Dasara: పండక్కి ఫ్యాషనబుల్‌గా..!

దసరా అంటేనే దాండియా, గర్బా నృత్యాలే గుర్తొస్తాయి. సాధారణంగా ఇవి ప్రదర్శించే మహిళలు లెహెంగా, చీరలు.. వంటి సంప్రదాయ దుస్తులు ధరించడం చూస్తుంటాం.

Published : 17 Oct 2023 12:21 IST

(Photos: Instagram)

దసరా అంటేనే దాండియా, గర్బా నృత్యాలే గుర్తొస్తాయి. సాధారణంగా ఇవి ప్రదర్శించే మహిళలు లెహెంగా, చీరలు.. వంటి సంప్రదాయ దుస్తులు ధరించడం చూస్తుంటాం. అయితే ఇందులోనూ కొత్తదనం కోరుకునే ఈతరం అమ్మాయిలు ట్రెడిషనల్‌కు కాస్త మోడ్రన్‌ టచ్‌ ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు. వారి అభిరుచుల మేరకే డిజైనర్లూ సరికొత్త ఇండో-వెస్ట్రన్‌ అవుట్‌ఫిట్స్‌ని మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. మరి, ఈ దసరాకి అటు ట్రెడిషనల్‌తో పాటు ఇటు మోడ్రన్‌ లుక్‌ని అందించే ఆ ఫ్యాషన్లేంటో తెలుసుకుందాం రండి..

‘షరారా’తో స్టైలిష్‌గా!

ఈమధ్య కాలంలో పండగైనా, వేడుకైనా షరారా ఫ్యాషన్‌ను ఎంచుకునే తారల్ని చాలామందిని చూస్తున్నాం. ఇక ఈ తరం అమ్మాయిలూ వీరినే ఫాలో అయిపోతున్నారు. అటు సంప్రదాయబద్ధంగా కనిపిస్తూనే.. ఇటు మోడ్రన్‌ లుక్‌ని అందించే ఈ అవుట్‌ఫిట్‌తో దసరా పండక్కీ సందడి చేయచ్చంటున్నారు నిపుణులు. కాస్త స్టైలిష్‌గా మెరిసిపోవాలనుకునే వారు షరారాకు.. షార్ట్‌ క్రాప్‌టాప్‌ను జత చేసి.. దానిపై మ్యాచింగ్‌గా ఉండే పొడవాటి జాకెట్‌ను ధరిస్తే లుక్‌ అదిరిపోతుంది. ఇలా వద్దు క్లాసీగా కనిపించాలనుకునే వారు.. నడుం బయటికి కనిపించకుండా పొడవాటి క్రాప్‌టాప్‌ను ఎంచుకోవచ్చు. దీనికీ లాంగ్‌ జాకెట్‌ లేదంటే మ్యాచింగ్‌ దుపట్టాను జత చేస్తే ట్రెడిషనల్‌ కమ్‌ ట్రెండీ అవుట్‌ఫిట్‌ మీదే అవుతుంది. ఇక ఈ షరారాలో అటు దాండియా, ఇటు గర్బా నృత్యాల్నీ సునాయాసంగా చేసేయచ్చు.


చోళీకి బదులు జాకెట్!

ప్రత్యేక సందర్భమంటే చాలు.. లెహెంగానే మనకు గుర్తొస్తుంది. అయితే సాధారణంగా చోళీతోనే లెహెంగా లుక్‌ పూర్తవుతుందనుకుంటారు చాలామంది. కానీ దీనివల్ల పూర్తిస్థాయి ట్రెడిషనల్‌ లుక్‌ సొంతమవుతుంది. కాబట్టి లెహెంగాలోనూ మోడ్రన్‌గా కనిపించాలనుకునే అమ్మాయిలు చోళీకి బదులు జాకెట్‌ను జత చేసుకోవచ్చంటున్నారు డిజైనర్లు. లెహెంగాకు మ్యాచింగ్‌గా ధరించే బ్లౌజ్‌/క్రాప్‌టాప్‌ తరహాలోనే నడుం వరకు ఉండేలా ఓ జాకెట్‌ని డిజైన్‌ చేయించుకోవచ్చంటున్నారు. క్రాప్‌టాప్‌ పైనుంచి దీన్ని ధరించి.. మధ్యలో ఒకే ఒక బటన్‌తో బంధించేస్తే.. ఇండో-వెస్ట్రన్‌ లుక్‌ అదిరిపోతుంది. ఇక దాండియా, గర్బా నృత్యాల్లో పాల్గొనే అమ్మాయిలైతే.. మిర్రర్‌ ఎంబ్రాయిడరీతో డిజైన్‌ చేసిన జాకెట్‌ను ఎంచుకుంటే.. సందర్భానికి తగినట్లుగా మెరిసిపోవచ్చు.


కాఫ్తాన్‌ సొగసులు!

ఓవర్‌సైజ్‌డ్‌ ఫ్యాషన్‌.. ఇప్పుడిదే ట్రెండు! పండగలు, పెళ్లిళ్లు వంటి ట్రెడిషనల్‌ అకేషన్స్‌ దగ్గర్నుంచి నైట్‌ పార్టీస్‌ వంటి మోడ్రన్‌ అకేషన్స్‌ దాకా.. వదులైన దుస్తులు ఎంచుకోవడానికి ఈ తరం అమ్మాయిలు మక్కువ చూపుతున్నారు. అలాంటి అవుట్‌ఫిట్స్‌లో కాఫ్తాన్‌ ముందు వరుసలో ఉంటుంది. ఈ దసరాకూ ఇది సరైన ఎంపిక అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో పొడవాటి కాఫ్తాన్‌ గౌన్లు, షరారాపై మ్యాచింగ్‌గా కాఫ్తాన్‌ క్రాప్‌టాప్స్‌, వింటేజ్‌ స్టైల్‌ కాఫ్తాన్‌ డ్రస్‌.. ఇలా మీకు నచ్చిన, మీ శరీరాకృతికి నప్పిన స్టైల్‌ని ఎంచుకోవచ్చు. ఇక ఈ డ్రస్‌కు నడుం భాగంలో లెదర్‌ లేదా మ్యాచింగ్‌ క్లాత్‌ బెల్టుతో హంగులద్దితే.. మరింత స్టైలిష్‌ లుక్ సొంతమవుతుంది. ఇక ఈ తరహా దుస్తులకు ట్రెడిషనల్‌ జ్యుయలరీ కంటే.. సిల్వర్‌ జ్యుయలరీ బాగా మ్యాచ్‌ అవుతుంది. అందులోనూ మెడను ఖాళీగా వదిలేసి.. చెవులకు భారీ ఇయర్‌రింగ్స్‌తో హంగులద్దితే పండగ వేడుకల్లో మీరే సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలవచ్చు.


ట్రెండీ బనారసీ!

ట్రెడిషనల్‌ అకేషన్స్‌కి బనారసీ చీరలు, లెహెంగాల్ని ఎంచుకుంటారు చాలామంది. చూడ్డానికి అచ్చం పట్టులా కనిపించే ఈ మెటీరియల్‌తో ఫ్యాషనబుల్‌ అవుట్‌ఫిట్స్‌నీ డిజైన్‌ చేయించుకోవచ్చంటున్నారు నిపుణులు. బనారసీ సల్వార్‌ డ్రస్‌, పెప్లమ్‌ క్రాప్‌టాప్‌-ట్రౌజర్‌, క్రాప్‌టాప్‌-ప్యాంట్‌ ఒకే సెట్‌గా డిజైన్‌ చేయించుకున్న కో-ఆర్డ్‌ సెట్‌.. ఇలా మనకు నచ్చినట్లుగా, నప్పినట్లుగా బనారసీని ట్రెండీగా తీర్చిదిద్దుకోవచ్చు. అలాగే టాప్‌-బాటమ్‌ ఒకే రంగులో ఉండేలా, నప్పితే కాంట్రాస్ట్‌ కలర్స్‌లో మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ చేస్తే లుక్‌ అదిరిపోతుంది. దీనికి మ్యాచింగ్‌గా సిల్వర్‌ ఆర్టిఫిషియల్‌ జ్యుయలరీని జత చేస్తే.. మరింత ట్రెండీగా మెరిసిపోవచ్చు.


బాంధనీతో ఫినిషింగ్‌ టచ్!

దసరా సందర్భంగా చేసే దాండియా, గర్బా నృత్యాల కోసం చాలామంది బాంధనీ దుస్తుల్ని ఎంచుకోవడం చూస్తుంటాం. ఈ క్రమంలో పూర్తిగా బాంధనీ ప్రింటెడ్‌ శారీ/లెహెంగా ఎంచుకుంటే అందులో కొత్తేముంది అనుకునేవారు.. మీరు ఎంచుకున్న దుస్తులకు బాంధనీతో ఫినిషింగ్‌ టచ్‌ ఇస్తే సరిపోతుంది. ఈరోజుల్లో సింప్లిసిటీని కోరుకునే అమ్మాయిలు ఏ సందర్భమైనా కుర్తీ-పలాజో, కుర్తీ-ట్రౌజర్‌.. వంటివి ఎంచుకుంటున్నారు. దాని పైకి కాంట్రాస్ట్‌ కలర్‌లో ఉండే బాంధనీ దుపట్టాను ఎంచుకుంటే సింప్లీ సూపర్బ్‌ అనిపించుకోవచ్చు. లేదంటే బాంధనీ ప్రింటెడ్‌ టాప్‌ లేదా బాటమ్‌ని ఎంచుకునే వారు.. మిగతా రెండింటినీ ప్లెయిన్‌గా ఉండేలా చూసుకుంటే లుక్‌ హైలైట్‌ అవుతుంది. ఈ తరహా అవుట్‌ఫిట్‌కూ సింపుల్‌గా ఉండే సిల్వర్‌/ఆక్సిడైజ్‌డ్‌ ఆభరణాలు అదనపు హంగులద్దుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్