పుడు, తిట్టినప్పుడు, నన్నెవరైనా బాధపెట్టినప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. కోపం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? రెండోది నా ఫ్రెండ్స్ నాకు సిగ్గు ఎక్కువ అంటూ ఉంటారు. నా నవ్వు వల్లో లేక నేను వాళ్లను చూసే విధానం వల్లో.. అలా ఎందుకు అంటున్నారో అర్థం కావట్లేదు. నేను ఆ సిగ్గును పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? మూడోది నేను అందరిలోనూ తక్కువగా మాట్లాడతాను. గలగలా, భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలంటే ఏం చేయాలి? - ఓ సోదరి

జ. కోపాన్ని నియంత్రించుకోవడం (యాంగర్ మేనేజ్‌మెంట్) అనేది ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌లో భాగం. మనం మన భావాలను అర్థం చేసుకొని, వాటిని ఎంత బాగా నియంత్రించుకోగలిగితే మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంత ఎక్కువగా ఉన్నట్టు అర్థం. మీ స్నేహితులు మిమ్మల్ని టీజ్ చేసినప్పుడు మీకు కోపం వస్తుందని రాశారు. ఇది ఎందుకు జరుగుతోందో అర్థం చేసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నించారా? అసలు వాళ్లంటేనే మీకు కోపమా? లేదా వారన్న మాటలకు బాధ కలిగి కోపం వస్తోందా? ఆలోచించండి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మొదట మనం ఏం ఫీలవుతున్నామో తెలుసుకోవడం. ఆ తర్వాత పరిణతితో ఆలోచించి ఆ ఫీలింగ్స్‌తో డీల్ చేయడం.

ఇక పోతే మీ రెండు, మూడు ప్రశ్నల్లో మీ ఇంట్రోవర్టిజం గురించి అడిగారు. ఇంట్రోవర్టిజం అనేది ఒక పర్సనాలిటీ టైప్. ఇందులో తప్పు, ఒప్పు ఏమీ ఉండవు. అది మీ స్వభావం అంతే. అయితే మన సమాజం ప్రతి ఒక్కరూ తమ భావాలన్నింటినీ బయటకు వ్యక్తం చేయడమే మంచిదంటూ ఎక్స్‌ట్రోవర్టిజానికి ఓ మంచి ఇమేజ్‌ని క్రియేట్ చేసింది. ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. దాన్ని సాధ్యం చేయడానికి ప్రయత్నించాల్సిన అవసరం కూడా లేదు. ఒక యాపిల్‌ని నారింజలా ఉండమంటే ఎలా ఉండగలుగుతుంది. అలాగే ఇది కూడా. అందుకే మీ పర్సనాలిటీని గుర్తించి దాంతో ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి. మీరు మీలాగే ఉండండి. వేరేవారిలా మారడానికి ప్రయత్నించవద్దు. సిగ్గరిగా, ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం తప్పేమీ కాదు. ఇంట్రోవర్ట్‌గా ఉండడంలోనూ ఎంతో ఆనందం ఉంది. మీరు దాన్ని గుర్తిస్తే మీరు మీరుగా ఉండడాన్ని తప్పకుండా ఆనందించగలుగుతారు. అయితే ప్రత్యేకించి ఇంటర్వ్యూలు, ఆఫీసులో మీటింగ్స్, సెమినార్లు, ప్రజెంటేషన్లు మొదలైన సందర్భాల్లో భయం లేకుండా, ఆత్మవిశ్వాసంతో మాట్లాడడం అవసరమే. ఇందుకోసం ముందస్తు ప్రణాళిక, సాధన తప్పనిసరి. మీకు భయం లేదా ఇబ్బంది కలిగించే పరిస్థితులను గుర్తించి వాటిని ఎదుర్కోవడానికి మానసికంగా సంసిద్ధులు కండి. అలాంటి పరిస్థితులకు బెదిరి పారిపోకుండా మీ అంతట మీరే వాటిని ఆహ్వానించి, భయాన్ని అధిగమించడానికి ప్రయత్నించండి. క్రమం తప్పకుండా సాధన చేస్తే మీరు కోరుకున్నట్లు నలుగురిలో భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలుగుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్