Published : 02/10/2021 11:29 IST

ఇంట్లోనే ఉల్లి సాగు చేద్దాం..!

‘ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు’ అని ఓ సామెత ఉంది. నిజమే పొట్టనిండా పోషకాలు నింపుకున్న ఉల్లిపాయ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. గుండె జబ్బుల నివారణకు, రక్త ప్రసరణ మెరుగుపడడానికి, కేశ సంపదకు.. ఇలా అటు ఆరోగ్యపరంగా, ఇటు అందానికీ ఉల్లి ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు ఏ వంటకమైనా సరే రుచిగా రావాలంటే అందులో ఉల్లిపాయల్ని వేయాల్సిందే! అయితే వీటికోసం మార్కెట్లకు పరుగులు పెట్టే వారు కొందరైతే.. ఇంట్లోనే సాగు చేసుకునే వారు మరికొందరు. ఇలా ఇంట్లోనే ఉల్లిపాయల్ని పెంచుకోవడం వల్ల ఉల్లి ధరలు ఆకాశాన్నంటినప్పుడు కూడా ఎలాంటి కొరతా లేకుండా వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇంట్లో ఉల్లి సాగా.. కాస్త కష్టంగా ఉంటుందేమో.. అనుకుంటే పొరపాటే! ఎందుకంటే కాస్త ఓపిక, శ్రద్ధ పెడితే ఇంటి వరండాలోనే ఎంచక్కా ఉల్లిపాయల్ని సాగు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం రండి..

ఇటీవలి కాలంలో ‘ఇంటి పంట’ పేరుతో చాలామంది ఇంట్లోనే వివిధ రకాల కాయగూరలు, ఆకుకూరల్ని సాగు చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ‘టెర్రస్‌ గార్డెన్‌’ పేరుతో మేడపై కూరగాయలు పండించడం, పూల మొక్కల్ని పెంచడం ఇప్పుడో ట్రెండ్‌. ఎలాంటి రసాయనిక ఎరువులు ఉపయోగించకుండా ఇంట్లోని వ్యర్థాలను సహజ ఎరువులుగా మార్చి వీటిని పండిస్తున్నారు గార్డెనింగ్‌ ప్రియులు. ఈ క్రమంలో ఉల్లి సాగు చేసుకునే వారు కాస్త తక్కువ శాతమనే చెప్పుకోవాలి. అయితే ఉల్లిని సాగు చేయడానికి అంతగా కష్టపడాల్సిన పనిలేదు. అంతేకాదు.. దీనికి నీటి వినియోగం కూడా తక్కువే. కాస్త చల్లటి వాతావరణం ఉంటే సరిపోతుంది. చిన్న చిన్న డబ్బాల్లో ఇంటి ఆవరణలో, మేడపై కూడా ఉల్లిని పండించుకోవచ్చు. ఇందుకోసం సారవంతమైన మట్టిని ఉపయోగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో ఉల్లిని సాగు చేయడానికి రెండు పద్ధతులున్నాయి. ఇక ఇంట్లో ఉండే ఉల్లిపాయలను కూడా విత్తనాలుగా ఉపయోగించవచ్చు. వీటిని ఉపయోగించి సుమారు మూడు నాలుగు నెలల్లోనే ఉల్లిపాయలను పండించుకోవచ్చు.

విత్తనాలతో..

విత్తనాలను విత్తడం ద్వారా ఇంట్లోనే ఉల్లిని పండించుకోవచ్చు. సాధారణంగా ఉల్లి విత్తనాలు బయట దుకాణాలతో పాటు, ఇప్పుడు ఆన్‌లైన్‌ స్టోర్స్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. 

* ముందుగా విత్తనాలను శుభ్రం చేసి ఒక రోజుపాటు నీటిలో నానబెట్టాలి. అనంతరం వాటిని తుడిచి రెండు నుంచి మూడు రోజులపాటు బయట నీడలో ఆరబెట్టాలి. ఆ తర్వాత కాస్త లోతుగా ఉన్న ఒక ట్రేలో మట్టిని తీసుకొని దానిలో విత్తనాలను నాటి క్రమం తప్పకుండా నీటిని చల్లుతూ ఉండాలి. ఈ క్రమంలో విత్తనం మొలకెత్తడానికి సుమారు 6 నుంచి 8 వారాలు పడుతుంది.

* విత్తనాలు మొలకెత్తేలోపు ఇంటి బయట గార్డెన్‌లో లేదా మేడపై కుండీలో ఉల్లి మొలకలను నాటడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. ముఖ్యంగా సారవంతమైన మట్టితో పాటు సహజ ఎరువులను ఉపయోగించాలి. మట్టితో పాటు ఆవు పేడను కలిపితే సహజసిద్ధమైన ఎరువు తయారైనట్లే! ప్రస్తుతం ఆన్‌లైన్‌ స్టోర్స్‌లో ‘ఆర్గానిక్‌ ఫెర్టిలైజర్లు’ అందుబాటులో ఉంటున్నాయి.. వాటిని కూడా ఉపయోగించవచ్చు.

* విత్తనాలు మొలకెత్తిన తర్వాత వాటిని అప్పటికే సిద్ధం చేసుకున్న మట్టిలో సుమారు 4 ఇంచుల లోతులో నాటాలి. రెండు మొక్కలకు కనీసం మూడు ఇంచుల దూరం ఉండేలా చూసుకోవాలి. ఉల్లి పంటకు తగిన రీతిలో ఎండ తగిలేలా జాగ్రత్త వహించాలి. ఐదు నుంచి ఆరు నెలల తర్వాత ఉల్లిపాయలు తయారవుతాయి. ఉల్లి పై భాగం మట్టిలో నుంచి బయటకు వచ్చినట్లుగా కనిపిస్తే ఉల్లి ఉపయోగించుకోవడానికి సిద్ధమైనట్లే అని అర్థం.

* ఉల్లిని బయటకు తీసే ముందు రోజు నుంచి ఆ మొక్కలకు నీటిని పోయకూడదు. అనంతరం ఉల్లిని మట్టిలో నుంచి బయటకు తీసి పైన ఉండే ఉల్లి కాడలను కత్తిరించాలి. ఈ ఆకులను కూడా వంటల్లో ఉపయోగించుకోవచ్చనే విషయం మనకు తెలిసిందే.

* బయటకు తీసిన ఉల్లిని వెంటనే ఉపయోగించకుండా కొద్ది సమయం పాటు కాస్త ఎండలో ఆరబెట్టి అనంతరం వంటల్లో వాడుకోవచ్చు. తద్వారా వాటిలో ఉండే తేమకు అవి కుళ్లిపోకుండా జాగ్రత్తపడచ్చు.

 

ఇంట్లో ఉండే ఉల్లిపాయలతో...

ఇక ఇంట్లో ఉండే ఉల్లిపాయలను కూడా విత్తనాలుగా ఉపయోగించవచ్చు. వీటిని ఉపయోగించి సుమారు మూడు నాలుగు నెలల్లోనే ఉల్లిపాయలను పండించుకోవచ్చు.

* ఇందుకోసం ముందుగా ఒక తాజా ఉల్లిపాయను తీసుకొని కింది నుంచి ఒక ఇంచుపై వరకు కట్‌ చేయాలి. దానిపై ఉండే పొట్టు తొలగించాలి.

* తర్వాత ఒక చిన్న గ్లాసులో పై వరకు నీటిని తీసుకోవాలి. ఇంతకు ముందు కత్తిరించిన ఉల్లి కింది భాగం నీటిలో తాకేలా ఉంచాలి. వారం రోజులపాటు వాటిని అలాగే ఉంచడం వల్ల వాటికి చిన్న తెల్లటి మొలకలు రావడం గమనించచ్చు.

* తర్వాత కుండీ లేదా తొట్టిలో లేదంటే గార్డెన్‌లో ఇంతకుముందు చెప్పినట్లుగానే సారవంతమైన మట్టిని సిద్ధం చేసుకోవాలి. ఈ మట్టిలో మొలకలొచ్చిన ఉల్లి ముక్కలను పాతిపెట్టాలి.

* ఇలా ఉల్లి నాటిన ప్రదేశంలో క్రమం తప్పకుండా నీటిని చల్లుతూ/పోస్తూ సూర్యరశ్మి పడేలా జాగ్రత్తపడాలి. కొన్ని రోజుల తర్వాత ఉల్లికాడలు మొలుస్తాయి. సుమారు 90 నుంచి 120 రోజుల్లో అంటే నాలుగైదు నెలల్లో పూర్తిస్థాయి ఉల్లి తయారవుతుంది. 

అయితే ఈ ఉల్లిపాయల సాగు కోసం పాడైపోయిన ఉల్లిని కాకుండా తాజాగా ఉండేదాన్ని ఎంచుకుంటే ఉల్లి త్వరగా, ఆరోగ్యవంతంగా ఎదుగుతుంది.

సో.. చూశారుగా ఇంట్లోనే ఉల్లిని ఎంత ఈజీగా సాగు చేసుకోవచ్చో..! మరి, మీరూ ఈ పద్ధతుల్ని ఫాలో అయిపోయి తాజాగా, సహజసిద్ధంగా సాగు చేసిన ఉల్లిపాయల్ని కూరల్లో భాగం చేసుకోండి.. ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి..!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని