పీజీ.. బీటెక్.. నర్సింగ్.. చాయ్‌వాలీలు!
‘చదివిన చదువుకు, పొందిన పట్టాకు న్యాయం చేయాలంటే.. దానికి తగ్గ ఉద్యోగమే చేయాల’నుకుంటారు చాలామంది. కానీ తమ రూటే సెపరేటు అంటున్నారీ అమ్మాయిలు. తాము పొందిన పట్టా పేరుతోనే టీ వ్యాపారం ప్రారంభించారు.. అలాగని చాయ్ వ్యాపారమా అని వీళ్లను తక్కువ అంచనా....
(Photo: Instagram)
‘చదివిన చదువుకు, పొందిన పట్టాకు న్యాయం చేయాలంటే.. దానికి తగ్గ ఉద్యోగమే చేయాల’నుకుంటారు చాలామంది. కానీ తమ రూటే సెపరేటు అంటున్నారీ అమ్మాయిలు. తాము పొందిన పట్టా పేరుతోనే టీ వ్యాపారం ప్రారంభించారు.. అలాగని చాయ్ వ్యాపారమా అని వీళ్లను తక్కువ అంచనా వేయకండి.. ఎందుకంటే తమ చాయ్ రుచితోనే కాదు.. పని పట్ల తమకున్న నిబద్ధతతోనూ అందరి మన్ననలూ అందుకుంటున్నారు. మరి, ఇంత చదువు చదివి.. చాయ్‌వాలీలుగా ఎందుకు మారారు? అనడిగితే.. ఒక్కొక్కరూ దాని వెనకున్న నేపథ్యాన్ని ఇలా బయటపెట్టారు.
‘బీటెక్’ చాయ్‌వాలీ - వర్తికా సింగ్
సాధారణంగా బీటెక్ చదివిన వారు కాలు కదపకుండా చేసే కార్పొరేట్ ఉద్యోగాల్లో స్థిరపడాలనుకుంటారు. కానీ హరియాణా ఫరీదాబాద్‌కు చెందిన వర్తికా సింగ్ ఇందుకు భిన్నం. ఈ అమ్మాయికి వ్యాపారమంటే ఇష్టం.. అందులోనూ టీ వ్యాపారం ప్రారంభించాలనేది చిన్ననాటి కోరిక. ఈ మక్కువతోనే ఓవైపు చదువు కొనసాగిస్తూనే మరోవైపు టీకొట్టు పెట్టేసేంది!
‘బీటెక్ పూర్తి కావాలంటే నాలుగేళ్లు పడుతుంది. అంత సమయం వేచి చూడలేకే.. నాకెంతో ఇష్టమైన టీ వ్యాపారంలోకి అడుగుపెట్టాను. నా టీ కొట్టుకు ‘బీటెక్ చాయ్‌వాలీ’ అనే పేరు పెట్టాను. రోజంతా కాలేజీలోనే గడిచిపోతుంది. సాయంత్రం 5.30 నుంచి 9 గంటల వరకు ఇక్కడి గ్రీన్‌ఫీల్డ్ ప్రాంతంలో టీ స్టాల్ నడుపుతున్నా. సాధారణ చాయ్ (రూ. 10)తో పాటు లెమన్, మసాలా టీని రూ. 20కే నా స్టాల్‌లో ప్రత్యేకంగా విక్రయిస్తున్నా. చదువు పూర్తికాక ముందే ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టడం ఒకెత్తైతే.. చాలామంది నా పనిని అభినందించడం ఆనందంగా అనిపిస్తోంది..’ అంటోంది వర్తిక.
అంతులేని ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో కృషి చేస్తే విజయం తప్పక వరిస్తుంది'- అంటూ తన టీ స్టాల్ దగ్గర ఓ బ్యానర్‌నూ పెట్టుకుంది వర్తిక. ప్రస్తుతం అక్కడి ‘మానవ్ రచనా యూనివర్సిటీ’లో బీటెక్ చదువుతోన్న వర్తిక టీ వ్యాపారం గురించి ఇటీవలే ఓ ఫుడ్ బ్లాగర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. పని పట్ల తన నిబద్ధత, ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసిస్తూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.
అయితే -'ఈ వీడియోను ఊరికే వైరల్ చేయకండి. దానివల్ల వచ్చేదేమీ లేదు. వీలైతే ఇక్కడకు వచ్చి, ఒకసారి టీ తాగి చూడండి. నచ్చకపోతే మళ్లీ రావద్దు’ అంటూ వర్తిక తన పనిలో తాను మునిగిపోవడం గమనార్హం.
‘మోడల్’ చాయ్‌వాలీ - సిమ్రన్ గుప్తా
కరోనాతో చాలామంది తలరాతలు తలకిందులైపోయాయి. గోరఖ్‌పూర్‌కు చెందిన సిమ్రన్ గుప్తా జీవితం కూడా ఇందుకు మినహాయింపు కాదు. 2018లో ‘మిస్ గోరఖ్‌పూర్’గా నిలిచిన ఆమె.. మోడల్‌గా పలు అవకాశాలు అందుకుంది. కొన్ని ప్రకటనల్లోనూ నటించింది. ఇలా హాయిగా సాగిపోతోన్న ఆమె జీవితంలో కరోనా ఒక్కసారిగా కల్లోలం సృష్టించింది. దీంతో ఆర్థికంగా కుటుంబానికి ఆసరా ఇవ్వడానికి చాయ్‌వాలీగా మారానంటోంది సిమ్రన్.
‘నాన్న ప్రైవేటు ఉద్యోగి. తమ్ముడికి శారీరక, మానసిక సమస్యలున్నాయి. చిన్నతనం నుంచే కుటుంబ ఆర్థిక సమస్యల్ని దగ్గర్నుంచి గమనించిన నేను.. పెద్దయ్యాక నా కుటుంబాన్ని ఉన్నత స్థితిలో ఉంచాలనుకున్నా. అందుకే ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తయ్యాక మోడలింగ్ వైపు అడుగులేశా. ఈ క్రమంలోనే 2018లో మిస్ గోరఖ్‌పూర్ కిరీటం నన్ను వరించింది. ఆపై పలు యాడ్స్‌లోనూ అవకాశాలొచ్చాయి. ఇలా కెరీర్ ఓ గాడిలో పడుతోందన్న క్రమంలోనే కరోనా నా ఆశలపై నీళ్లు చల్లింది. చేసేది లేక చాలా రోజులు ఇంట్లోనే కూర్చోవాల్సి వచ్చింది. ఆఖరికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగంలో చేరాను. అక్కడా నెలనెలా జీతం అందక ఇబ్బందులు పడ్డా. అదే సమయంలో ఎంబీఏ చాయ్‌వాలా ప్రఫుల్ల బిలోరే, గ్రాడ్యుయేట్ చాయ్‌వాలీ ప్రియాంక గుప్తా గురించి చదివా. వాళ్ల స్ఫూర్తితోనే టీ వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా గోరఖ్‌పూర్ యూనివర్సిటీ రాణీ లక్ష్మీబాయి హాస్టల్‌కు చేరువలో ‘మోడల్ చాయ్‌వాలీ’ పేరుతో టీకొట్టు ప్రారంభించా. ప్రస్తుతం నా వ్యాపారానికి మంచి ఆదరణ లభిస్తోంది. చాలామంది నన్ను ప్రశంసిస్తున్నారు.. ప్రోత్సహిస్తున్నారు..’ అంటోందీ గోరఖ్‌పూర్ బ్యూటీ.
‘బీటీసీ’ చాయ్‌వాలీ - సృష్టి వర్మ
కొందరు వెనకా ముందూ ఆలోచించకుండా.. ‘ఇంత చదువు చదివింది టీకొట్టు పెట్టడానికా?’ అనేస్తుంటారు. తనకూ ఇలాంటి హేళనలు ఎదురయ్యాయంటోంది లక్నో అలీగంజ్‌కు చెందిన సృష్టి వర్మ. తండ్రి మరణంతో కుటుంబానికి ఆర్థికంగా చేయూతనందించాలని నిర్ణయించుకున్న ఆమె.. బేసిక్ ట్రైనింగ్ సర్టిఫికెట్ (బీటీసీ) కోర్సు పూర్తయ్యాక.. ఇదే పేరుతో ఓ టీ స్టాల్ ప్రారంభించింది.
‘బీఎస్సీ మ్యాథ్స్ చేశాక బీటీసీ కోర్సు పూర్తిచేశా. CTET ప్రిలిమినరీ, జూనియర్ పరీక్షల్లోనూ అర్హత సాధించా. నాన్న పోయాక చదువుకుంటూనే కుటుంబానికి అండగా ఉండాలనుకున్నా. అందుకే బీటీసీ పూర్తయ్యాక 2019లో ఇదే పేరుతో టీస్టాల్ ప్రారంభించా. నేను ఎంచుకున్న మార్గం చూసి చాలామంది నన్ను ఎగతాళి చేశారు.. కానీ దీన్ని నేను నామోషీగా భావించలేదు. ఉదయం కొద్దిసేపు, సాయంత్రం నుంచి రాత్రి వరకు స్టాల్ నడుపుతున్నా. పగలంతా సివిల్స్‌కు సన్నద్ధమవుతున్నా. ప్రస్తుతం నా వృత్తి పట్ల నేను పూర్తి సంతృప్తితో ఉన్నా..’ అంటోంది సృష్టి.
‘పీజీ’ చాయ్‌వాలీ - రాధా యాదవ్
కరోనా సమయంలో చాలామందిలాగే తానూ ఉద్యోగం కోల్పోయింది జార్ఖండ్‌లోని దియోఘర్‌కు చెందిన రాధా యాదవ్. ఆ సమయంలో కుటుంబాన్ని ఆర్థికంగా గట్టెక్కించడానికి టీస్టాల్ ప్రారంభించిందామె. పీజీ పూర్తిచేసిన ఆమె అదే పేరుతో తన వ్యాపారాన్ని ప్రారంభించింది. ‘నాకు నలుగురు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. పీజీ పూర్తి కాగానే స్థానికంగా ఓ ప్రైవేట్ సంస్థలో పనిలో చేరాను. అయితే కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోయా. అయినా నిరాశ చెందకుండా ఇక్కడి ఓ మహిళా కళాశాల వద్ద టీస్టాల్ తెరిచాను. మొదట్లో పలు విమర్శల్ని, ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నా. అయినా ఓపికతో ముందుకు సాగా. క్రమంగా వ్యాపారంలో నిలదొక్కుకున్నా. ప్రస్తుతం రోజుకు రూ. 2 వేల దాకా సంపాదిస్తున్నా. మొదట్లో తక్కువ చేసి మాట్లాడిన వారే ఇప్పుడు ప్రశంసిస్తుంటే సంతోషంగా, సంతృప్తిగా అనిపిస్తోంది..’ అంటోంది రాధ.
‘నర్సింగ్’ చాయ్‌వాలీ - ప్రీతీ ఝా
చేసే వృత్తిలో సంతృప్తి, కట్టుకున్న భర్తతో సంతోషం.. ఈ రెండూ దక్కక టీస్టాల్ ప్రారంభించింది బిహార్‌లోని దర్భంగాకు చెందిన ప్రీతీ ఝా. నర్సింగ్ విద్యనభ్యసించిన ఆమె.. స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విధులు నిర్వర్తించేది. దీంతో ఆమెకొచ్చే జీతం తక్కువే! మరోవైపు చేసుకున్న భర్తతోనూ పలు వేధింపులు ఎదుర్కొందామె. దీంతో భర్త నుంచి విడిపోయి, నర్సింగ్ వృత్తిని వదిలేసి.. ‘నర్సింగ్ చాయ్‌వాలీ’గా కొత్త అవతారమెత్తిందామె.
‘ప్రస్తుతం నేను సింగిల్ మదర్‌ని. నా కూతురుకి ఉన్నత భవిష్యత్తును అందించాలనేదే నా ధ్యేయం. ఇదే లక్ష్యంతో నర్సింగ్ చాయ్‌వాలీ పేరుతో ఇక్కడి నిట్ కాలేజీకి దగ్గర్లో టీస్టాల్ తెరిచాను. ఐదు రకాల టీలు తయారుచేయడంలో నేను దిట్ట. ప్రస్తుతం నా సంపాదనతో నేను, నా కూతురు హ్యాపీగా ఉన్నాం..’ అంటూ తన గురించి పంచుకుంది ప్రీతి. ఆమె కథను ఇటీవలే ఓ ఫుడ్ బ్లాగర్ సోషల్ మీడియాలో పంచుకోగా అది కాస్తా వైరల్‌గా మారింది.
వీళ్లే కాదు.. గతంలో ‘గ్రాడ్యుయేట్ చాయ్‌వాలీ’ పేరుతో పట్నాకు చెందిన ప్రియాంక గుప్తా, ‘ఎంఏ ఇంగ్లిష్ చాయ్‌వాలీ’ పేరుతో కోల్‌కతాలో నివసించే టుక్‌టుకీ దాస్.. కూడా తమ డిగ్రీ/పీజీ పట్టాలతో టీస్టాల్ ప్రారంభించి వార్తల్లో నిలిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.