Updated : 17/08/2021 18:35 IST

అది చూసే ఫిదా అయిపోయా!

సెలబ్రిటీలే అయినా కొందరు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్నీ అందరితో పంచుకుంటే.. మరికొందరు మాత్రం వీటిని చాలా గోప్యంగా ఉంచుతుంటారు. లవ్‌బర్డ్స్‌ నయనతార-విఘ్నేష్‌ శివన్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు..! తమ మధ్య ఉన్న ప్రేమబంధాన్ని ఎప్పుడూ ఫొటోల రూపంలో చెప్పడమే కానీ.. మాటల రూపంలో అధికారికంగా పంచుకుంది లేదు. కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ గురించి, నిశితార్థం గురించి తనే కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది లేడీ సూపర్ స్టార్. తనకు విఘ్నేష్‌తో నిశ్చితార్థమైందని, ఇదే తమ ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ అని అందరికీ చూపించింది. పనిలో పనిగా తమ ప్రేమ కథ గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఇన్నాళ్లూ పెదవి దాటని మాట ఇదే!

దక్షిణాది చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగింది నయనతార. ఇక విఘ్నేష్‌ తమిళంలో పేరున్న దర్శకనిర్మాత. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవడం మనకు తెలిసిందే! ఇన్నాళ్లూ విఘ్నేష్‌తో తన ప్రేమబంధం గురించి తనంతట తానుగా నోరు విప్పని నయన్‌.. తాజాగా ఓ టీవీ షోలో భాగంగా కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘ఇదిగో ఇదే నా నిశ్చితార్థపు ఉంగరం. మా వ్యక్తిగత విషయాల గురించి బయటికి చెప్పడం నాకు, విఘ్నేష్‌కు పెద్దగా నచ్చదు. వేడుకల్నీ నిరాడంబరంగా జరుపుకోవడానికే ఇష్టపడతాం. అందుకే ఎంగేజ్‌మెంట్‌ కూడా మా దగ్గరి కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్‌గా చేసుకున్నాం. పెళ్లి ముహూర్తం ఇంకా ఖరారు కాలేదు. ఫిక్సయ్యాక తప్పకుండా మీ అందరికీ చెబుతా. మా పెళ్లి గురించి ఎప్పటికప్పుడు రూమర్స్‌ వస్తూనే ఉన్నాయి. కానీ మా ఇద్దరికీ వృత్తిపరంగా కొన్ని లక్ష్యాలున్నాయి. అందుకే ఇప్పటిదాకా పెళ్లి గురించి ఆలోచించలేదు..’ అంది నయన్.

చూపులు కలిసిన శుభవేళ!

2015లో విఘ్నేష్‌ దర్వకత్వం వహించిన ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ అనే సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా సెట్స్‌ నుంచే వీళ్ల ప్రేమ మొదలైందని చెప్పచ్చు. సినిమా చిత్రీకరణ సమయంలో ఒకరినొకరు ఇష్టపడిన ఈ ముద్దుల జంట.. అప్పట్నుంచి గాఢమైన ప్రేమలో మునిగిపోయారు. ఇద్దరి పుట్టినరోజులు, న్యూ ఇయర్‌, వేలంటైన్స్‌ డే.. వంటి ప్రత్యేక సందర్భాలను విదేశాల్లో సెలబ్రేట్‌ చేసుకుంటూ.. అక్కడ దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో తమ ఫ్యాన్స్‌తో పంచుకునేవారు. అయితే అది కూడా చాలా అరుదుగానే! ఇవి చూసి అభిమానులంతా వీళ్లది ప్రేమేనని అర్థం చేసుకున్నారు.. కానీ తమ ప్రేమ గురించి తమంతట తాముగా బహిర్గతం చేయలేదు ఈ క్యూట్‌ కపుల్.

తనెక్కడుంటే అక్కడే స్వర్గం!

ఇక దాస్తే లాభం లేదనుకున్నాడో, ఏమో గానీ తమ ప్రేమ విషయం గురించి ఇటీవలే ఓ సోషల్‌ మీడియా చాట్‌లో భాగంగా వెల్లడించాడు విఘ్నేష్‌. సందర్భం వచ్చినప్పుడల్లా తన లేడీ లవ్‌తో కలిసి దిగిన ఫొటోల్ని పంచుకుంటూ సంబరపడిపోయే ఈ డైరెక్టర్‌.. ఈసారి మాత్రం నయన్‌లో తనకు నచ్చిన బోలెడన్ని అంశాల్ని షేర్ చేసుకున్నాడు.

‘నయన్‌ గురించి అడిగిన ప్రతిసారీ ఎంతో గర్వంగా ఫీలవుతుంటా. తనతో గడిపిన ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తుంటా. ఆమెతో కలిసి ఏ ప్రదేశానికి వెళ్లడాన్ని ఇష్టపడతారని చాలామంది నన్ను అడుగుతుంటారు. అందుకు నా సమాధానం ఒక్కటే.. తనెక్కడుంటే అదే నా ఫేవరెట్‌ ప్లేస్! ఇక నయన్‌కు చీరలు బాగా నప్పుతాయి. అందుకే తను చీర కట్టుకుంటేనే ఎంతో క్యూట్‌గా ఉంటుంది. తను వంట బాగా చేస్తుంది. ముఖ్యంగా నాకోసం చేసే నెయ్యి అన్నం, చికెన్‌ కర్రీ అంటే లొట్టలేసుకొని మరీ తింటా..! తనలో నచ్చే క్వాలిటీ గురించి చెప్పాలంటే.. అది ఆమె ఆత్మవిశ్వాసమే!’ అంటూ తన ఫియాన్సీ గురించి మనసులోని మాటల్ని బయటపెట్టాడీ రొమాంటిక్‌ డైరెక్టర్.

అలా ఫిదా అయిపోయా!

నయన్‌లో ఉన్న ఆత్మవిశ్వాసమే తనని కట్టిపడేసిందని విఘ్నేష్‌ అంటే.. తన మంచి మనసు, సపోర్టింగ్‌ నేచర్‌ నా మనసును తనకు అంకితం చేసేలా చేశాయంటోందీ లేడీ స్టార్. ‘నా జీవితంలో నేను కలిసిన మంచి మనుషుల్లో విఘ్నేష్‌ ఒకరు. తను నా జీవితంలోకొచ్చినప్పట్నుంచి నాకు బాగా కలిసొచ్చింది. నా కెరీర్‌ గురించి మరింత శ్రద్ధ పెట్టడంలో ఆయన చూపిన చొరవ మరవలేను. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆయనతో పరిచయమయ్యాకే నేను నా కెరీర్‌లో బిజీగా మారిపోయా. నేను చేసే ప్రతి పనిలోనూ ఉత్తమంగా రాణించాలని కోరుకునే మంచి వ్యక్తి తను. విఘ్నేష్‌ నన్నెంత సపోర్ట్‌ చేస్తారో.. తన ఇంటికీ అంతే ప్రాధాన్యమిస్తారు. ఆయనలో నాకు నచ్చిన అంశం ఇదే! ఆయనతో పరిచయమైన ఈ ఆరేళ్లుగా చూస్తున్నా.. భోంచేసే ముందు రోజూ ఇంటికి ఫోన్‌ చేసి వాళ్లు తిన్నాకే తినడం ఆయనకు అలవాటు! తనలో ఉన్న ఈ కేరింగ్‌ నేచరే నన్ను ఫిదా చేసేసింది..’ అంటూ తన బాయ్‌ఫ్రెండ్‌పై తన మనసు లోతుల్లో దాగున్న ప్రేమను ఓ సందర్భంలో బయటపెట్టిందీ లేడీ డాన్.

ఇక లాక్‌డౌన్‌ సమయంలో ఇద్దరూ కలిసి మరింత సమయం గడిపిన ఈ జంట.. తమ కుటుంబాలతో గడపడానికీ తగిన సమయం కేటాయిస్తుంటారు. ప్రస్తుతం విఘ్నేష్ దర్శకత్వం వహిస్తున్న ‘కాతు వాకుల రెండు కాదల్‌’ అనే సినిమాలో నటిస్తోంది నయన్.

BmGcB4kDIUj

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని