Published : 23/12/2021 19:04 IST

ఇవ్వడమే తెలిసిన చెట్టు..!

క్రిస్మస్..ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం, భక్తి.. అన్నీ కలగలిసిన పండగ ఇది. క్రిస్మస్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది క్రిస్మస్ చెట్టు, శాంటాక్లాజ్.. ఈ నేపథ్యంలో అసలు క్రిస్మస్ చెట్టును ఎందుకు ఇళ్లల్లో ఉంచుతారు.. క్రిస్మస్ చెట్టుని భగవంతుడి ప్రతిరూపం అని ఎందుకంటారు? దీనికి సంబంధించిన ఇతర ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం.. రండి..

క్రిస్మస్ చెట్టు.. ఈ చెట్టుకు ఎప్పుడూ ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలియదని అంటూ ఉంటారు. పండగ రోజుల్లో ఈ చెట్టు కింద బహుమతులు ఉంచి అవి కుటుంబ సభ్యులంతా తీసుకోవడం ఒక ఆనవాయితీ.. 'ఈ బహుమతులన్నీ దేవుని దగ్గరి నుంచే వచ్చినవి..' అన్న అంతరార్థం అందులో ఉంటుంది. అందుకే క్రిస్మస్ చెట్టుని భగవంతుడి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారంతా..! పశ్చిమ దేశాల్లో చలికాలంలో మంచు వల్ల మొక్కలన్నీ తమ జీవాన్ని కోల్పోతాయి. కానీ క్రిస్మస్ చెట్టుగా పిలుచుకునే ఫర్ ట్రీ మాత్రం పచ్చగానే ఉంటుంది. అందుకే ఇది జీసస్ నిత్యజీవానికి, చైతన్యానికి ప్రతీక అని అందరూ నమ్ముతారు. క్రిస్మస్ చెట్టును ఏసుక్రీస్తు జీవితానికి ప్రతీకగా భావిస్తారు.

ఆయన ఇచ్చిందే..!

క్రిస్మస్ చెట్టు పుట్టుక గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. అది నిజమో.. కాదో చెప్పే ఆధారాలేమీ లేకపోయినా.. క్రిస్మస్ ట్రీకి మూలం ఈ కథే అని చెప్పుకోవచ్చు.. అదేంటో తెలుసుకుందాం... అది చలికాలంలోని ఓ రాత్రి. ఒక చిన్న పాకలాంటి ఇంట్లో వాలంటైన్, మేరీ అనే ఇద్దరు పిల్లలు వాళ్ల నాన్న కోసం వేచి చూస్తున్నారు. అప్పటికే వాళ్లు భోజనం చేసి రెండు రోజులు దాటింది. ఆహారం తీసుకొస్తానని వెళ్లిన నాన్న ఒక రొట్టెముక్కతో తిరిగొచ్చాడు. ప్రార్ధన చేసుకుని ఆ రొట్టె ముక్కనే ముగ్గురూ పంచుకొని తినబోతుండగా.. తలుపు శబ్దం అయింది. వెళ్లి చూస్తే ఒక కుర్రాడు.. చలితో వణుకుతూ కనిపించాడు. వెంటనే అతన్ని లోపలికి తీసుకొచ్చి, తమ దుస్తులు ఇచ్చి, ఆకలితో ఉన్న అతనికి తమ వంతు ఆహారాన్ని ఇచ్చారు ఆ ముగ్గురు. ఆ తర్వాత ఆ పిల్లాడికి సహాయం చేసిన ఆనందంతో వారు చక్కగా నిద్రపోయారు. అర్ధరాత్రి అలికిడికి వాళ్లందరూ లేచిచూసేసరికి బాలయేసు ప్రత్యక్షమయ్యాడు. 'మీ దాన గుణం చాలా గొప్పది. అది నాకు చాలా నచ్చింది' అని చెప్పిన ఆయన ఒక ఎండు కొమ్మను నేలలో నాటాడు. అది వెంటనే పచ్చగా మారి, పెద్ద చెట్టుగా ఎదిగింది. బంగారు చెట్టుగా మారిపోయింది. తమ గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఆకలితో ఉన్న బాలుడికి సహాయం చేసి, పవిత్ర హృదయంతో అక్కున చేర్చుకున్న ఆ కుటుంబ సభ్యులను ప్రభువు ఆశీర్వదించి ఆ బహుమతి అందించాడని భావిస్తారు. అలా ప్రభువు కృపకు చిహ్నంగా క్రిస్మస్ ట్రీని అందరూ తమ ఇళ్లలోనూ ఉంచి అలంకరిస్తారు.

ముందు నుంచే..

అయితే క్రిస్మస్ చెట్టు కేవలం క్రైస్తవులకు మాత్రమే పరిమితం కాదు.. ఇతరులకు కూడా సంబంధించింది అని చెప్పే కథలు చాలానే కనిపిస్తాయి. పాగన్లు, ఈజిప్షియన్లు తమ ఇళ్లను ఖర్జూర ఆకులతో అలంకరించుకునేవారట. ఆ తర్వాత ప్యారడైజ్ ట్రీగా పిలుచుకునే ఫర్ చెట్టును జర్మన్లు 12వ శతాబ్దం నుంచి అలంకరించడం ప్రారంభించారు. వాళ్లు చలికాలాన్ని చెడుగా భావించేవాళ్లు.. చలికాలంలోనూ పచ్చగా ఉండే ఈ మొక్కను చెడుపై మంచి సాధించిన విజయంగా భావించి దీన్ని తెచ్చి ఇళ్లల్లో ఉంచుకునేవారు. అంతేకాదు.. చలికాలం ముగిసిన తర్వాత ఇతర మొక్కలు కూడా వీటి మాదిరిగానే పచ్చదనాన్ని సంతరించుకుంటాయనే ఆశకు ప్రతిరూపంగా భావిస్తారు. రోమన్లు వ్యవసాయానికి అధిపతి అయిన శాటర్నస్‌కి ప్రతీకగా ఈ చెట్టును పూజించి అలంకరించేవారు. దాన్ని నాణేలు, కొవ్వొత్తులు, పండ్లు, పేస్ట్రీలు, బిస్కట్లతో అలంకరించేవారు.

పూర్వకాలంలో క్రిస్మస్ చెట్టును క్రిస్మస్ పండగ ప్రారంభమయ్యే రోజు (డిసెంబర్ 23)న పెట్టేవారు. కొత్త సంవత్సరం వచ్చేవరకూ దీన్ని అలంకరించే ఉంచేవారు. పండ్లు, ఇతర ఆహార పదార్థాలు, ఆభరణాలు, పూలు, కొవ్వొత్తులతో దీన్ని అలంకరించేవారు. రానురాను అలంకరణ పద్ధతుల్లో, క్రిస్మస్ ట్రీని పెట్టే తేదీల్లో మార్పులు వచ్చాయి. అయితే ఈ క్రిస్మస్ ట్రీని పెట్టిన తర్వాతే చలికాలపు వేడుక (వింటర్ ఫెస్టివల్) ప్రారంభించడం విదేశాల్లో ఆనవాయితీగా వస్తోంది. ఇలా ప్రతి సంవత్సరం సుమారు కొన్ని కోట్ల క్రిస్మస్ మొక్కలు అమ్ముడవుతాయని అంచనా.

నేపథ్యం ఏమైనప్పటికీ- కాలాలు మారినా, ప్రతికూల వాతావరణం ఎదురైనా ఆ భగవంతుని దయ ఉంటే పదికాలాల పాటు పచ్చగా ఉండొచ్చని నిరూపిస్తుంది కాబట్టే క్రిస్మస్ చెట్టు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని