చర్మం జిడ్డుగా ఉంటోందా.. అయితే ఇలా చేసి చూడండి!

జిడ్డు చర్మతత్వం ఉన్నవారు తరచూ తమ ముఖాన్ని శుభ్రం చేసుకొంటూ ఉంటారు. లేదంటే ముఖంపై చేరిన జిడ్డుకి దుమ్ము, ధూళి కూడా తోడై మొటిమలు, ఇతర చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి చర్మతత్వం ఉన్నవారు చర్మం పీహెచ్ విలువను సమతులపరచడం,  చర్మం విడుదల చేసే నూనెలను నియంత్రించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

Published : 24 Jan 2022 18:44 IST

జిడ్డు చర్మతత్వం ఉన్నవారు తరచూ తమ ముఖాన్ని శుభ్రం చేసుకొంటూ ఉంటారు. లేదంటే ముఖంపై చేరిన జిడ్డుకి దుమ్ము, ధూళి కూడా తోడై మొటిమలు, ఇతర చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి చర్మతత్వం ఉన్నవారు చర్మం పీహెచ్ విలువను సమతులపరచడం,  చర్మం విడుదల చేసే నూనెలను నియంత్రించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. దీనికోసం టోనర్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగని మార్కెట్లో దొరికే ఉత్పత్తులపై ఆధారపడకుండా.. ఇంట్లోనే సహజసిద్ధంగా తయారుచేసుకొన్న టోనర్‌ని ఉపయోగించడం మంచిది. మరి అదెలాగో తెలుసుకొందామా..

కీరాదోసతో..

చర్మానికి పోషణనందించి అందంగా తయారయ్యేలా చేస్తుంది కీరాదోస. దీనితో తయారుచేసుకొన్న టోనర్‌ని ఉపయోగించడం ద్వారా చర్మం శుభ్రపడటంతో పాటు మూసుకుపోయిన చర్మరంధ్రాలు తెరుచుకొంటాయి. ఫలితంగా చర్మం జిడ్డుగా మారడం తగ్గుతుంది. పొడిబారకుండానూ ఉంటుంది. దీనికోసం కీరాదోసను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. ఒక ప్యాన్‌లో రెండు కప్పుల నీటిని తీసుకొని దానిలో కీరాదోస ముక్కలు వేసి మరిగించాలి. నీరు సగం వరకు ఆవిరైన తర్వాత పొయ్యిమీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత దీన్ని బ్లెండర్ సాయంతో మిశ్రమంగా చేసుకొని శుభ్రమైన గాజు సీసాలో పోసి భద్రపరచుకోవాలి. దీనిలో దూదిని ముంచి రోజూ ఉదయం, సాయంత్రం ముఖాన్ని తుడుచుకోవడం ద్వారా చర్మం జిడ్డుగా మారకుండా కాపాడుకోవచ్చు.

పుదీనాతో..

పుదీనాలో ఉండే మెంథాల్ చర్మ గ్రంథుల నుంచి నూనెల విడుదల సమతులంగా ఉండేలా చేస్తుంది. దీని కారణంగా చర్మం జిడ్డుగా మారకుండా ఉంటుంది. ఈ ఫలితాన్ని పొందడం కోసం పుదీనాతో తయారుచేసుకొన్న టోనర్ వాడితే సరిపోతుంది. గుప్పెడు పుదీనా ఆకుల్ని తీసుకొని శుభ్రం చేసుకోవాలి. వీటిని మూడుకప్పుల నీటిలో వేసి బాగా మరగనివ్వాలి. గిన్నెలో నీరు సగం అయ్యేంత వరకు వేడిచేసి ఆ తర్వాత పొయ్యి మీద నుంచి దించేయాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత శుభ్రమైన గాజుసీసాలోకి వడపోసుకోవాలి. ఈ మిశ్రమంలో కాటన్‌పాడ్ ముంచి ముఖాన్ని తుడుచుకోవడం ద్వారా జిడ్డు చర్మం సమస్య తగ్గుముఖం పడుతుంది. ఇలా రోజుకి రెండుసార్లు చేయడం ద్వారా చక్కటి ఫలితం పొందవచ్చు.

టొమాటోలతో..

టొమాటోలో ఉండే సహజసిద్ధమైన ఆస్ట్రింజెంట్ గుణాలు చర్మం జిడ్డుగా మారకుండా చేస్తాయి. అలాగే మురికి కారణంగా మూసుకుపోయిన చర్మరంధ్రాలను తిరిగి తెరచుకొనేలా చేసి దురద, పొక్కులు వంటివి రాకుండా చేస్తాయి. దీనికోసం మధ్యస్థ పరిమాణంలో ఉన్న బాగా మగ్గిన టొమాటోలను తీసుకోవాలి. దీన్ని మెత్తగా చేసి రసాన్ని వేరు చేయాలి. ఈ జ్యూస్‌ను దూది సాయంతో ముఖానికి రాసుకొని పది నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత నీటితో కడిగేస్తే సరిపోతుంది. ఇలా రోజుకి రెండు సార్లు చేయడం ద్వారా చర్మం జిడ్డుగా మారే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

బియ్యపు నీటితో..

బియ్యం కడిగిన నీరు సైతం సౌందర్య సంరక్షణలో ఉపయోగపడుతుంది. ఈ నీరు వదులుగా మారిన చర్మాన్ని బిగుతుగా అయ్యేలా చేయడంతో పాటు.. చర్మం నుంచి విడుదలయ్యే నూనెలను నియంత్రిస్తుంది. అలాగే చర్మానికి రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేసి మేను ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ఫలితాలను పొందడం కోసం కొద్దిగా బియ్యం తీసుకొని వాటిని సరిపడినన్ని నీటిలో నానబెట్టాలి. నీరు పూర్తిగా తెల్లగా మారేంత వరకు ఆగాలి. అనంతరం బియ్యం నుంచి నీటిని వేరుచేసి సీసాలో నిల్వ చేసుకోవాలి. క్లెన్సింగ్ చేసుకొన్న అనంతరం బియ్యపు నీటిలో దూదిని ముంచి దానితో ముఖాన్ని తుడుచుకోవాలి. ఇలా రోజుకి రెండు సార్లు చేయడం ద్వారా చక్కటి ఫలితం కనిపిస్తుంది.

వేపాకులతో..

చర్మం నుంచి విడుదలయ్యే అధిక నూనెలను నియంత్రించడంలో వేప సమర్థంగా పనిచేస్తుంది. అలాగే జిడ్డు కారణంగా వచ్చే మొటిమలను సైతం తగ్గేలా చేసి చర్మానికి చక్కని పోషణ అందిస్తుంది. ఎలర్జీలు రాకుండా చేస్తుంది. వేపాకులతో మనం తయారుచేసుకొన్న టోనర్ ఉపయోగించడం ద్వారా జిడ్డు చర్మం సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. దీనికోసం గుప్పెడు వేపాకులను తీసుకొని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. రెండు కప్పుల నీటిని గిన్నెలో తీసుకొని కాస్త వేడిచేయాలి.. దీనిలో వేపాకులను వేసి మూతపెట్టి మరికొంత సమయం వేడిచేయాలి. ఆ తర్వాత గిన్నెను పొయ్యిమీద నుంచి దించి చల్లార్చాలి. అనంతరం ఈ నీటిని శుభ్రమైన సీసాలో వడపోసుకోవాలి. ముఖాన్ని శుభ్రం చేసుకొన్న తర్వాత ఈ నీటిలో దూదిని ముంచి ముఖానికి అప్త్లె చేసుకొంటే సరిపోతుంది. ఇలా రోజుకి రెండుసార్లు చేయడం ద్వారా చక్కటి ఫలితం పొందవచ్చు.

ఇవి కూడా..

* టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకొని దాన్ని కప్పు నీటిలో కలపాలి. దీన్ని దూది సాయంతో ముఖానికి అప్త్లె చేసుకొని కాసేపాగిన తర్వాత కడిగేస్తే సరిపోతుంది. ఇలా చేయడం ద్వారా ముఖంపై చేరిన ట్యాన్ తొలగిపోతుంది. పైగా చర్మం జిడ్డు కారకుండా ఉంటుంది.

* చర్మసౌందర్యాన్ని అందించే సహజసిద్ధమైన పదార్థాల్లో ముందు వరుసలో ఉంటుంది కలబంద. ఇది చర్మం పీహెచ్ స్థాయిని నియంత్రించడమే కాకుండా.. చక్కని పోషణ అందిస్తుంది. దీని సాయంతో మనం తయారుచేసుకొన్న టోనర్ చర్మం జిడ్డుగా మారకుండా కాపాడుతుంది. దీనికోసం రెండు టీస్పూన్ల కలబంద జెల్‌ను తీసుకొని మూడు నుంచి నాలుగు టేబుల్‌స్పూన్ల చల్లని నీటిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకొని కాసేపాగిన తర్వాత కడిగేస్తే సరిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్