Kareena Kapoor : అప్పుడు జుట్టు బాగా రాలేది.. ఇలా కంట్రోలైంది!

పిల్లలు పుట్టాక మహిళల శరీరంలో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. జుట్టు ఎక్కువగా రాలిపోవడం కూడా వీటిలో ఒకటి. అయితే చక్కటి పోషకాహారంతో పాటు పలు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడచ్చంటోంది బాలీవుడ్‌ అందాల.....

Published : 23 May 2022 17:51 IST

(Photos: Instagram)

పిల్లలు పుట్టాక మహిళల శరీరంలో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. జుట్టు ఎక్కువగా రాలిపోవడం కూడా వీటిలో ఒకటి. అయితే చక్కటి పోషకాహారంతో పాటు పలు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడచ్చంటోంది బాలీవుడ్‌ అందాల అమ్మ కరీనా కపూర్‌. ఇద్దరు పిల్లల తల్లైన ఆమె.. రెండుసార్లు ప్రసవానంతరం జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంది. దీన్నుంచి బయటపడే క్రమంలో తాను పాటించిన చిట్కాలు, అనుసరించిన రొటీన్‌ను ఇటీవలే ఓ సందర్భంలో పంచుకుంది బెబో. మరి, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

గర్భిణిగా ఉన్న సమయంలో తీసుకునే పోషకాహారం విషయంలో ప్రముఖ న్యూట్రిషనిస్ట్‌ రుజుతా దివేకర్‌ సలహాలు, సూచనలు తీసుకొని పాటించింది బెబో. ఇక 2017లో తైమూర్‌, 2021లో జెహంగీర్‌.. అనే ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చిన ఆమె.. ప్రసవానంతరం ఎదురైన సమస్యల్ని దూరం చేసుకోవడానికీ రుజుత చిట్కాల్నే పాటించింది. ఈ క్రమంలోనే ప్రసవం తర్వాత తానెదుర్కొన్న జుట్టు రాలే సమస్యను ఎలా అధిగమించిందో ఇటీవలే ఓ సందర్భంలో ఇలా పంచుకుందీ క్యూట్‌ మామ్‌.

మర్దనతో మేలు!

చాలామంది అమ్మల్లాగే నేనూ ప్రసవానంతరం జుట్టు రాలే సమస్యను ఎక్కువగా ఎదుర్కొన్నా. దీన్నుంచి బయటపడడానికి రాత్రి పడుకునే ముందు నూనెతో కుదుళ్లు, వెంట్రుకల్ని మర్దన చేసుకునేదాన్ని. ఇక ఉదయాన్నే తలస్నానం చేసేదాన్ని. కుదుళ్ల ఆరోగ్యానికి, దృఢత్వానికి మసాజ్‌ మేలు చేస్తుంది. అలాగే జుట్టును కండిషన్‌ చేయడం, సరైన షాంపూ ఉపయోగించడం కూడా ముఖ్యమే. ఇతర జుట్టు సమస్యల్ని నివారించుకోవడానికీ ఈ చిట్కాలే చక్కటి పరిష్కారం. మా కుటుంబ సభ్యులు కూడా పదే పదే ఇదే విషయం చెబుతుంటారు.

పోషకాహారం కూడా!

ప్రసవానంతరం మనం తీసుకునే పోషకాహారం కూడా చర్మ సౌందర్యం, జుట్టు సంరక్షణను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా విటమిన్లు ఎక్కువగా ఉండే కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు.. వంటివి అధికంగా తీసుకోవాలి. అలాగే నెయ్యి.. వంటి ఆరోగ్యకరమైన కొవ్వుల్ని రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. కొబ్బరి, నల్ల నువ్వులు జుట్టు రాలడాన్ని అరికట్టి.. ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోకుండా కాపాడతాయి.

సీరం వెంటే ఉంచుకుంటా!

ఇక నా జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సీరం పాత్ర కూడా ఉంది. ఎందుకంటే షూటింగ్స్‌లో భాగంగా వేసే విభిన్న హెయిర్‌స్టైల్స్‌, వాడే ఉత్పత్తుల కారణంగా జుట్టు సహజత్వాన్ని కోల్పోతుంది. గడ్డిలాగా, పొడిగా మారిపోతుంది. ఇలాంటప్పుడు మధ్యమధ్యలో హెయిర్‌ సీరం వాడుతుంటా. నాణ్యమైన సీరం జుట్టుకు దృఢత్వాన్ని, సహజ మెరుపును అందిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్