Paper Queen: పేపర్‌తో అందమైన దుస్తులు రూపొందిస్తోంది!
అరుదైన క్రాఫ్టింగ్ నైపుణ్యాలకు డిజైనింగ్ మెలకువల్ని జోడిస్తూ ‘పేపర్ క్వీన్’గా మారిపోయిన యువ ఫ్యాషన్ డిజైనర్ స్ఫూర్తిదాయక గాథ ఇది!
(Photos: Instagram)
‘కేన్స్’ వంటి చిత్రోత్సవాలు, ‘మెట్‌గాలా’ తరహా ఫ్యాషన్ పరేడ్లలో ముద్దుగుమ్మలు ధరించే మోడ్రన్ దుస్తులు అద్భుతః అనిపిస్తాయి. ఖరీదైన ఫ్యాబ్రిక్స్‌తో నెలల తరబడి కష్టించి రూపొందించే ఈ దుస్తులు డిజైనర్ల ఫ్యాషన్ అభిరుచులకు అద్దం పడుతుంటాయి. అలాంటి ఫ్యాషన్స్‌కు పేపర్‌తో పునఃసృష్టి చేస్తూ సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకుంది మధ్యప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల అపేక్షా రాయ్. వెస్ట్రన్ దగ్గర్నుంచి.. భారతీయ సంప్రదాయ చీరకట్టు దాకా.. అది ఎంత కష్టమైన డిజైన్ అయినా.. పేపర్, సూది, దారంతోనే వాటికి ప్రతిరూపమిస్తోందామె. అసలు డ్రస్‌ను, అపేక్ష పేపర్ డ్రస్‌ను పక్కపక్కన పెట్టి చూస్తే.. రంగులో తేడా కనిపించచ్చు.. కానీ డిజైన్‌లో మాత్రం ఇసుమంతైనా తేడా ఉండదు! అలా తనలోని అరుదైన క్రాఫ్టింగ్ నైపుణ్యాలకు డిజైనింగ్ మెలకువల్ని జోడిస్తూ ‘పేపర్ క్వీన్’గా మారిపోయిన ఈ యువ ఫ్యాషన్ డిజైనర్ స్ఫూర్తిదాయక గాథ ఇది!
అపేక్షది మధ్యప్రదేశ్ పన్నా జిల్లాలోని సుదోర్ అనే చిన్న గ్రామం. వ్యవసాయాధారిత కుటుంబం ఆమెది. ఆర్థిక పరిస్థితులూ అంతంతమాత్రమే! పైగా బాల్య వివాహాలు కూడా అక్కడ ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ తరహా ఒత్తిడే ఆమెకు, ఆమె అక్కకు ఎదురైంది. బంధువులు, గ్రామంలోని ఇరుగుపొరుగు వాళ్లు ‘అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసేయక.. ఇంకా చదివిస్తున్నారా?’ అనేవారు. కానీ తన తండ్రి ప్రోత్సాహంతో ఇవేవీ పట్టించుకోలేదామె.
యూట్యూబ్ వీడియోలు చూసి..!
చిన్న వయసు నుంచే క్రాఫ్టింగ్, ఫ్యాషన్ డిజైనింగ్‌పై మక్కువ చూపేది అపేక్ష. ఆమె తండ్రి స్థానికంగా చిన్న కిరాణా కొట్టు నడిపేవారు. దీంతో ఆ షాపులో వృథాగా పడేసే ప్యాకెట్ కవర్లు, చిప్స్ కవర్లతో వివిధ రకాల డ్రస్సులు కుట్టేదామె. అంతేకాదు.. ఇంట్లో ఉండే పాత బట్టలతో కొత్త తరహా దుస్తులూ రూపొందించేదాన్నని చెబుతోంది.
‘స్కూల్ నుంచి ఇంటికి రాగానే.. అమ్మ పాత చీరలతో నాకు నచ్చినట్లుగా వివిధ రకాల డ్రస్సులు కుట్టేదాన్ని. ఆపై యూట్యూబ్ వీడియోలు చూసి డ్రస్ డిజైనింగ్‌లో మరిన్ని మెలకువలు నేర్చుకున్నా. ఈ నైపుణ్యాలతో క్రమంగా స్కెచ్‌లు గీయడమూ అలవాటు చేసుకున్నా. ఆపై కొన్నాళ్లకు ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో నా పేరును నమోదు చేసుకున్నా. అక్కడ కుట్లు, అల్లికలు నేర్చుకున్నా. కుట్టు మిషన్ కొనే స్థోమత కూడా లేక.. వార్తా పత్రికలు సేకరించే డీలర్ల దగ్గర్నుంచి తక్కువ ధరకే పేపర్లు కొనుగోలు చేసేదాన్ని. అలా వాటితో కొత్త కొత్త ఫ్యాషనబుల్ దుస్తుల్ని రూపొందించడం మొదలుపెట్టా..’ అంటోన్న అపేక్ష.. స్థానికంగా ఉన్న కంటెంట్/వీడియో క్రియేటర్స్ సహాయంతో తాను రూపొందించే పేపర్ డ్రస్సెస్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది.
పేపర్‌తో.. ఏ ఫ్యాషనైనా!
కేవలం తన పేపర్ డ్రస్ ఫొటోలే కాదు.. డ్రస్ డిజైనింగ్ వీడియోలనూ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించింది అపేక్ష. ‘వీడియో చిత్రీకరించే క్రమంలో ఎక్కువ సమయం మొబైల్‌తోనే గడపాల్సి వచ్చేది. అప్పుడు చూసేవాళ్లు.. ‘ఇంత సేపు ఫోన్లో ఎవరితో మాట్లాడుతుందో?’ అని గుసగుసలాడుకునే వారు. మరికొందరు నేను సన్నగా ఉన్నానని, చెత్త సేకరించేదాన్నని నానా మాటలూ అనేవారు. మొదట్లో కాస్త బాధనిపించినా.. క్రమంగా వాటిని పట్టించుకోవడం మానేశా. ఆపై క్రమంగా నా ఫ్యాషన్ నైపుణ్యాలకు సానుకూల స్పందన రావడం, నేను రూపొందించే పేపర్ దుస్తులకు సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్లు రావడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇకపైనా ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తా..’ అంటోన్న ఈ యువ ఫ్యాషనర్.. బాల్ గౌన్, పెప్లమ్, షోల్డర్ వెడ్జ్, అసిమెట్రికల్, ఎ-లైన్.. ఇలా ఎలాంటి ఫ్యాషనబుల్ అవుట్‌ఫిట్‌నైనా పేపర్‌తో రూపొందించడంలో దిట్ట. అంతేకాదు.. తన పేపర్ ఫ్యాషన్స్‌ని స్థానికంగా పలు ఫ్యాషన్ వేదికల పైనా ప్రదర్శించి అందరి దృష్టినీ ఆకర్షించిందీ యంగ్ డిజైనర్.
ఆయన దగ్గర పనిచేయాలనుంది!
ఇక మెట్‌గాలా ఈవెంట్‌లో దీపికా పదుకొణె ధరించిన గౌన్, నోరా ఫతేహి మర్మెయిడ్ లుక్.. వంటి క్లిష్టమైన డిజైన్లనూ గంటల వ్యవధిలోనే పేపర్‌తో రూపొందిస్తూ.. అటు ఫ్యాషన్ ప్రియుల్ని, ఇటు పలువురు ఫ్యాషనర్ల ప్రశంసలూ అందుకుంటోంది అపేక్ష. ప్రస్తుతం దూర విద్య ద్వారా బీఏ (ఆనర్స్) రెండో సంవత్సరం చదువుతోన్న ఆమె.. భవిష్యత్తులో ఫ్యాషన్ డిజైనర్‌గా ఎదగడమే తన లక్ష్యమంటోంది.
‘ప్రస్తుతం పేపర్‌తో ఫ్యాషనబుల్ దుస్తులు రూపొందించడంతో పాటు.. కంటెంట్ క్రియేటర్‌గానూ.. ఈ క్రాఫ్ట్‌కు సంబంధించిన మెలకువల్ని బోధిస్తున్నా. భవిష్యత్తులో గొప్ప ఫ్యాషన్ డిజైనర్ కావాలనుంది. ఈ క్రమంలోనే ఖరీదైన మెటీరియల్‌తో సరికొత్త ఫ్యాషనబుల్ దుస్తులు రూపొందించి.. విక్రయించాలనుకుంటున్నా. ఎప్పటికైనా మనీష్ మల్హోత్రా వద్ద పనిచేయాలని.. మెట్ గాలా కోసం ఓ అందమైన డ్రస్ రూపొందించాలని కలలు కంటున్నా.. దీన్ని నెరవేర్చుకునే దిశగా ముందుకు సాగుతున్నా..’ అంటూ చెబుతోన్న అపేక్ష.. తన అరుదైన ఫ్యాషన్ క్రాఫ్టింగ్ మెలకువలతో ‘పేపర్ క్వీన్’గా పేరు తెచ్చుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.