కొలీగ్‌తో చనువు.. నా భర్తకు నచ్చట్లేదు..!

గత కొన్ని రోజులుగా నా సహోద్యోగితో చనువుగా ఉంటున్నాను. మేము తరచుగా కాఫీ, షాపింగ్‌కు వెళుతుంటాం. అయితే నా భర్తకు మా స్నేహం గురించి తెలిసిన తర్వాత తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నాడు. అది చూస్తుంటే ‘నేను ఆయన్ని మోసం చేస్తున్నానా’ అన్న అనుమానం కలుగుతోంది.

Published : 25 Jul 2023 13:17 IST

నా వయసు 32 సంవత్సరాలు. పెళ్లై ఐదేళ్లవుతోంది. గత కొన్ని రోజులుగా నా సహోద్యోగితో చనువుగా ఉంటున్నాను. మేము తరచుగా కాఫీ, షాపింగ్‌కు వెళుతుంటాం. అతనికి పెళ్లైంది. మూడేళ్ల బాబు కూడా ఉన్నాడు. మేము లింగబేధం లేకుండా అన్ని విషయాల గురించి చర్చించుకుంటాం. ఒకవేళ మేమిద్దరం సింగిల్‌గా ఉండి, పెళ్లి చేసుకుని ఉండుంటే ఎలా ఉండేదో అని కూడా అనుకుంటుంటాం. అయితే మా ఇద్దరి మధ్య గాఢమైన స్నేహం తప్ప ఎలాంటి రొమాంటిక్ సంబంధం లేదు. కానీ, నా భర్తకు మా స్నేహం గురించి తెలిసిన తర్వాత తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నాడు. అది చూస్తుంటే ‘నేను ఆయన్ని మోసం చేస్తున్నానా’ అన్న అనుమానం కలుగుతోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ పరిస్థితుల్లో నా సహోద్యోగి నుంచి నేను దూరం జరగాలా? నా భర్తకు తిరిగి నాపై నమ్మకం కలగాలంటే ఏం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు.

- ఓ సోదరి

జ. పెళ్లంటే ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి జీవించడమే కాదు. ఒకరి అభిప్రాయాలు, కష్టసుఖాలు మరొకరు పంచుకోవాలి. ఈ క్రమంలో ఒకరికొకరు అన్ని విషయాల్లో అండగా ఉంటూ తమ బంధాన్ని మరింత దృఢం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అయితే ఒకరిపై మరొకరికి నమ్మకం సడలకుండా, ఇద్దరి మధ్య భావోద్వేగపూరిత సంబంధం ఉంటేనే అది సాధ్యమవుతుంది.

మీ సహోద్యోగితో మీరు చనువుగా ఉంటున్నానని చెబుతున్నారు. అది మీ భర్తకు నచ్చడం లేదని.. దానివల్ల అతను అసౌకర్యానికి లోనవుతున్నాడని కూడా అంటున్నారు. అదే సమయంలో మీ సహోద్యోగితో కేవలం స్నేహం మాత్రమే ఉందని చెబుతున్నారు. అయితే మరొక వ్యక్తితో బలమైన బంధం ఉన్నప్పుడు.. అది కేవలం స్నేహమే అయినా సరే.. ఒక్కోసారి మీ దాంపత్య బంధంపై అంతే బలమైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కేవలం స్నేహంతోనే మీ ఇద్దరూ చనువుగా ఉంటున్నా.. అది మీ జీవిత భాగస్వామికి నచ్చనప్పుడు దూరంగా ఉండడం మంచిదేమో ఆలోచించండి. ఏ బంధానికైనా నమ్మకమే బలమైన పునాది. ఎప్పుడైతే అది కొరవడుతుందో ఆ బంధంలో కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఒకసారి మీ భర్తతో స్నేహపూర్వక వాతావరణంలో మాట్లాడండి. మీ ఇద్దరి మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందన్న విషయాన్ని అతనికి స్పష్టం చేయండి. ఒకవేళ అది తనకు అభ్యంతరకరంగా అనిపిస్తే మీ సహోద్యోగికి దూరంగా ఉండడానికి కూడా సిద్ధమన్న విషయాన్ని స్పష్టం చేయండి. దానివల్ల మీ భర్తకు మీపై నమ్మకం మరింత పెంపొందే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా సమస్య మరింత తీవ్రతరం కాకముందే సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్