ఆ దేశాల్లో పిల్లల్ని ఎలా పెంచుతారో తెలుసా?

పిల్లల్ని చిన్నతనం నుంచి పెంచే విధానాన్ని బట్టే పెద్దయ్యాక వాళ్ల ప్రవర్తన ఆధారపడి ఉంటుందన్నది చాలామంది నమ్మకం. ఈ క్రమంలోనే ఎంతో క్రమశిక్షణతో పెంచుతుంటాం. రెండేళ్లు దాటగానే బడికి పంపడం, చిన్న పొరపాటుకే చీవాట్లు పెట్టడం, ఎప్పుడు చూసినా చదువు చదువు అంటూ వాళ్ల వెంట పడడం..

Updated : 13 Sep 2022 15:05 IST

పిల్లల్ని చిన్నతనం నుంచి పెంచే విధానాన్ని బట్టే పెద్దయ్యాక వాళ్ల ప్రవర్తన ఆధారపడి ఉంటుందన్నది చాలామంది నమ్మకం. ఈ క్రమంలోనే ఎంతో క్రమశిక్షణతో పెంచుతుంటాం. రెండేళ్లు దాటగానే బడికి పంపడం, చిన్న పొరపాటుకే చీవాట్లు పెట్టడం, ఎప్పుడు చూసినా చదువు చదువు అంటూ వాళ్ల వెంట పడడం.. ఇలా వాళ్లకు ఇంట్లో కాదు.. ఓ బందీఖానాలో ఉన్న ఫీలింగ్‌ కలిగేలా చేస్తుంటారు కొంతమంది తల్లిదండ్రులు. అయితే పిల్లల్ని సన్మార్గంలో పెట్టాలన్న ఆరాటంతో ఓ పేరెంటింగ్ స్టైల్‌కు అలవాటు పడిపోయిన మనకు.. బయటి దేశాల్లోని పేరెంటింగ్‌ స్టైల్స్‌ని చూస్తే ఒకింత ఆశ్చర్యం కలగకమానదు. ఎందుకంటే అక్కడ క్రమశిక్షణతో పాటు చిన్నతనం నుంచే స్వతంత్రంగా బతకడం ఎలాగో కూడా వాళ్లకు నేర్పిస్తుంటారు. తద్వారా వాళ్లకు పెద్దయ్యే క్రమంలో ఎవరిపై ఆధారపడకుండా జీవించడమెలాగో తెలుస్తుందనేది వాళ్ల భావన. మరైతే ఆలస్యమెందుకు.. ఏయే దేశాల్లో ఎలాంటి పేరెంటింగ్‌ స్టైల్స్‌ ఉన్నాయో తెలుసుకుందాం రండి..

ఏ పనైనా సొంతంగానే!

చిన్న పిల్లల్ని ఒంటరిగా బడికి పంపడానికి మనకు మనసొప్పదు. ఎందుకంటే ఏదైనా అనుకోని ప్రమాదం ఎదురైతే ఎలా? అన్న భయమే ఇందుకు కారణం! ఈ క్రమంలోనే వాళ్లను స్కూల్‌ దగ్గర దిగబెట్టి రావడం, సాయంత్రం తిరిగి తీసుకురావడం.. వంటివి చేస్తుంటారు చాలామంది తల్లిదండ్రులు. అయితే జపాన్‌లో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం! అక్కడ ఆరేళ్లొచ్చిన పిల్లలు సొంతంగానే స్కూలుకెళ్లడాన్ని ప్రోత్సహిస్తారట పేరెంట్స్‌. అంతేకాదు.. కొట్టుకెళ్లి సరుకులు తీసుకురావడం, వాళ్లకు అవసరమైనవి వాళ్లే కొని తెచ్చుకోవడం, ఒంటరిగానే ప్రజా రవాణాను ఉపయోగించడం.. వంటివి అలవాటు చేస్తారట! దీనివల్ల వాళ్లు ఎలాంటి పరిస్థితులనైనా సొంతంగా ఎదుర్కోగలుగుతారని, ధైర్యంగా ముందుకెళ్లగలుగుతారనేది వాళ్ల అభిప్రాయం. ఇలాంటి పేరెంటింగ్‌ స్టైల్‌ అక్కడ దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తుంటుంది.

పిల్లల్ని దండించడం నిషిద్ధం!

పిల్లల అల్లరికి కళ్లెం వేయడానికి మనం చేసే పని ఓ దెబ్బ వేయడం, రెండు చీవాట్లు పెట్టడం. ఇలా మన పిల్లల్ని దండించే అధికారం, స్వేచ్ఛ మనకు ఉన్నాయి. అయితే స్వీడన్‌లో మాత్రం ఇలాంటి దండనను 1979లోనే నిషేధించారట! ఎందుకంటే చిన్నారుల్ని కొట్టడం, తిట్టడం వల్ల అంతిమంగా అది వారి మానసిక వికాసంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, తద్వారా వాళ్లు చదువులో, ఇతర విషయాల్లో వెనకబడిపోయే ప్రమాదం ఉందనే ఇలా చేశారంటున్నారు అక్కడి నిపుణులు. స్వీడన్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మరికొన్ని దేశాలు కూడా పాటించడం గమనార్హం.

పడుకోమని తొందరపెట్టరు!

పిల్లలు రాత్రుళ్లు త్వరగా పడుకుంటే ఉదయం త్వరగా లేస్తారన్నది మన నమ్మకం. కానీ స్పెయిన్‌, అర్జెంటీనా.. వంటి దేశాల్లో చిన్నారులు కాస్త ఆలస్యంగా పడుకోవడాన్నే ప్రోత్సహిస్తారట అక్కడి తల్లిదండ్రులు! ఎందుకంటే పేరెంట్స్‌ పనులన్నీ పూర్తయి.. పిల్లలతో కాస్త గడిపేందుకు ఇదే అనువైన సమయమని వారి భావన. తద్వారా ఇద్దరి మధ్య అనుబంధం రెట్టింపవుతుందనే వారిలా చేస్తారట!

ఏడేళ్ల దాకా బడికి పంపరు!

సాధారణంగా మనమైతే పిల్లలకు రెండేళ్లు దాటగానే లేదంటే అప్పుడప్పుడే మాటలొస్తున్నట్లయితే వెంటనే ప్లే స్కూల్లో చేర్పిస్తుంటాం. కానీ ఫిన్లాండ్‌ తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఏడేళ్ల వయసొచ్చేదాకా బడికే పంపరట! ఇక ఎప్పుడైనా ఎక్కువ రోజులు సెలవులొచ్చినా.. ప్రాజెక్ట్‌ వర్క్‌, హోంవర్క్‌ ఇవ్వకుండా ఇతర పిల్లలతో కలిసి ఆడుకోవడాన్నే ప్రోత్సహిస్తారట! ఇలా ఆటలతో మమేకమైన పిల్లలు ఇటు శారీరకంగా, అటు మానసికంగా మరింత దృఢంగా ఉంటారంటున్నారు అక్కడి పేరెంట్స్‌. తద్వారా చదువులోనూ రాణించగలరని చెబుతున్నారు.

ఏడ్చీ ఏడ్చీ వాళ్లే ఊరుకుంటారులే..!

పిల్లలు ఏడిస్తే, అలిగితే మనం తట్టుకోలేం.. వాళ్లను దగ్గరికి తీసుకోవడం, బుజ్జగించడం, తాయిలాలివ్వడం.. ఇలా ఎలాగోలా వాళ్ల అలక తీరుస్తాం.. ఏడుపు ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటాం. అయితే ఇలాంటి బుజ్జగింపులన్నీ ఇటలీలో చెల్లవట! ఎందుకంటే పిల్లల్ని ఇలా బుజ్జగించడం, బతిమాలడం చేస్తే వాళ్లు మరింత మొండిగా తయారవుతారని.. అది వారి ఎదుగుదల, క్రమశిక్షణపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అక్కడి వారి నమ్మకం. అందుకే చిన్నారులు ఏడ్చినా, అలిగినా పట్టించుకోకుండా వాళ్లకు ఓపిక ఉన్నంత సేపు ఏడవనీ అని వదిలేస్తారట! తద్వారా అనవసర విషయాలకు ఏడవకూడదన్న విషయం అర్థం చేసుకొని ఇకపై అలా చేయరని అక్కడి తల్లిదండ్రుల అభిప్రాయం.

ఇట్స్‌ ఫ్యామిలీ టైమ్!

* వియత్నాం, చైనా.. వంటి దేశాల్లో పిల్లలకు తొమ్మిది నెలలు దాటినప్పట్నుంచే సొంతంగా టాయిలెట్‌కి వెళ్లడం అలవాటు చేస్తారట! ఇందుకోసం పిల్లలకు Split Crotch Pants (వెనక వైపు ఓపెన్‌ ఉన్నవి) వేస్తారట!

* చైనాలో పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఎంత ఉంటుందో.. గ్రాండ్‌ పేరెంట్స్‌ పాత్రా అంతే ఉంటుందంటున్నారు అక్కడి పేరెంటింగ్‌ నిపుణులు. తద్వారా పెద్దల అనుభవంతో వాళ్లు అన్ని విషయాల్లో చురుగ్గా తయారవుతారనేది వాళ్ల నమ్మకం.

* ఈజిప్ట్‌, ఇటలీ, అర్జెంటీనా.. వంటి దేశాల్లో పిల్లల్ని ఫ్యామిలీ లంచ్‌, డిన్నర్‌లోనూ భాగం చేస్తారట! తద్వారా వాళ్లకు ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లు అలవడతాయనే ఇలా చేస్తారట! ఇక ఫ్రాన్స్‌లో పిల్లలు చిన్నతనం నుంచే పండ్లు, ఇతర ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల్ని తినేలా ప్రోత్సహిస్తారట!

భలే ఉన్నాయి కదా.. వీళ్ల పేరెంటింగ్‌ స్టైల్స్‌! అయినా పిల్లల్ని ఇలానే పెంచాలన్న నియమం ఎక్కడా లేదు. వాళ్లు పెరిగి పెద్దయ్యాక మంచి నడవడికను అలవర్చుకోవాలన్నదే తల్లిదండ్రులందరి ఆరాటం. మరి, ఈ విషయంపై మీరేమంటారు? మీ పేరెంటింగ్‌ స్టైల్‌ ఏంటి? మాతో పంచుకోండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్