‘బ్రెడ్ ల్యాంప్స్’తో కోట్ల వ్యాపారం!

బ్రెడ్‌, పఫ్స్‌.. వంటి బేకింగ్‌ పదార్థాల్ని ఇష్టపడని వారుండరు. అయితే వాటి గడువు తేదీ ముగియగానే బయటపడేస్తుంటాం.. దానివల్ల ఆహార వృథా.. పర్యావరణానికీ నష్టం! ఈ రెండూ తప్పించాలనుకుంది జపాన్‌కు చెందిన....

Published : 14 Jun 2023 13:02 IST

(Photos: Instagram)

బ్రెడ్‌, పఫ్స్‌.. వంటి బేకింగ్‌ పదార్థాల్ని ఇష్టపడని వారుండరు. అయితే వాటి గడువు తేదీ ముగియగానే బయటపడేస్తుంటాం.. దానివల్ల ఆహార వృథా.. పర్యావరణానికీ నష్టం! ఈ రెండూ తప్పించాలనుకుంది జపాన్‌కు చెందిన యుకికో మొరిటా. తన సృజనాత్మకతకు మరింత పదునుపెట్టి వీటితో అందమైన ల్యాంప్‌షేడ్స్‌ రూపొందిస్తోంది. Pampshade పేరుతో తాను ప్రారంభించిన ఈ వ్యాపారం.. ఆమెకు కోట్ల సంపాదన తెచ్చిపెడుతోంది. బ్రెడ్‌పై తనకున్న ఇష్టమే ఈ విభిన్న మార్గాన్ని ఎంచుకునేలా చేసిందంటోన్న యుకికో బిజినెస్‌ జర్నీ ఇది!
యుకికోది జపాన్‌లోని కోబ్‌ నగరం. ఆమెకు చిన్న వయసు నుంచే బేకరీ పదార్థాలంటే మహా ఇష్టం. అందులోనూ బ్రెడ్‌ను మరింతగా ఇష్టపడి తినేది. అయితే బేకరీ నుంచి బ్రెడ్‌ కొనే క్రమంలో.. గడువు తేదీ ముగియడం, మరికొన్ని పాడైపోవడంతో.. అటు ఆహారం వృథా అవడంతో పాటు ఇటు పర్యావరణానికీ నష్టం వాటిల్లుతుందని గ్రహించిందామె. ఎలాగైనా దీన్ని తగ్గించాలనుకుంది.

అప్పుడు తట్టిన ఆలోచన!

మరోవైపు పాఠశాల దశ నుంచే కళలపై దృష్టి పెట్టింది యుకికో. ఈ క్రమంలో తన సృజనకు పదును పెడుతూ కొత్త కొత్త వస్తువులు రూపొందించేదామె. ఇలా ఆమె తయారుచేసిన వస్తువులతో స్కూల్లో ఎన్నో బహుమతులూ గెలుచుకుందీ యువ ఆర్టిస్ట్‌. ఇక ఈ మక్కువతోనే క్యోటో నగరంలోని ఆర్ట్స్‌ యూనివర్సిటీలో ‘ప్రింట్‌ మేకింగ్‌’ విభాగంలో గ్రాడ్యుయేషన్‌ చేసింది యుకికో. ఆపై అక్కడి ఓ బేకరీలో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తున్నప్పుడే బ్రెడ్‌ వృథాను తగ్గించాలనుకున్న తన ఆలోచన మరోసారి మదిలో మెదిలిందంటోందామె.
‘బేకరీలో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తున్నప్పుడు బ్రెడ్తో వివిధ ప్రయోగాలు చేసేవాళ్లం. దాంతో ఉపయోగకరమైన వస్తువులెన్నో రూపొందించేవాళ్లం. నిజానికి బ్రెడ్‌ను ఇలా కూడా ఉయోగించచ్చన్న విషయం నాకు అప్పుడే అర్థమైంది. ఇందులోనే ఇంకాస్త క్రియేటివ్‌గా ఆలోచిస్తుంటే.. ఈ ల్యాంప్‌షేడ్స్‌ ఐడియా నా మనసుకు తట్టింది. ఆలోచన కూడా కొత్తగా ఉండడంతో నచ్చింది. అంతే.. ప్రొసీడైపోయా..’ అంటోన్న యుకికా.. ఇందుకోసం 2016లో Pampshade పేరుతో వ్యాపారాన్ని మొదలుపెట్టింది.

‘బ్రెడ్‌ ల్యాంప్స్‌’ ఇలా!

ఇలా తాను తయారుచేస్తోన్న బ్రెడ్‌ ల్యాంప్స్‌ కోసం కావాల్సిన బ్రెడ్‌ను బేకరీల నుంచి సేకరిస్తోందామె. ఈ క్రమంలో గడువు తేదీ పూర్తైన, ఉపయోగించని.. వివిధ రకాల బ్రెడ్‌లను ఎంచుకుంటోందామె. అయితే ఇలా ఎక్స్‌పైరీ అయిపోయిన వాటిని ఉపయోగిస్తే.. అవి పాడైపోయి బూజు పడతాయి కదా.. అని సందేహం రావచ్చు. కానీ అంతకంటే ముందే అవి పాడవకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నానంటోందీ బ్రెడ్‌ ఆర్టిస్ట్.

‘బేకరీల నుంచి సేకరించిన విభిన్న రకాల బ్రెడ్‌లను ముందుగా ఓ ప్రత్యేకమైన గదిలో పూర్తిగా ఎండబెడుతున్నా. దీనిపై పారదర్శకంగా ఉండే రెజిన్ పెయింట్‌తో కోట్‌ వేస్తా. ఆపై యాంటీ-బ్యాక్టీరియల్‌, యాంటీ-ఫంగల్‌ ప్రిజర్వేటివ్స్‌తో మరో కోటింగ్‌ వేస్తాను. ఒక్కో బ్రెడ్‌కు ఈ ప్రక్రియలు పలుమార్లు రిపీట్‌ చేస్తుంటా. ఈ పదార్థాలన్నీ తేమను లోపలికి వెళ్లనివ్వకుండా కాపాడతాయి. తద్వారా బ్రెడ్‌ ఏళ్ల పాటు తాజాగా ఉంటుంది. ఆపై ప్రత్యేకమైన కట్టర్‌తో బ్రెడ్‌ మధ్య భాగాన్ని తొలిచి.. వాటిలో LED బల్బుల్ని అమర్చుతా. తిరిగి ప్రిజర్వేటివ్స్‌తో మరో కోటింగ్‌ వేస్తా. అయితే ఇలా నేను ఉపయోగించే ఈ పదార్థాలన్నీ విషపూరితమైనవి కాకపోయినా.. పెంపుడు జంతువులు, పిల్లలకు వీటిని దూరంగా ఉంచడం ముఖ్యం. అలాగే బాత్రూమ్స్‌.. వంటి తేమగా ఉండే ప్రదేశాల్లో వీటిని పెట్టకూడదు..’ అంటూ చెప్పుకొచ్చింది యుకికో.

ధర తక్కువ.. మన్నిక ఎక్కువ!

ప్రస్తుతం ఈ బ్రెడ్‌ ల్యాంప్స్‌లో బ్యాటరీతో నడిచేవి, నేరుగా సాకెట్‌కి కనెక్ట్‌ చేసుకొని ఉపయోగించేవి.. ఇలా రెండు రకాలైనవి దొరుకుతున్నాయంటోంది యుకికో. అంతేకాదు.. కొన్ని రకాల బ్రెడ్‌ ల్యాంప్స్‌పై పూలతో హంగులద్దడం, షాండ్లియర్స్‌ తయారుచేయడం.. వంటివీ చేస్తోందామె. మరోవైపు నాన్‌ బ్రెడ్‌తో గడియారాలూ రూపొందిస్తోందామె. ఇలా ఈమె తయారుచేసే ల్యాంప్స్‌ కొత్తగా ఉండడంతో వినియోగదారుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. పైగా ఇవి సరసమైన ధరల్లోనే లభిస్తుండడంతో దేశ, విదేశీయులు వీటిని కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఇది కోట్ల వ్యాపారంగా వృద్ధి చెందిందని చెబుతోందీ జపనీస్‌ బ్రెడ్‌ లవర్‌. ప్రస్తుతం తన బ్రెడ్ ల్యాంప్స్‌ని స్వదేశంతో పాటు.. ఉత్తర అమెరికా, యూరప్‌, చైనా, హాంకాంగ్‌.. వంటి 15 దేశాలలో విక్రయిస్తోంది యుకికో.

‘బ్రెడ్‌ వృథా చేయడం నాకు ఇష్టముండదు. దీనివల్ల పర్యావరణానికీ నష్టమే! అందుకే బ్రెడ్‌తో ఈ విభిన్న ల్యాంప్స్‌ తయారుచేస్తున్నా. ఆఖరికి LED బల్బు అమర్చడానికి తొలిచిన బ్రెడ్‌నూ వృథా చేయట్లేదు. దాంతో బ్రెడ్‌ క్రంబ్స్‌ తయారుచేసి స్వీట్లలో ఉపయోగిస్తున్నాం. అయితే ఈ బ్రెడ్‌ ల్యాంప్స్‌ చాలా సున్నితమైనవి. గాజుతో తయారుచేసిన ల్యాంప్స్‌ మాదిరిగానే వీటినీ జాగ్రత్తగా ఉపయోగించాలి. లేదంటే అవి పగిలిపోతాయి..’ అంటోన్న యుకికో.. డ్యామేజ్‌ అయిన బ్రెడ్‌ ల్యాంప్స్‌ని తిరిగి సరిచేసే సదుపాయం తమ వద్ద ఉందని చెబుతోంది. ప్రస్తుతం ఓవైపు వ్యాపారవేత్తగా రాణిస్తూనే.. మరోవైపు తన కూతురి ఆలనా పాలనా చూస్తోందామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్