Miss World: ‘ప్రపంచ సుందరి’ కిరీటం గెలిచిన ఆరుగురు అందగత్తెలు!

మగువల ఆత్మ సౌందర్యానికి అద్దం పట్టే ‘ప్రపంచ సుందరి’ పోటీలకు ఈసారి మన దేశం ఆతిథ్యమిస్తోంది. దీంతో ఈసారి భారత్‌ తరఫున పోటీ పడుతోన్న సినీ శెట్టి పైనే కోట్లాది మంది భారతీయులు ఆశలు పెట్టుకున్నారు.

Published : 09 Mar 2024 20:11 IST

(Photos: Instagram)

మగువల ఆత్మ సౌందర్యానికి అద్దం పట్టే ‘ప్రపంచ సుందరి’ పోటీలకు ఈసారి మన దేశం ఆతిథ్యమిస్తోంది. దీంతో ఈసారి భారత్‌ తరఫున పోటీ పడుతోన్న సినీ శెట్టి పైనే కోట్లాది మంది భారతీయులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే పలు దశల్ని దాటి టాప్‌-20లోకి ప్రవేశించిన ఈ ముద్దుగుమ్మ.. కిరీటానికి మరింత చేరువ కావడంతో మానుషి తర్వాత మన దేశానికి కిరీటం తెచ్చేది సినీనే అని విశ్వసిస్తున్నారు. అయితే ఈ కన్నడ బ్యూటీ కంటే ముందు ఎంతోమంది అందాల భామలు ఈ విశ్వవేదికపై మెరిశారు. వారిలో ఆరుగురు ముద్దుగుమ్మలు కిరీటం గెలుచుకొని దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. మరి, వాళ్లెవరు? ఎప్పుడెప్పుడు దేశానికి ప్రపంచ సుందరి కిరీటం అందించారో తెలుసుకుందాం రండి..

రీటా ఫారియా

ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ మహిళ రీటా ఫారియా. గోవాలో పుట్టిన ఆమె 1966లో ఈ కిరీటాన్ని సొంతం చేసుకుంది. అయితే ‘మిస్ వరల్డ్‌’గా కిరీటం గెలిచిన తర్వాత ఆమెకు నటన, మోడలింగ్‌లో బోలెడన్ని అవకాశాలు తలుపుతట్టాయి. అయినా వాటిని కాదని వైద్య విద్య పైనే తన పూర్తి దృష్టి పెట్టిందామె. మెడిసిన్‌ పూర్తిచేసి ప్రజలకు వైద్య సేవలందించాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగింది. ఈ ఆలోచనతోనే మెడిసిన్‌ పూర్తిచేశాక.. పైచదువుల కోసం లండన్‌ వెళ్లిన ఆమె.. అక్కడే తన మెంటార్‌ డేవిడ్‌ పోవెల్‌ను వివాహమాడింది. పెళ్లయ్యాక భర్తతో కలిసి ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో స్థిరపడిందీ అందాల రాశి. ప్రస్తుతం అటు వైద్య వృత్తిని కొనసాగిస్తూనే.. ఇటు ఇద్దరు పిల్లలు, మనవలు-మనవరాళ్లతో సంతోషంగా గడుపుతున్నారు రీటా. అంతేకాదు.. పలు అందాల పోటీలకు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించారామె.


ఐశ్వర్యారాయ్ బచ్చన్

నీలికళ్ల సుందరిగా భారతీయుల హృదయాలను కొల్లగొట్టిన అందాల తార ఐశ్వర్యారాయ్‌. రీటా తర్వాత 1994లో మన దేశానికి ‘ప్రపంచ సుందరి’ కిరీటం తెచ్చిపెట్టింది. కర్ణాటకలోని మంగళూరులో పుట్టింది ఐశ్వర్య. చిన్న వయసులోనే ముంబయికి మకాం మార్చడంతో ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం అంతా అక్కడే కొనసాగింది. ఐష్‌కి జంతుశాస్త్రం (జువాలజీ) అంటే చాలా ఇష్టం. అందుకే మొదట్లో మెడిసిన్ రంగంలో స్థిరపడాలని భావించినా.. ఆ తర్వాత ఆర్కిటెక్చర్ వైపు అడుగులేయాలనుకుంది. కానీ మోడలింగ్‌పై తనకున్న ఇష్టం.. ఆర్కిటెక్చర్‌ రంగాన్ని కూడా వదులుకునేలా చేసింది. ‘ప్రపంచ సుందరి’గా అవతరించాక సినీ రంగంలో అడుగుపెట్టిన ఆమెకు.. వరుస అవకాశాలు తలుపుతట్టాయి. తన కెరీర్‌లో గ్లామర్‌కు ప్రాధాన్యమున్న పాత్రలే కాదు.. మహిళా ప్రాధాన్య చిత్రాల్లోనూ నటించి బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా స్థానం సంపాదించుకుందీ బ్యూటీ. గతేడాది ‘పొన్నియన్‌ సెల్వన్‌-2’తో మరోసారి సినీ ప్రేక్షకుల్ని అలరించిన ఈ భామ.. పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లోనూ పాల్గొని సందడి చేస్తుంటుంది. 2007లో నటుడు అభిషేక్‌ బచ్చన్‌ని వివాహమాడాకా సినిమాల్లో నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ. ఇక ఈ జంట ముద్దుల కూతురు ఆరాధ్య గురించి అందరికీ తెలిసిందే!


డయానా హెడెన్

1997లో ‘మిస్ వరల్డ్’ కిరీటం గెలుచుకున్న మరో భారతీయ భామ డయానా హెడెన్. హైదరాబాద్‌కు చెందిన ఆంగ్లో- ఇండియన్ క్రిస్టియన్ కుటుంబంలో జన్మించిన డయానా ప్రాథమిక విద్యాభ్యాసం సికింద్రాబాద్‌లోనే సాగింది. ఆపై లండన్‌లోని ‘రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమటిక్ ఆర్ట్స్’ నుంచి నటనకు సంబంధించిన కోర్సు పూర్తి చేసింది. ఈ క్రమంలోనే కళాశాలలో షేక్‌స్పియర్ రచనలను ప్రదర్శించడం ద్వారా ఉత్తమ నటిగా కూడా పేరు తెచ్చుకొంది. అలా 2001లో వెండితెరపై కథానాయికగా మెరిసిందీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత పలు చిత్రాల్లో, టీవీ షోల్లో అలరించిన డయానా 2012లో ‘ఎ బ్యూటిఫుల్ గైడ్’ అనే పుస్తకాన్ని కూడా రాసింది. 2013లో లాస్‌వెగాస్‌కి చెందిన కాలిన్ డిక్ అనే వ్యక్తిని ఆమె వివాహం చేసుకుంది. ఈ జంటకు ముగ్గురు పిల్లలు. అమ్మయ్యాక నటనకు పూర్తిగా దూరమైన డయానా.. పలు సేవా కార్యక్రమాల్లోనూ భాగమైంది. ఈ క్రమంలోనే పిల్లల హక్కులు, జంతు సంరక్షణ, క్యాన్సర్‌, హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌.. వంటి వాటి పైనా అవగాహన కల్పించింది.


యుక్తాముఖి

డయానా హెడెన్ తర్వాత 1999లో ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకొన్న భారతీయ మహిళ యుక్తాముఖి. పుట్టింది బెంగళూరులోనే అయినా ఆమెకి ఆరేళ్లొచ్చే వరకు దుబాయ్‌లోనే పెరిగింది. ఆ తర్వాత వాళ్ల కుటుంబం ముంబయికి మకాం మార్చడంతో ఇక్కడే స్థిరపడిందామె. ఆమె తండ్రి వైద్యుడు. తల్లి గ్రూమింగ్ కన్సల్టెంట్‌గా పని చేసేది. ‘ప్రపంచ సుందరి’గా అవతరించాక బాలీవుడ్‌లో నటించే అవకాశమొచ్చిందామెకు. సినిమాల్లో కొనసాగుతున్నప్పుడే 2008లో ముంబయికి చెందిన ప్రిన్స్ తులి అనే వ్యక్తిని పెళ్లాడింది. 2014లో విడిపోయిన ఈ జంటకు ఒక కొడుకున్నాడు. ఈ ముద్దుగుమ్మకు అందమే కాదు.. అందమైన మనసూ ఉంది.. రొమ్ముక్యాన్సర్‌, తలసేమియా, హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌.. వంటి వ్యాధులపై అవగాహన పెంచేందుకు పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసిన ఆమె.. తన మరణానంతరం అవయవదానం చేస్తాననీ ప్రతిజ్ఞ చేసింది. ‘నేను ఈ ప్రపంచంలో లేకపోయినా అవయవదానంతో మరొకరికి జీవితాన్నిస్తానన్న ఆలోచనే నాకెంతో తృప్తిగా అనిపిస్తోంది..’ అంటోంది యుక్తా.


ప్రియాంక చోప్రా

మన దేశం తరఫున 2000లో ‘ప్రపంచ సుందరి’ పోటీల్లో పాల్గొని కిరీటం గెలుచుకుంది ప్రియాంక చోప్రా. జార్ఖండ్‌లో 1982లో పుట్టింది ప్రియాంక. ఆమె తల్లిదండ్రులిద్దరూ ఆర్మీలో వైద్యులుగా పని చేసేవారు. 13ఏళ్ల వయసులోనే పైచదువుల కోసం అమెరికా వెళ్లిపోయిన ఆమె.. మూడేళ్ల తర్వాత ఇండియాకు తిరిగొచ్చింది.. తన తల్లి ప్రోత్సాహంతో 2000లో అందాల పోటీల్లో పాల్గొన్న ప్రియాంక కిరీటం గెలిచి.. దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగిన ఆమె.. హాలీవుడ్‌లోనూ పలు సినిమాలు, టీవీ సిరీస్‌లలో నటిస్తూ గ్లోబల్‌ బ్యూటీగా పేరుతెచ్చుకుంది. ఇప్పటికీ హాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. మరోవైపు నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. అమెరికన్‌ సింగర్‌ నిక్‌ జొనాస్‌ను వివాహమాడిన పీసీ.. ప్రస్తుతం న్యూయార్క్‌లోనే స్థిరపడింది. ఈ జంటకు ఓ పాప కూడా ఉంది. ప్రస్తుతం తన ముద్దుల కూతురు మాల్తీతో గడుపుతూనే.. అప్పుడప్పుడూ భారత్‌లోనూ సందడి చేస్తోందీ అందాల తార.


మానుషీ చిల్లర్

ప్రియాంక తర్వాత ‘ప్రపంచ సుందరి’ కిరీటం కోసం భారతీయులు ఏళ్లుగా ఎదురుచూడాల్సి వచ్చింది. ఆ ఎదురుచూపులకు తెరదించింది హరియాణా బ్యూటీ మానుషీ చిల్లర్‌. దాదాపు 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకొన్న ఆరో భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిందామె. సెనపట్‌లోని భగత్‌పూల్ సింగ్ ప్రభుత్వ కళాశాలలో వైద్య విద్యను పూర్తిచేసిన ఆమె.. ఆపై బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. 2022లో ‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆమె.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే విడుదలైన ‘ఆపరేషన్‌ వాలంటైన్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్నీ అలరించిందామె. ప్రస్తుతం ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పలు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ భాగమవుతోంది.


కిరీటం బరిలో.. సినీ!

28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాది భారత్‌లో ‘ప్రపంచ సుందరి’ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో మన దేశం తరఫున పాల్గొంటోంది సినీ శెట్టి. ముంబయికి చెందిన ఈ భామ.. ‘అకౌంటింగ్‌-ఫైనాన్స్‌’లో డిగ్రీ పూర్తిచేసింది. ప్రస్తుతం సీఎఫ్‌ఏ చదువుతోన్న ఈ చక్కనమ్మ.. మంచి డ్యాన్సర్‌ కూడా! తన ఎత్తును చూసి ఎవరో ‘నువ్వు మోడలింగ్‌ చేస్తే చక్కగా రాణిస్తావు’ అన్నారట! ఆ స్ఫూర్తితో మోడలింగ్‌లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. 2022లో ‘మిస్‌ ఇండియా’ పోటీల్లో పాల్గొని కిరీటం గెలుచుకుంది. తద్వారా ఈ ఏడాది జరుగుతోన్న ‘మిస్‌ వరల్డ్‌’ పోటీల్లో పోటీ పడుతున్న సినీ.. ఇప్పటికే పలు దశల్ని దాటి టాప్‌-20లోకి ప్రవేశించింది. అంతేకాదు.. ‘బెస్ట్‌ డిజైనర్‌ డ్రస్‌ ఫ్రమ్‌ ఆసియా అండ్‌ ఓషియానియా’గా నిలిచింది. ఈ దూకుడు చూస్తుంటే ఈసారి మిస్‌ వరల్డ్‌ కిరీటం మనదేనని చాలామంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

1951లో యూకేకి చెందిన ఎరిక్ మోర్లే, జూలియా మోర్లే అనే దంపతులు ఈ అందాల పోటీలను నిర్వహించడం ప్రారంభించారు. 2000 సంవత్సరంలో ఎరిక్ మరణించడంతో.. అప్పట్నుంచి జూలియా ఈ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్