Pooja: ఆ నౌకలన్నీ ఆమె కనుసన్నల్లోనే..!

నలుగురితో నారాయణ అనకుండా విభిన్న కెరీర్‌ మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటారు కొందరు. తామేంటో నిరూపించుకొని తోటి వారికి మార్గదర్శకులు కావాలనుకుంటారు. కేరళకు చెందిన పూజా ఛతోత్‌ కూడా అచ్చం ఇలాగే ఆలోచించింది. పురుషాధిపత్యం రాజ్యమేలే నావికా రంగంలోకి అడుగుపెట్టాలనుకుంది.

Published : 21 Mar 2024 12:18 IST

(Photo: Twitter)

నలుగురితో నారాయణ అనకుండా విభిన్న కెరీర్‌ మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటారు కొందరు. తామేంటో నిరూపించుకొని తోటి వారికి మార్గదర్శకులు కావాలనుకుంటారు. కేరళకు చెందిన పూజా ఛతోత్‌ కూడా అచ్చం ఇలాగే ఆలోచించింది. పురుషాధిపత్యం రాజ్యమేలే నావికా రంగంలోకి అడుగుపెట్టాలనుకుంది. అనుకున్నది సాధించడమే కాదు.. దేశంలోనే తొలి, ఏకైక మహిళా షిప్‌ సర్వేయర్‌గానూ కీర్తి గడించింది. ఈ రంగంలోకి మరింతమంది మహిళలు రావడానికి మార్గం సుగమం చేసింది. ఈ నేపథ్యంలో ఈ సాగర కన్య గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

గోవాలో పుట్టి పెరిగిన పూజ కేరళలో స్థిరపడింది. ఆమెకు చిన్నతనం నుంచి సాహసాలు చేయడమంటే మక్కువ. ఇదే ఇష్టాన్ని తన కెరీర్‌లోనూ కొనసాగించాలనుకుందామె. ఈ క్రమంలోనే అందరూ ఎంచుకొనే సాధారణ వృత్తుల్ని కాకుండా మహిళలు అరుదుగా కనిపించే రక్షణ రంగంలోకి అడుగుపెట్టాలనుకున్నట్లు చెబుతోంది.

ఆమె తెగువ నచ్చింది!

‘చిన్నప్పుడు అమ్మానాన్నలతో కలిసి ఇండియన్ నేవల్ అకాడమీ నిర్వహించిన ఓపెన్‌ డే కార్యక్రమానికి హాజరయ్యా. అక్కడ ఒకే ఒక్క మహిళా డిఫెన్స్‌ ఆఫీసర్‌ ఉండడం గమనించా. అంతమంది పురుషులకు ఒంటి చేత్తో నాయకత్వం వహించిన ఆమె తెగువ నాకు నచ్చింది. అందుకే నేనూ ఇలాంటి అరుదైన వృత్తిలోనే కెరీర్‌ కొనసాగించాలని నిర్ణయించుకున్నా. సముద్రమంటే నాకు చాలా ఇష్టం. ఈ మక్కువ, ఆ మహిళా అధికారి నింపిన స్ఫూర్తితో నావికా రంగంలోకి అడుగుపెట్టాలనుకున్నా. నా నిర్ణయం చెబితే అమ్మానాన్నలు ముందు కాస్త తటపటాయించారు. కానీ మొండి పట్టుదలతో వారిని ఒప్పించా. ‘శక్తివంతమైన మార్గదర్శకులే ఈ ప్రపంచాన్ని మార్చగల సమర్థులు’ అన్న సిద్ధాంతాన్ని పసి వయసు నుంచే నమ్ముతూ వచ్చా. అలా నేనూ ఓ శక్తివంతమైన, సమర్థురాలైన మార్గదర్శకురాలిని కావాలనుకున్నా. ఈ పట్టుదలతోనే ‘నేవల్ ఆర్కిటెక్చర్‌-షిప్‌ బిల్డింగ్‌’లో డిగ్రీ పూర్తిచేశా. ఆపై నేవల్ ఆర్కిటెక్ట్‌గా ఉద్యోగమూ వచ్చింది. కానీ రోజంతా డెస్క్‌లోనే కూర్చొని పనిచేయడం బోరింగ్‌గా అనిపించేది. అందుకే ఇదే రంగంలో ఫీల్డ్‌ వర్క్‌ ఉద్యోగాల కోసం వెతుకుతుండగా ‘LR (Lloyd's Register)’ సంస్థ భారత్‌లో గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌కు తెరతీసింది. దానికి దరఖాస్తు చేసుకొని.. ఆ ప్రోగ్రామ్‌కు ఎంపికయ్యా..’ అంటూ తన కెరీర్‌ జర్నీ గురించి చెబుతోంది పూజ.

ఆ నౌకల బాధ్యత ఆమెదే!

ఇందులో ట్రైనింగ్‌ పూర్తిచేసుకొని పూర్తి స్థాయి గ్రాడ్యుయేట్‌ సర్వేయర్‌/షిప్‌ సర్వేయర్‌గా ఉద్యోగం సంపాదించుకుంది పూజ. ఇలా మన దేశంలో ఈ వృత్తిని ఎంచుకొన్న తొలి, ఏకైక మహిళా షిప్‌ సర్వేయర్ తనే కావడం విశేషం. ఇందులో భాగంగా.. రవాణా, సరకు రవాణా కోసం వినియోగించే నౌకల భద్రతపై సర్వే నిర్వహించడం, వాటి రక్షణను తనిఖీ చేయడం.. వంటి విధులు నిర్వర్తిస్తుంటుందీమె. అలాగే ఓడలు.. అంతర్జాతీయ నిబంధనలు, ఆయా పరిశ్రమల ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని, వాటిని ఉద్దేశించిన ప్రయోజనం కోసం అవి సురక్షితమైనవని, సముద్రయానానికి అనువుగా ఉన్నాయని నిర్ధరించడం.. షిప్‌ సర్వేయర్‌ బాధ్యతలు. గత రెండేళ్లుగా ఈ పదవిలో కొనసాగుతోన్న పూజ ఈ విధులన్నీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది.

‘షిప్‌ సర్వేయర్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టినప్పుడు కాస్త నెర్వస్‌గా ఫీలయ్యా. ఎందుకంటే ఈ వృత్తిలో నేనొక్కదాన్నే మహిళను కావడంతో అదోలా అనిపించేది. కానీ ఈ రంగంలో సహోద్యోగులు, ఉన్నతోద్యోగుల నుంచి నాకు లభించిన ప్రోత్సాహం నన్ను పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపించింది. షిప్‌ సర్వేయర్‌గా ముంబయి, కొచ్చి, గోవా, ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌.. వంటి రాష్ట్రాల తీర ప్రాంతాల్లో పనిచేశా. ఇలా వృత్తిలో భాగంగా వివిధ ప్రాంతాలు తిరగడం, అక్కడి సంస్కృతులు తెలుసుకోవడం మర్చిపోలేని అనుభూతుల్ని పంచుతోంది..’ అంటోన్న పూజ ఇలాంటి సవాళ్లతో కూడిన వృత్తిని ఎంచుకున్నప్పుడే మనమేంటో నిరూపించుకోగలమంటోంది. ఇలా తన ప్రతిభాపాటవాలతో ఈతరం అమ్మాయిలెందరికో ఆదర్శంగా నిలుస్తోంది పూజ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్