9 గంటల్లోనే 140 భాషల్లో పాటలు పాడేసింది!

మూడేళ్ల ప్రాయంలోనే సంగీతంపై మక్కువ పెంచుకుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో భారతీయ భాషలతో మొదలుపెట్టి విదేశీ భాషల్లోనూ పాటలు పాడడం నేర్చుకుంది. అలుపెరగని తన గాన ప్రతిభతో ప్రపంచ రికార్డులు సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకుంది 18 ఏళ్ల సుచేతా సతీష్‌.

Published : 08 Jan 2024 18:16 IST

(Photos: Instagram)

మూడేళ్ల ప్రాయంలోనే సంగీతంపై మక్కువ పెంచుకుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో భారతీయ భాషలతో మొదలుపెట్టి విదేశీ భాషల్లోనూ పాటలు పాడడం నేర్చుకుంది. అలుపెరగని తన గాన ప్రతిభతో ప్రపంచ రికార్డులు సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకుంది 18 ఏళ్ల సుచేతా సతీష్‌. భారత సంతతికి చెందిన ఈ అమ్మాయి ఇటీవల ఓ సంగీత విభావరిలో 9 గంటల పాటు నిర్విరామంగా 140 భాషల్లో పాటలు పాడింది. ఈ క్రమంలోనే ఒక సంగీత కచేరిలో ఎక్కువ భాషల్లో పాటలు పాడిన మహిళగా గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించింది. ఈ నేపథ్యంలో ఈ ట్యాలెంటెడ్‌ సింగర్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!

పాటకు ‘గిన్నిస్‌’ దాసోహం!

గతేడాది నవంబర్‌ చివరి వారంలో దుబాయ్‌ వేదికగా ‘COP 28’ సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా అక్కడి ‘ఇండియన్‌ కాన్సులేట్‌ ఆడిటోరియం’లో వాతావరణ మార్పులపై అవగాహన కల్పించే ముఖ్యోద్దేశంతో ఓ సంగీత కచేరీని ఏర్పాటుచేశారు. ఇందులో పాల్గొన్న సుచేతా సతీష్‌.. 9 గంటల పాటు శ్రమించి 140 భాషల్లో పాటలు పాడింది. ఇలా ఈ కచేరీలో భాగంగా 140 దేశాలకు చెందిన ప్రతినిధుల సమక్షంలో పాటలు ఆలపించిందీ సింగర్‌. తద్వారా ఎంతోమంది ప్రముఖుల ప్రశంసలు అందుకోవడంతో పాటు.. ప్రపంచ రికార్డు కూడా సృష్టించింది. ఒక కచేరీలో ఎక్కువ భాషల్లో పాటలు పాడిన మహిళగా గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించింది సుచేత. అయితే దీనికి సంబంధించిన గుర్తింపు పత్రాన్ని ఇటీవలే అందుకున్న ఆమె.. ఈ శుభవార్తను తాజాగా సోషల్‌ మీడియాలో పంచుకుంటూ మురిసిపోయింది.

‘9 గంటల్లో 140 భాషల్లో పాటలు పాడి.. మరోసారి గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించడం సంతోషంగా ఉంది. ఈ జర్నీలో నన్ను ప్రోత్సహించిన, నాకు మద్దతిచ్చిన వారందరికీ ధన్యవాదాలు!’ అని తెలిపిందీ యువ గాయని. సరిగ్గా రెండేళ్ల క్రితం 120 భాషల్లో పాటలు పాడి.. ఆ సమయంలోనూ గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించింది సుచేత.

మూడేళ్ల ప్రాయం నుంచే!

కేరళలోని కన్నూరుకు చెందిన సుచేత ప్రస్తుతం తన తల్లిదండ్రులతో కలిసి దుబాయ్‌లో స్థిరపడింది. ఆమెకు రెండు నెలల వయసున్నప్పుడు తన తల్లిదండ్రులు కుటుంబంతో సహా ఇక్కడికొచ్చి స్థిరపడ్డారు. ఆమె తండ్రి సతీష్‌ డెర్మటాలజిస్టు కాగా, తల్లి సుమిత ‘అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ దుబాయ్‌’లో లెక్చరర్‌గా పనిచేశారు. ఆమెకు సంగీతంలోనూ ప్రావీణ్యముంది. సంగీతంపై ఆసక్తితో, అమ్మానాన్నల ప్రోత్సాహంతో మూడేళ్ల ప్రాయంలోనే కర్ణాటక సంగీతం నేర్చుకుంది సుచేత. నాలుగేళ్ల వయసులో ధైర్యంగా స్టేజ్ ఎక్కి పాటలు ఆలపించింది. ఎనిమిదేళ్ల వయసు నాటికే హిందుస్థానీ సంగీతంలో పట్టు సాధించింది. అంతేకాదు.. తన మాతృభాష మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ, బెంగాలీ.. తదితర భారతీయ భాషలు నేర్చుకుని ఆ భాషల్లోనూ పాటలు ఆలపించడం అలవాటు చేసుకుంది. ఓ కార్యక్రమంలో భాగంగా ‘పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ..’ అనే తెలుగు పాట పాడి అందరిచేతా శెభాష్ అనిపించుకుందీ సింగింగ్‌ సెన్సేషన్.

150.. నా తర్వాతి టార్గెట్!

ప్రస్తుతం భారతీయ భాషలతో కలిపి మొత్తం 140 భాషల్లో ఎంతో అలవోకగా, శ్రావ్యంగా పాటలు ఆలపిస్తోంది సుచేత. ‘నేను ఇంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం వెనక మా అమ్మానాన్నల సహకారం, ప్రోత్సాహం ఎంతగానో ఉన్నాయి. దుబాయి వివిధ భాషలు, సంస్కృతుల సమాహారం. ఇక్కడ భారతీయులతో పాటు ఇతర దేశాల ప్రజలు పెద్ద సంఖ్యలో నివాసముంటున్నారు. ఇక్కడ ఉండే నా స్నేహితులు, సన్నిహితుల సహకారంతో పలు విదేశీ భాషలపై పట్టు పెంచుకున్నాను. నేను పాడే పాటల్లో ఏవైనా లోపాలున్నా, సరిగ్గా పలకకపోయినా వారు సరిచేసేవారు. సాధారణంగా నేను ఒక పాట నేర్చుకోవడానికి దాదాపు రెండు గంటలు పడుతుంది. ఒకవేళ అందులోని పదాలు పలకడానికి సులభంగా ఉంటే ఇంకా త్వరగా నేర్చేసుకుంటా. పాట మరీ చిన్నదైతే అరగంట చాలు.. ఇక ఫ్రెంచ్, హంగేరియన్, జర్మన్ భాషలు నాకు కాస్త కష్టంగా అనిపించాయి. ఆ భాషల్లో పాటలు నేర్చుకోవడానికి మాత్రం రెండు మూడు రోజులు పట్టేది. చిన్నప్పుడు కర్ణాటక, హిందుస్థానీ సంగీతంలో పట్టు సాధించడం వల్లే విదేశీ భాషల్ని సులభంగా పలకగలుగుతున్నా.. ప్రస్తుతం 140 భాషల్లో పాడగలిగే సామర్థ్యాన్ని పెంచుకున్న నేను.. 150 భాషల్లో పాడాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా.. దీన్ని అధిగమించడానికే ప్రస్తుతం సాధన చేస్తున్నా..’ అంటోంది సుచేత.

పాటలతో ప్రపంచ రికార్డులు!

దాదాపు ఆరేళ్ల క్రితం దుబాయిలో నిర్వహించిన ఓ సంగీత కచేరీలో నిరంతరాయంగా 6:15 గంటల పాటు 102 భాషల్లో పాటలు పాడి రెండు ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకుందీ యంగ్‌ సింగర్‌. ఇందులో భాగంగా ఒకే సంగీత కచేరీలో ఎక్కువ భాషల్లో పాటలు పాడిన రికార్డు ఒకటైతే.. సుదీర్ఘ సమయం పాటు (6:15 గంటల పాటు) పాటలు పాడిన బాలికగా రెండో ప్రపంచ రికార్డును తన సొంతం చేసుకుంది సుచేత. ఇక 2021లో 7.30 గంటల వ్యవధిలోనే 120 భాషల్లో పాడి.. తన గిన్నిస్‌ రికార్డును తానే బద్దలుకొట్టింది. ఇక ఇప్పుడు 140 భాషల్లో మరోసారి గిన్నిస్‌కెక్కిన ఈ యువ గాయని గాన ప్రతిభకు గుర్తుగా ‘ప్రపంచ బాల మేధావి’ బిరుదు కూడా అందుకుంది.

సేవలోనూ ముందే..!

విదేశీ భాషల్లోనూ అలవోకగా పాటలు పాడుతూ సంగీత ప్రియుల్ని అబ్బురపరుస్తోన్న సుచేత.. సామాజిక సేవలోనూ ముందుంది. 2018లో కేరళలో వరదలు సంభవించినప్పుడు తన స్నేహితులు, సన్నిహితులతో కలిసి రూ.5 లక్షల విరాళాలు సేకరించి సీఎం సహాయనిధికి పంపింది. ఇక కరోనా సమయంలో వైరస్‌పై అవగాహన కల్పిస్తూ 22 భారతీయ భాషలతో పాటు మొత్తం 32 భాషల్లో పాటలు విడుదల చేసిందీ సూపర్‌ సింగర్‌. ఇక ఇటీవలే నిర్వహించిన సంగీత విభావరితో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు.. ఇలా సమకూరిన నిధుల్ని సామాజిక కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు చెబుతోంది సుచేత. ప్రముఖ బాలీవుడ్‌ గాయని శ్రేయా ఘోషల్‌ స్ఫూర్తితో తానూ భవిష్యత్తులో ప్లేబ్యాక్‌ సింగర్‌ కావాలని కలలు కంటోన్న ఈ యువ గాయని.. వృత్తిపరంగా సైకాలజిస్ట్‌గా స్థిరపడాలనుకుంటోందట!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్