60 ఏళ్లకు బ్రేకప్.. ఇప్పుడేమో ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్!

ఈ రోజుల్లో 40 దాటగానే ఆరోగ్యం విషయంలో ఆపసోపాలు పడుతున్నారు చాలామంది. ఇక వ్యాయామమంటే మా వల్ల కాదనేస్తున్నారు. అలాంటి వారికి 64 ఏళ్ల హరా బ్రౌన్ (Harrah Brown) ఆదర్శంగా నిలుస్తోంది. ఆరు పదులు దాటాకే వ్యాయామాన్ని తన జీవనశైలిలో భాగం చేసుకున్న ఆమె.. కేవలం నాలుగేళ్లలోనే ఫిట్‌గా, అందంగా మారిపోయింది.

Published : 23 Mar 2024 12:26 IST

(Photos: Instagram)

ఈ రోజుల్లో 40 దాటగానే ఆరోగ్యం విషయంలో ఆపసోపాలు పడుతున్నారు చాలామంది. ఇక వ్యాయామమంటే మా వల్ల కాదనేస్తున్నారు. అలాంటి వారికి 64 ఏళ్ల హరా బ్రౌన్ (Harrah Brown) ఆదర్శంగా నిలుస్తోంది. ఆరు పదులు దాటాకే వ్యాయామాన్ని తన జీవనశైలిలో భాగం చేసుకున్న ఆమె.. కేవలం నాలుగేళ్లలోనే ఫిట్‌గా, అందంగా మారిపోయింది. తన చుట్టూ ఉన్న వారికి ఫిట్‌నెస్‌ పాఠాలు చెబుతూ.. ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పేరుతెచ్చుకుంది. తన ఆహార, వ్యాయామ రహస్యాల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ప్రపంచమంతా పాపులారిటీ సంపాదించుకుంది. మరి, ఈ ఫిట్టెస్ట్‌ గ్రానీ ఆరోగ్య, ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..

హరాది అమెరికా. 60 ఏళ్ల దాకా అందరిలాగే సాధారణ జీవితాన్ని గడిపిందామె. ఎలాంటి ఆహార నియమాలకు కట్టుబడింది లేదు.. వ్యాయామమంటే ఎరుగదు. సుదీర్ఘ కాలంగా తన ప్రియుడితో కలిసి ఆనందంగా ఉన్న తరుణంలోనే ఉన్నట్లుండి ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ అభిప్రాయ భేదాలు ఇద్దరూ విడిపోయేందుకు దారితీశాయి. అలా 2019లో తన ప్రియుడి నుంచి విడిపోయి దూరంగా వచ్చేసిందామె. ఈ సమయంలోనే తీవ్ర ఒత్తిడిలోకి కూరుకుపోయానని చెబుతోంది హరా.

బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి..!

‘సుదీర్ఘ కాలంగా ప్రేమలో ఉన్న నేను పలు కారణాల రీత్యా ఆ బంధం నుంచి బయటికొచ్చా. దాంతో నా మనసు కకావికలమైంది. తీవ్ర మానసిక ఒత్తిడిలోకి కూరుకుపోయా. ఆందోళన నన్ను వెంటాడింది. ఈ జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు సింగిల్‌ బెడ్‌రూమ్‌ అపార్ట్‌మెంట్‌కి మకాం మార్చాను. నా పెంపుడు కుక్క, కొన్ని బట్టలు, అత్యవసరమైన వస్తువులు తప్ప నాతో ఏమీ తీసుకెళ్లలేదు. మనసు బాగోక తిండి సహించేది కాదు.. మద్యానికి బానిసనయ్యా.. ఎప్పుడూ నిద్ర మత్తులోనే గడిపేదాన్ని. దీంతో ఆరోగ్యం పాడైంది.. ఓ రోజు ఉదయాన్నే నా పెంపుడు కుక్కతో కాసేపు అలా బయటికి వెళ్లాను. అప్పుడే తీవ్ర అనారోగ్యం పాలై కింద పడిపోయా. ఆస్ప్రతులు, చికిత్సలంటూ మరికొన్నాళ్లు గడిచిపోయాయి. ఈ సమయంలోనే జీవితమంటే ఏంటో నాకు తెలిసొచ్చింది. చేజేతులారా నా జీవితాన్ని నేను పాడు చేసుకుంటున్నానేమో అనిపించింది. ఈ ఆలోచనే నా జీవితాన్ని మలుపుతిప్పింది. ఇదే 61 ఏళ్లలో నేను ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టేందుకు ప్రేరేపించింది..’ అంటోంది హరా.

బరువులెత్తడంతో మొదలుపెట్టి..!

మోడువారిపోయిన తన జీవితాన్ని తిరిగి గాడిలో పెట్టుకునేందుకు వ్యాయామాన్నే మార్గంగా ఎంచుకున్న హరా.. తన ఇంట్లోనే ఓ చిన్న సైజు జిమ్‌ను ఏర్పాటుచేసుకుంది. అందులో కొన్ని వ్యాయామ పరికరాల్నీ అమర్చుకుంది. చిన్న చిన్న బరువులెత్తే వ్యాయామాలు చేయడం ప్రారంభించింది. ఇలా ఓవైపు శారీరక ఫిట్‌నెస్‌ను పెంచుకుంటూనే.. మరోవైపు మానసిక దృఢత్వానికి, భావోద్వేగాల్ని అదుపు చేసుకోవడానికి యోగా, ధ్యానం.. వంటివి సాధన చేసిందామె.

‘వ్యాయామాలతోనే నా జీవితం నియంత్రణలోకి వచ్చింది. క్రమశిక్షణ, ధైర్యం, బలం, ఆత్మవిశ్వాసం అలవడ్డాయి. ఈ మార్పు క్రమంగా స్వీయ ప్రేమను పెంచింది. ఆరు పదుల వయసులోనూ అందంగా కనిపించాలన్న ఆసక్తిని నాలో రేకెత్తించింది. ఈ క్రమంలోనే ఆహారంలోనూ పలు మార్పులు చేర్పులు చేసుకున్నా. గతంలో నేను బానిసైన అనారోగ్యపూరిత ఆహారపుటలవాట్లను పూర్తిగా దూరం పెట్టేశా. 90/10 రూల్‌ పాటించడం మొదలుపెట్టా. ఇందులో భాగంగా 90 శాతం సంపూర్ణ పోషకాలు నిండిన ఆకుకూరలు, కాయగూరలు, ఆకుపచ్చని కాయగూరలు, చేపలు.. వంటి వాటికి ప్రాధాన్యమిచ్చా. ఇక మిగతా 10 శాతం నా మనసుకు నచ్చిన ఆహార పదార్థాల్ని మితంగా తీసుకోవడం మొదలుపెట్టా. ఇక బ్లూబెర్రీ, రాస్బెర్రీ, బాదం పాలు, పిస్తా, పీనట్ బటర్‌.. మొదలైన పదార్థాల్నీ మెనూలో చేర్చుకున్నా. ఇలా గత నాలుగేళ్లుగా నేను పాటిస్తోన్న ఈ లైఫ్‌స్టైల్‌ నియమాల వల్లే అందంగా, ఫిట్‌గా, తిరిగి యవ్వనంగా కనిపించగలుగుతున్నా.. మెనోపాజ్‌ కారణంగా నా పొట్ట చుట్టూ పేరుకొన్న కొవ్వు కూడా ఈ హెల్దీ లైఫ్‌స్టైల్‌ వల్లే కరిగిపోయింది..’ అంటోందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్.

ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్!

ఆరోగ్యకరమైన జీవనశైలితో తన జీవితాన్నే మార్చేసుకున్న హరా.. ఇవే చిట్కాలతో నలుగురిలోనూ స్ఫూర్తి నింపాలనుకుంది. ఈ ఆలోచనతోనే తాను పాటించే ఆరోగ్య, ఫిట్‌నెస్‌ రహస్యాల్ని.. చేసే వ్యాయామాల్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకోవడం మొదలుపెట్టింది. ఆరోగ్యకరంగా బరువు తగ్గడమెలా? బరువులెత్తే వ్యాయామాలతో ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయి? కొత్తగా వ్యాయామాలు ప్రారంభించే వారు గుర్తుంచుకోవాల్సిన అంశాలేంటి?.. ఇలా ఎన్నో విషయాల గురించి ఫొటోలు, వీడియోల రూపంలో మహిళలకు అవగాహన కల్పిస్తోందీ ఫిట్టెస్ట్‌ గ్రానీ. తన నాజూకైన శరీరాకృతితో, క్యూట్‌ స్మైల్‌తో కట్టిపడేస్తూ ‘వయసు కేవలం అంకె మాత్రమే!’ అని నిరూపిస్తోన్న ఆమె.. ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంది. ఇన్‌స్టాతో పాటు టిక్‌టాక్‌, యూట్యూబ్‌లోనూ వీడియోలు పోస్ట్‌ చేస్తోన్న ఈ బామ్మను.. ప్రస్తుతం ఇన్‌స్టాలో 1.85 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ప్రతికూల పరిస్థితులతో మోడువారిపోయిన తన జీవితాన్ని ఫిట్‌నెస్‌ రొటీన్‌తో తిరిగి గాడిలో పడేసుకున్న హరా జీవితం ఈ తరానికి ఆదర్శం అని చెప్పడం అతిశయోక్తి కాదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్